రాజమహేంద్రవరం క్రైం: ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టేందుకు ప్రయత్నించే అక్రమార్కుల నుంచి వాటిని రాబట్టేందుకు చర్యలు తీసుకున్నామని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ రీజనల్ ఆఫీసర్ టి.రాంప్రసాద్ వెల్లడించారు. ఏపీ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ అవినీతి వారోత్సవాలలో భాగంగా శని వారం రాజమహేంద్రవరం, తిలక్ రోడ్డులోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అక్రమార్కుల నుంచి రూ.346.56 కోట్లను రాబట్టేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.
నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై నివేదికలు
ఎఫ్‌సీఐ, ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ బియ్యం, ధాన్యం, కోనుగోలు పై చెల్లించాల్సిన అగ్రికల్చరల్ మార్కెట్ ఫీజు (ఎఎంఎఫ్) ఆర్‌డీ సెస్, వృత్తి పన్ను, వ్యాట్ ఎగవేతన గ్రీన్ టాక్స్ మోటారు వెహికిల్స్ టాక్స్ ఇతర వ్యాపార సంస్థలు ఎగవేసిన పన్నుల కింద రూ 186.56 కోట్లు మొత్తం గుర్తించి ఆ మొత్తం వసూలు నిమిత్తం ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థలో..
జిల్లాలోని ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలపై ఆకస్మిక తనిఖీలు చేసి రూ 4,34,672 విలువ చేసే పీడీఎస్‌బియ్యం రూ.1,25,941 విలువ చేసిన బియ్యం, ఇతర ఉత్పత్తులు రూ.15,12,071 ఎల్‌పీజీ ఆయిల్, కిరోసిన్, ఇతర సరుకులు రూ.45,65,306 పప్పులు, నూనెలు, నిత్యావసర వస్తువులు మొత్తం కలిపి రూ.2.13 కోట్ల వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నా రు.
ల్యాండ్ మాఫియాపై..
కాకినాడ రూరల్ మండలం రమణయ్య పేట పంచాయితీ పరిధిలో 30 ఏళ్లుగా అభివృద్ధి చేసిన భూముల లే అవుట్లపై విచారణ చేయగా సుమారు 68 లేఅవుట్లలో గుర్తించామని తెలిపారు. సుమారు రూ.68.29 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు.
ఆక్వా సాగులో అవకతవకలు
తూర్పు గోదావరి జిల్లాలో అక్వా సాగుపై విచారణ చేయగా సుమారు 22,890 ఎకరాలలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్వా సాగు జరుగుతున్నట్లు, మిగిలిన 16,126 ఎరాలలో అక్వా రైతులు అధిక శాతం ప్రాథమిక అనుమతులు పొంది సాగు చేస్తున్నట్టు గుర్తించామన్నారు.
సహజ వనరులపై దోపిడీపై..
కోరంగి మడ అడవుల సమీపంలో నిర్మించిన రోప్‌వే, బ్రిడ్జిల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, గుర్తించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. వంతాడ పరిసరాలలో లేటరైట్ గనుల నిర్వహణలో జరిగిన అక్రమాలను గుర్తించి నిబంధనలకు విరుద్ధంగా రిజర్వ్ ఫారెస్ట్‌లో రోడ్లు వేయడం, రిజర్వ్ ఫారెస్ట్ లో తవ్వకాలు సాగించిన మినరల్ కంపెనీల నుంచి రికవరీకి, బాధ్యులపై చర్యలకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. గోదావరి నది నుంచి ఎత్తిపోతల ద్వారా 2016 రబీలో చేపట్టిన కార్యక్రమాలలో లోపాలు గుర్తించి రూ.16 కోట్లు రికవరీ, సంబంధిత అధికారులపై చర్యలకు నివేదిక ఇచ్చామన్నారు. ఈ తనిఖీలలో ప్రభుత్వ ఆదాయానికి జరిగిన నష్టాన్ని గుర్తించి దాడులు నిర్వహించడంలో, నివేదికలు తయారు చేయడంలో బదిలీపై వెళ్లిన విజిలెన్స్ డీఎస్పీ పీఆర్ రాజేంద్ర కుమార్, సీఐలు, ఎస్‌వీ భాస్కరరావు, వై.సత్యకిషోర్, టి.రామ్మోహన్ రెడ్డి, బి.సాయిరమేష్, జి. శ్రీనివాస్, జె.భార్గవ్ మహేష్, పీడీ రత్నకుమార్, కుమార్ పాల్గొన్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment