Vigilance Enforcement
-
వెయ్యి క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
పెద్దపల్లి రూరల్: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలి స్తున్న 4 లారీలను పెద్దపల్లి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్, పౌరసరఫరాల అధికారులు శనివారం పట్టు కున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక మండలాల నుంచి నాలుగు లారీల బియ్యాన్ని పెద్దపల్లికి అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు చేశారు. ఒక్కో లారీలో 270 క్వింటాళ్ల చొప్పున మొత్తం నాలుగు లారీల్లో 1,080 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. నాలుగు లారీలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్ తెలిపారు. పట్టుబడ్డ లారీలను పెద్దపల్లిలోని ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. తప్పించేందుకు యత్నం: పెద్దపల్లి మండలం రంగాపూర్ గోదాములకు ఎలాంటి వేబిల్లులు లేకుండా వచ్చిన బియ్యం లారీలను అధికారులు పట్టుకోగా.. కేసు నమోదు చేయకుండా తప్పించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. అధికారులపై ఒత్తిళ్లు రావడంతో బోగస్ వేబిల్లులను సృష్టించి వాటి ఆధారంగా లారీలను వదిలేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అక్కడకు వెళ్లిన మీడియాకు.. బియ్యం అక్రమం కాదని కొందరు చెప్పడం ఇందుకు బలం చేకూర్చుతోంది. టాస్క్‌ఫోర్స్ అధికారుల ఎంట్రీతో..: టాస్క్‌ఫోర్స్, రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల రాకతో కథ అడ్డం తిరిగింది. లారీలకు సంబంధించి బోగస్ వేబిల్లులను అధికారులకు చూపించగా.. లారీల వెంట లేని వేబిల్లులు ఇప్పుడెలా వచ్చాయన్న అధికారుల ప్రశ్నకు సమాధానం రాలేదు. దీంతోవారు లారీల డ్రైవర్ల గురించి ఆరా తీశారు. అప్పటివరకు అక్కడే ఉన్న డ్రైవర్లు, వాటి సంబంధిత వ్యక్తులు టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల రాకతో కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో వేబిల్లులు బోగస్‌వని, లారీల్లో ఉన్నవి రేషన్ బియ్యమేనని తేలడంతో నాలుగు లారీలను సీజ్ చేశారు. -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అక్రమాలపై విజిలెన్స్ కొరడా
సాక్షి, అమరావతి: కరోనా చికిత్స పేరిట అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై విజిలెన్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కొరఢా ఝులిపిస్తున్నాయి. బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు 13 ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహించి అక్రమాలకు పాల్పడిన 9 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశాయి. వీటితోపాటు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న మరో 5 ఆస్పత్రుల నిర్వాహకులపైనా క్రిమినల్ కేసులు నమోదు చేశాయి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం నిర్ధేశించిన చార్జీల కంటే అధికంగా వసూలు చేయడం, ఆరోగ్యశ్రీ కార్డు గల రోగులకు వైద్యం చేయకపోవడం, ఆరోగ్యశ్రీ రోగుల నుంచి కూడా బిల్లులు వసూలు చేయడం, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. గుంటూరు జిల్లా నరసారావుపేటలోని అంజిరెడ్డి ఆస్పత్రి, విశాఖపట్నంలోని ఆదిత్య, దుర్గ, వైఎస్సార్ జిల్లాలోని సంజీవిని, విజయవాడ భవానీపురంలోని ఆంధ్రా ఆస్పత్రి, కాకినాడ ఇనోదయ, కేర్ ఎమర్జెన్సీ ఆస్పత్రి, ఏలూరులోని ఆంధ్రా ఆసుపత్రి, జంగారెడ్డిగూడెంలోని చిరంజీవి ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కాగా, విశాఖలో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల విషయంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దర్ని అరెస్ట్ చేశారు. నెల్లూరులో నలుగురిపై కేసు నమోదు చేసి, మరో కేసులో ఒకర్ని అరెస్ట్ చేశారు. విజయవాడలో నలుగుర్ని అరెస్ట్ చేశారు. ఆయా ఆస్పత్రులపై ఐపీసీ సెక్షన్ 188, 269, 420, విపత్తుల చట్టంలోని సెక్షన్ 51(8), 51(బి), 53, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 18 (బి), ఈసీ యాక్ట్ 61, 71 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 46 ఆస్పత్రులపై కేసులు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 46 ఆస్పత్రులపై క్రిమినల్ చర్యలు తీసుకున్నట్టు రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని అంజిరెడ్డి ఆస్పత్రిపై ఈ నెల 5న కేసు నమోదైందని, అయినా అక్రమాలకు పాల్పడటంతో మరోమారు క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు చెప్పారు. -
ఆస్పత్రుల దోపిడీపై విజి‘లెన్స్’
సాక్షి, అమరావతి: కరోనా బాధితులను నిలువు దోపిడీ చేస్తున్న ఆస్పత్రులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కొరడా ఝళిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటైన 18 ఫ్లయింగ్ స్క్వాడ్లు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 35 ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించాయి. అక్రమాలకు పాల్పడిన 9 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశాయి. ఇందుకు సంబంధించిన వివరాలను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) కె.రాజేంద్రనాథ్‌రెడ్డి ఒక ప్రకటన ద్వారా మీడియాకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితులకు వైద్యం అందించడంలో చోటుచేసుకుంటున్న అవకతవకలను నిరోధించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దించి పెద్దఎత్తున సోదాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆస్పత్రుల్లో ఆమోదించిన దానికంటే అధికంగా ఫీజులు వసూలు చేయడం, ఆరోగ్యశ్రీ వర్తించదంటూ తప్పుదోవ పట్టించడం, రెమిడెసివిర్ ఇంజక్షన్లను దుర్వినియోగం చేయడం వంటి అక్రమాలను తనిఖీల్లో గుర్తించినట్టు ఆయన తెలిపారు. ఇలాంటి అవకతవకలకు పాల్పడిన 9 ఆస్పత్రుపై ఐపీసీ, డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ యాక్ట్, విపత్తు నివారణ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు మూడు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేశామని, మరో రెండు కేసుల్లో నిందితులు పరారీలో ఉన్నారని వివరించారు. మిగిలిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసులు నమోదు చేసిన 9 ఆస్పత్రులు, వాటిలో గుర్తించిన ఆక్రమాలు ఇలా ఉన్నాయి. రెమిడెసివిర్ ఇంజక్షన్లు పక్కదారి ► విజయనగరం క్వీన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్‌లో రెమిడెసివిర్ ఇంజక్షన్లు దుర్వినియోగం చేశారు. కేస్ షీట్లో రోగుల లెక్కలు తప్పుగా చూపి రెమిడెసివిర్ ఇంజక్షన్ల లెక్కలను తారుమారు చేశారు. ఈ హాస్పిటల్‌పై ఐపీసీ సెక్షన్లు 188, 420 కింద కేసు నమోదు చేశారు. ► ఒంగోలులోని ప్రకాశం హాస్పిటల్లో రెమిడెసివిర్ ఇంజక్షన్లు దుర్వినియోగం చేశారు. రికార్డుల్లో లెక్కలకు హాస్పిటల్లో ఉన్న వాటికి పొంతన లేదు. రికార్డుల్లో పేర్కొన్న లెక్క ప్రకారం 57 ఇంజెక్షన్లు లేవు. ఈ ఆస్పత్రిపైనా 188, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ► నెల్లూరు రిచ్ ఆస్పత్రిలో రెమిడెసివిర్ దుర్వినియోగం జరిగాయి. రికార్డుల్లో చూపిన 31 ఇంజక్షన్లు లేవు. ఈ ఆస్పత్రిపై సెక్షన్లు 188, 420 కింద కేసు నమోదు చేశారు. ► కర్నూలు గాయత్రి హాస్పిటల్లో లెక్కల్లో చూపిన 70 రెమిడెసివిర్ ఇంజక్షన్లు దుర్వినియోగం చేశారు. ఈ ఆస్పత్రిపై సెక్షన్లు 420, 40, 188తోపాటు డ్రగ్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 51 కింద కేసు నమోదు చేసి హాస్పిటల్ ఎండీని అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతి రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సౌకర్యం ఉన్నప్పటికీ రోగుల నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అడ్వాన్సుగా వసూలు చేస్తున్నారు. రోజుకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనిపై సెక్షన్లు 188, 420 కేసు నమోదు చేయగా.. ఆస్పత్రి ఎండీ, సీఈవోలు పరారీలో ఉన్నారు. ► గుంటూరు జిల్లా నరసరావుపేట పువ్వాడ హాస్పిటల్లో నిబంధనలకు విరుద్ధంగా రోజుకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేస్తున్నారు. దీనిపై సెక్షన్లు 188, 420తోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 51 ప్రకారం కేసులు నమోదు చేశారు. అనంతపురం ఎస్వీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నిబంధనలకు విరుద్ధంగా రోజుకు రూ.25 వేలు వసూలు చేస్తూ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. దీనిపై సెక్షన్లు 188, 420, 406తోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 51 ప్రకారం కేసు నమోదు చేశారు. ఆస్పత్రి ఎండీని అరెస్ట్ చేశారు. ► వైఎస్సార్ జిల్లాలో కేసీహెచ్ హాస్పిటల్లో రోజుకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేయడంతోపాటు రోజుకు రూ.3 వేల చొప్పున ఒక్కో రోగి నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారు. సెక్షన్లు 188, 420 కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. ► వైఎస్సార్ జిల్లాలోనే కొమ్మ హాస్పిటల్లో రోజుకు రూ.25 వేలు వసూలు చేస్తూ ఆక్సిజన్ కోసం మరో రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. ఈ ఆస్పత్రిపై ఐపీసీ సెక్షన్లు 188, 420 కేసు నమోదు చేశారు. ► పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని జేకే ఆస్పత్రి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ రెసిడెన్సీ లాడ్జిలో అనధికారికంగా చికిత్సలు చేస్తున్నట్టు గుర్తించారు. లాడ్జిలో చికిత్స పొందుతున్న ఐదుగురు కోవిడ్ బాధితులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లాడ్జిని సీజ్ చేశారు. జేకే ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలు పొందుతున్న రోగులను వేరే ఆస్పత్రులకు తరలించిన అనంతరం కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. -
‘ఉల్లి’కి ముకుతాడేద్దాం
సాక్షి ప్రతినిధి, ఏలూరు, తాడేపల్లిగూడెం, సాక్షి, అమరావతి, కర్నూలు (అగ్రికల్చర్): ఉల్లి ధర ఎంతగా పెరిగినప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకుండా రైతు బజార్లలో కిలో కేవలం రూ.25 చొప్పున విక్రయిస్తూనే, మరోవైపు మరింతగా మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అధికారులను ఆదేశించడంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు పలు శాఖల యంత్రాంగం రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా తరలిపోకుండా చర్యలు తీసుకుంటోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వ్యాపారులను కట్టడి చేసే చర్యలకు ఉపక్రమించింది. బహిరంగ మార్కెట్లో కిలో ధర రూ.100పైగా పలుకుతున్నా, ధరల స్థిరీకరణ నిధి ద్వారా అధిక ధరకు కొనుగోలు చేసి, కిలో కేవలం రూ.25 చొప్పున రైతు బజార్లలో ప్రజలకు విక్రయించడాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి వరుస సమీక్షలలో ఇచ్చిన ఆదేశాలు, సూచనలతో మన రాష్ట్రంలో వినియోగదారులను ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా ఉల్లి సరఫరా కొనసాగించడంపై లోతైన కసరత్తు జరిగింది. ఈ విషయంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగి, క్షేత్ర స్థాయికి వెళ్లి వివిధ కోణాల్లో సమస్యపై ఆరా తీసింది. కొంత మంది ట్రేడర్లు కృత్రిమ కొరత సృష్టిస్తూ, పొరుగు రాష్ట్రాలకు తరలిస్తుండటంతో పాటు ట్రేడింగ్‌లో అధిక ధర కొనసాగేలా వ్యవహరిస్తూ.. జిల్లాలకు అవసరమైన మేరకు సరఫరా చేయకపోవడాన్ని గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గురువారం రవాణా, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖలు ఐక్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాయి. మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి వెంకటేశ్వరరావు (నాని)లు.. మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణతో ఫోన్లో మాట్లాడి ఉల్లి సరఫరా, ధరల నియంత్రణ మీద సమీక్షించారు. ఈ సమావేశంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. మూడు నెలల క్రితమే స్పందించిన రాష్ట్రం కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఉల్లి లొల్లి చేస్తోంది. రోజు రోజుకూ ధరలు పెరిగిపోతుండటం పార్లమెంట్‌ను సైతం కుదిపేస్తోంది. ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో మార్కెట్లో కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుండటానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలపై సీఎం జగన్ మూడు సార్లు సమీక్షించారు. ధరల స్ధిరీకరణ నిధిని ఈ సమస్య పరిష్కారానికి వాడాలని ఆదేశించారు. దీంతో కర్నూలు మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేసి, సెప్టెంబరు 27 నుంచి రైతుబజార్లలో కిలో రూ.25కు విక్రయిస్తున్నాం. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఉల్లి ధర కిలో రూ.100 నుంచి రూ.140 వరకు ఉంది. ఈ నేపథ్యంలో అత్యధికంగా 2100 మెట్రిక్ టన్నుల దిగుమతికి ఇండెంట్ పెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ఈ ఉల్లిపాయలు ఈ నెల 12 లేదా 13న ముంబయి పోర్టుకు రానున్నాయి. కార్యాచరణ ఇలా.. ► ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించడంలో భాగంగా ఉల్లి అక్రమ నిల్వలపై మెరుపుదాడులు కొనసాగించాలి. ► నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలి. ► బిల్లులు లేకుండా ఉల్లి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. చెక్‌పోస్టులు, డైలీట్రాన్స్‌పోర్టుల వద్ద తనిఖీలు నిర్వహించాలి. ► అన్ని రైతుబజార్లలో రాయితీపై ఉల్లి విక్రయాలు కొనసాగించాలి. అవసరమైతే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు. విజిలెన్స్ విచారణలో తేలిందిదీ.. ► బయటి రాష్ట్రాల్లో డిమాండ్ పెరగడంతో మన అవసరాలు తీరకుండానే ఎక్కువగా తరలిస్తున్నారు. ► కర్నూలు జిల్లాలో పండే ఉల్లి పంటలో అత్యధికంగా తాడేపల్లిగూడెం వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. అక్కడి నుంచి బైపాస్‌లో బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ► వేలం పాటలో ఉల్లిని పాడుకున్న ఎగుమతి దారుల ప్రతినిధులు సరుకును గ్రేడింగ్ చేసి, సంచి మార్చి తరలిస్తున్నారు. ► కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు మాత్రమే ఎగుమతులను కట్టడి చేయడంతో బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఉల్లి సంగతులు ► రాష్ట్రం మొత్తానికి ప్రతి రోజు 800 టన్నుల ఉల్లి అవసరం అవుతోంది. ఈ లెక్కన ఏటా అటూ ఇటూ 3 లక్షల టన్నుల వినియోగం ఉంది. ► కర్నూలు జిల్లాలో ఏటా 5 లక్షల టన్నుల నుంచి 8 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 80 శాతం ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. ► తాడేపల్లిగూడెం మార్కెట్‌కు ఉల్లిని తీసుకెళ్తే అన్లోడ్ చేయకుండానే కొనుగోలు చేస్తున్నారు. వెంటనే నగదు ఇస్తుండటం వల్ల రైతులు అక్కడికి వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు. ► కర్నూలు మార్కెట్ కమిటీలో ఉల్లిని అమ్మకోవాలంటే నాలుగైదు రోజుల పాటు మార్కెట్లో వేచి ఉండాల్సిన పరిస్థితి (ఈ ఏడాది కాదు). ఆ లోపు ఉల్లి దెబ్బతినేది. అందువల్ల తాడేపల్లిగూడెం వెళ్లేవారు. ► మొత్తం పంటలో 35 శాతం పంటను మాత్రమే కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు తెస్తున్నారు. మిగతా పంటలో అత్యధికం పొలాల్లోనే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ► గత ఏడాది నవంబర్‌లో మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి 1.05 లక్షల టన్నుల ఉల్లి దిగుమతి అయింది. ఈ ఏడాది నవంబర్‌లో దిగుమతైంది కేవలం 47 వేల టన్నులు మాత్రమే. ► దేశంలో పండే పంటలో ఎక్కువ రోజులు నిల్వ ఉండనివి ఒక్క కర్నూలు ఉల్లిపాయలే. మహారాష్ట్ర ఉల్లి, తమిళనాడులో పండే సాంబారు ఉల్లిపాయలు 90 రోజులకు పైగా నిల్వ ఉంటాయి. ఎగుమతులు ఆపేయిస్తున్నాం దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఉంది. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి పలు చర్యలు తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఈ రోజు (గురువారం) కూడా సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశాం. పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేయకుండా చర్యలు తీసుకున్నాం. – పేర్ని వెంకట్రామయ్య(నాని), రవాణా శాఖ మంత్రి దిగుమతులు పెంచాం.. మన అవసరాలకు సరిపడా దిగుమతులపై చాలా రోజుల క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఇప్పటికే రైతు బజార్లలో రాయితీపై ధరపై విక్రయిస్తున్నాం. కిలోపై వంద రూపాయాలకు పైగా భారం పడుతున్నా ప్రజల కోసం ప్రభుత్వం భరిస్తోంది. త్వరలో దిగుబడితో పాటు, దిగుమతులు కూడా అందనున్నాయి. పరిస్థితి అదుపులోకి వస్తుంది. – కొడాలి వెంకటేశ్వరరావు (నాని), పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రభుత్వం దృష్టి సారించింది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉల్లి ధర పెరుగుదలపై లోతుగా పరిశీలించాం. పంట దిగుబడి తక్కువగా ఉండటానికి తోడు ట్రేడర్ల మాయాజాలం కూడా ఇందుకు కారణమవుతోందని ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది. ఈ విషయంపై ఏం చేస్తే బావుంటుందో ప్రభుత్వానికి సూచించాం. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించకుండా ప్రభుత్వం దృష్టి పెట్టింది. రెండు నెలలుగా అక్రమ నిల్వదారులపై దాడులు చేసి, సరుకు స్వాధీనం చేసుకున్నాం. – కె.రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డీజీ -
రేషన్ బియ్యం ‘పక్కదారి’
వర్గల్(గజ్వేల్): విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పంజా విసిరారు. డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సుమారు రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే 108.50 క్వింటాళ్ల బియ్యంతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించారు. రామచంద్రాపురం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వినాయక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గురువారం టీఎస్ 30 టీ 3023 నంబర్ గల డీసీఎమ్ వాహనంలో అక్రమంగా పీడీఎస్ రేషన్ బియ్యం గజ్వేల్ మీదుగా తూప్రాన్ వైపు తరలివెళ్తున్నట్లు విజిలెన్స్ అధికారి వినాయక్‌రెడ్డికి పక్కా సమాచారం అందింది. వెంటనే ఆయన తూప్రాన్–గజ్వేల్ రోడ్డుపై నిఘా వేశారు. అదేమార్గంలో పీడీఎస్ బియ్యంతో వస్తున్న సదరు డీసీఎం కన్పించింది. వెంటనే దానిని నిలువరించే ప్రయత్నం చేయగా, వర్గల్ మండల నాచారం పెట్రోల్ బంక్ వద్ద డ్రైవర్ వాహనాన్ని ఆపేసి పారిపోయాడు. డీసీఎమ్ వాహనంలో 217 బస్తాలలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించామని, సుమారు 108.50 క్వింటాళ్ల బియ్యం విలువ రూ. రెండున్నర లక్షలు ఉంటుందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వినాయక్‌రెడ్డి తెలిపారు. వాహనంతో సహా బియ్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. అనంతరం వాటిని రెవెన్యూ అధికారులకు స్వాధీనం చేసినట్లు పేర్కొన్నారు. -
అక్రమార్కులపై ఉక్కుపాదం
రాజమహేంద్రవరం క్రైం: ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టేందుకు ప్రయత్నించే అక్రమార్కుల నుంచి వాటిని రాబట్టేందుకు చర్యలు తీసుకున్నామని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ రీజనల్ ఆఫీసర్ టి.రాంప్రసాద్ వెల్లడించారు. ఏపీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అవినీతి వారోత్సవాలలో భాగంగా శని వారం రాజమహేంద్రవరం, తిలక్ రోడ్డులోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అక్రమార్కుల నుంచి రూ.346.56 కోట్లను రాబట్టేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై నివేదికలు ఎఫ్‌సీఐ, ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ బియ్యం, ధాన్యం, కోనుగోలు పై చెల్లించాల్సిన అగ్రికల్చరల్ మార్కెట్ ఫీజు (ఎఎంఎఫ్) ఆర్డీ సెస్, వృత్తి పన్ను, వ్యాట్ ఎగవేతన గ్రీన్ టాక్స్ మోటారు వెహికిల్స్ టాక్స్ ఇతర వ్యాపార సంస్థలు ఎగవేసిన పన్నుల కింద రూ 186.56 కోట్లు మొత్తం గుర్తించి ఆ మొత్తం వసూలు నిమిత్తం ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో.. జిల్లాలోని ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలపై ఆకస్మిక తనిఖీలు చేసి రూ 4,34,672 విలువ చేసే పీడీఎస్బియ్యం రూ.1,25,941 విలువ చేసిన బియ్యం, ఇతర ఉత్పత్తులు రూ.15,12,071 ఎల్పీజీ ఆయిల్, కిరోసిన్, ఇతర సరుకులు రూ.45,65,306 పప్పులు, నూనెలు, నిత్యావసర వస్తువులు మొత్తం కలిపి రూ.2.13 కోట్ల వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నా రు. ల్యాండ్ మాఫియాపై.. కాకినాడ రూరల్ మండలం రమణయ్య పేట పంచాయితీ పరిధిలో 30 ఏళ్లుగా అభివృద్ధి చేసిన భూముల లే అవుట్లపై విచారణ చేయగా సుమారు 68 లేఅవుట్లలో గుర్తించామని తెలిపారు. సుమారు రూ.68.29 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. ఆక్వా సాగులో అవకతవకలు తూర్పు గోదావరి జిల్లాలో అక్వా సాగుపై విచారణ చేయగా సుమారు 22,890 ఎకరాలలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్వా సాగు జరుగుతున్నట్లు, మిగిలిన 16,126 ఎరాలలో అక్వా రైతులు అధిక శాతం ప్రాథమిక అనుమతులు పొంది సాగు చేస్తున్నట్టు గుర్తించామన్నారు. సహజ వనరులపై దోపిడీపై.. కోరంగి మడ అడవుల సమీపంలో నిర్మించిన రోప్‌వే, బ్రిడ్జిల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, గుర్తించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. వంతాడ పరిసరాలలో లేటరైట్ గనుల నిర్వహణలో జరిగిన అక్రమాలను గుర్తించి నిబంధనలకు విరుద్ధంగా రిజర్వ్ ఫారెస్ట్‌లో రోడ్లు వేయడం, రిజర్వ్ ఫారెస్ట్ లో తవ్వకాలు సాగించిన మినరల్ కంపెనీల నుంచి రికవరీకి, బాధ్యులపై చర్యలకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. గోదావరి నది నుంచి ఎత్తిపోతల ద్వారా 2016 రబీలో చేపట్టిన కార్యక్రమాలలో లోపాలు గుర్తించి రూ.16 కోట్లు రికవరీ, సంబంధిత అధికారులపై చర్యలకు నివేదిక ఇచ్చామన్నారు. ఈ తనిఖీలలో ప్రభుత్వ ఆదాయానికి జరిగిన నష్టాన్ని గుర్తించి దాడులు నిర్వహించడంలో, నివేదికలు తయారు చేయడంలో బదిలీపై వెళ్లిన విజిలెన్స్ డీఎస్పీ పీఆర్ రాజేంద్ర కుమార్, సీఐలు, ఎస్వీ భాస్కరరావు, వై.సత్యకిషోర్, టి.రామ్మోహన్ రెడ్డి, బి.సాయిరమేష్, జి. శ్రీనివాస్, జె.భార్గవ్ మహేష్, పీడీ రత్నకుమార్, కుమార్ పాల్గొన్నారని తెలిపారు. -
మరో నకిలీ మాస్టర్ అరెస్టు
♦ ఇప్పటి వరకు ఐదుగురు గుర్తింపు ♦ రూ.1.60 కోట్ల మేర కుంభకోణం ♦ మిగిలిన వారిని త్వరలో ♦ పట్టుకుంటాం : విజిలెన్స్ సీఐ పామర్రు : విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించిన తనిఖీల్లో మరో నకిలీ పింఛన్ మాస్టర్ దొరికారని విజిలెన్సు సీఐ ఎన్.శ్రీసాయిఅపర్ణ తెలిపారు. పామర్రుశివాలయం వీధిలో నివసించే నకిలీ మాస్టర్ యండూరి సాయిబాబుని ఆమె గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజిలెన్సు, ఎన్ఫోర్సుమెంట్ ఎస్పీ రవీంద్రనాథ్, డీఎస్పీ పాల్‌తో కూడిన టీమ్ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ల విభాగంలో సర్వీసు చేయకుండా, ఉద్యోగ విరమణ పొందినట్లు డాక్యుమెం ట్లను తయారుచేసి, 15 ఏళ్లుగా పింఛన్‌పొందుతున్న వారి కోసం దాడులు నిర్వహిస్తున్నామని తెలి పారు. పామర్రుకు చెందిన యండూరి సాయిబాబు గతంలో హనుమంతపురంలో ఉండి నాలుగేళ్ల క్రితం నుంచి పామర్రులోని పెదమద్దాలి రోడ్డులోని శివారెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటున్నారని తెలిపారు. ఆయన హోమియో వైద్యుడిగా కూడా పనిచేస్తున్నారని వివరించారు. రిటైర్డు హెచ్ఎం కె.రంగరామానుజాచార్యులు 17 ఏళ్ల క్రితం ఆటోలో పరిచయమయ్యాడని, అతనే తన ఇంటికి వచ్చి పెన్షన్ పత్రాలు తయారు చేసి వాటిపై సంతకాలు చేయించి ప్రతినెలా పింఛన్ వచ్చే ఏర్పాటు చేశారని సాయిబాబు తెలిపారని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ సౌకర్యాలు, గ్రాట్యుటీకి సంబంధించిన పెద్ద మొత్తాలను మొవ్వ ట్రజరీ కార్యాలయంలో క్యాషియర్ నుంచి తీసుకునేలా చేశారని, ఇందుకు గానూ రంగరామానుజాచార్యులకు నెలకు పెన్షన్ నుంచి 20 శాతం కమిషన్ ఇస్తున్నట్లు సాయిబాబు తెలిపారని చెప్పారు. సాయిబాబు ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో సెంకటరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేసి 2001 అక్టోబర్‌లో ఉద్యోగవిరమణ చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని, నవంబర్ నుంచి ప్రతి నెలా పింఛన్ సాయిబాబు పొందుతున్నాడని సీఐ తెలిపారు. ఇప్పటి వరకు సాయిబాబు రూ.38 లక్షల వరకు పెన్షన్‌గా తీసుకున్నట్లు తేలిందన్నారు. సాయిబాబు ఇంట్లో సోదాలు నిర్వహించి పెన్షనర్ బుక్, బ్యాంకు అకౌంట్ పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నామని, సాయిబాబుకు రూ.31,344 పింఛన్ వస్తోందని పేర్కొన్నారు. ఆర్ఆర్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలి పారు. ఇప్పటి వరకు ఐదుగురు నకిలీ టీచర్లను అదుపులోకి తీసుకున్నామని, ఇప్పటికి రూ.1.60 కోట్ల దుర్వినియోగం జరిగిందని వివరించారు. స్వచ్ఛందంగా ముందుకురావాలి రంగరామానుజాచార్యుల వలలో పడి, అక్రమంగా పింఛన్ పొందుతున్నవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, వివరాలు తెలియజేస్తే తక్కువ శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీసాయిఅపర్ణ తెలి పారు. విజయవాడ ఏలూరు రోడ్డు, వినాయక థియేటర్ వద్ద గల విజిలెన్సు ఎస్పీ కార్యాలయంలో వివరాలు తెలపాలని సూచించారు. కార్యాలయం ఫోన్ నంబరు 0866–2453757లో కూడా వివరాలు తెలపొచ్చని పేర్కొన్నారు. రామానుజాచార్యులు కుమార్తె ద్వారా నకిలీ సర్టిఫికెట్‌ట్లు రంగరామానుజాచార్యులు కుమార్తె కె.పద్మలత పామర్రు మండలం నిమ్మకూరు పీహెచ్సీలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తూ అక్రమంగా నకిలీ విశ్రాంత ఉపాధ్యాయుల సర్టిఫికెట్లను గజిటెడ్ హోదాలో అందజేస్తున్నట్లు సమాచారం ఉన్నదని సీఐ శ్రీసాయిఅపర్ణ తెలిపారు. దాడిలో విజిలెన్సు ఎస్ఐ సత్యనారాయణ, వీఆర్వో లంకపల్లి మీనా తదితరులు పాల్గొన్నారు. -
దళారులపై కేసు నమోదు
కొండమల్లేపల్లి : స్థానిక కందుల కొనుగోలు కేంద్రంలో రైతు పేరు మీద కందులను విక్రయించిన ఇద్దరు దళారులపై కేసు నమోదు చేసినట్లు నల్లగొండ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ చెరమంద రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్లో రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాల్వాయి గ్రామానికి చెందిన వెంకటాపురం వెంకటయ్య పేరు మీద 40 క్వింటాళ్ల కందులు విక్రయించినట్లు నమోదై ఉంది. ఈ మేరకు పాల్వాయి గ్రామానికి వెళ్లి విజిలెన్స్ అధికారులు విచారణ చేయగా సదరు వెంకటయ్య ఈ ఏడాది భూమి సాగు చేయలేదని తేలింది. దీంతో అధికారులు విచారణ చేపట్టి పదురు రైతు పేరు మీద పాల్వాయి గ్రామానికి చెందిన దళారులు గిరి శేఖర్, రమేశ్ కందులు విక్రయించినట్లు వెల్లడైంది. వీరిపై గుర్రంపోడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. తనిఖీల్లో డీసీపీఓ కృష్ణ, ఎస్ఐ గౌస్, సిబ్బంది వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెద్దల పాత్ర నిజమే..!
- రాయితీల పక్కదారిపై విజిలెన్స్ కమిషన్ నిర్ధారణ - మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రాయితీల పేరుతో గత ఆర్థిక సంవత్సరం చివర్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2,050 కోట్ల నిధుల్లో ఎక్కువభాగం దుర్వినియోగం అయ్యాయని, ఇందులో భారీ మొత్తం పెద్దల జేబుల్లోకే వెళ్లిందని విజిలెన్స్ కమిషన్ నిర్ధారించింది. పరిశ్రమలు క్షేత్రస్థాయిలో ఉన్నాయా లేవో కూడా పరిశీలించకుండానే నిధులిచ్చేశారని భావిస్తున్నట్టు సమాచారం ఇందులో పెద్ద స్థాయి వ్యక్తుల పాత్ర ఉన్నందున శాఖాపరమైన విచారణలో వాస్తవాలు బయటకు రావని, అందువల్ల ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించింది. గత పదేళ్లకు సంబంధించిన పారిశ్రామిక రాయితీలు విడుదల చేయడంలోనే గూడుపుఠాణి దాగి ఉందని అనుమానిస్తోంది. వాస్తవానికి 2015-16 చివర్లో ఏకంగా పదేళ్ల పెండింగ్ పారిశ్రామిక రాయితీలు విడుదల చేయడాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇందులో భారీ కుంభకోణం ఉందని మొత్తం నిధుల్లో 30 నుంచి 50 శాతం వరకు పెద్దల జేబుల్లోకే వెళ్లాయని కూడా ఇటీవల తెలియజేసింది. సీఐడీ విచారణ యోచనలో సీఎస్ పారిశ్రామిక రాయితీల్లో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌కు ఫిర్యాదు అందిం ది. దీనిపై సీఎస్ పరిశ్రమల శాఖ నుంచి నివేదిక కోరారు.విజిలెన్స్ విచారణకు ఆదేశించినప్పటికీ నెలలు తరబడి జాప్యం చేయడంపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. పరిశ్రమల శాఖలో ఉన్నతస్థాయి అధికారులకు తెలిసే రూ.పది కోట్లు దారిమళ్లి సమాం తర బ్యాంకు అకౌంట్లలోకి వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖ నుంచి నివేదిక వచ్చిన తర్వాత.. అందులోని తీవ్రత ఆధారంగా సీఐడీ విచారణకు ఆదేశించాలని సీఎస్ భావిస్తున్నట్టు సమాచారం. ఏపీ ఫైళ్లు క్షుణ్ణంగా పరిశీలించండి రాయితీల వ్యవహారం పరిశ్రమల శాఖలో కలకలం రేపుతోంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐ పెట్టుబడిదారులు గత నాలుగు రోజులుగా ఈ వ్యవహారంపై వాకబు చేస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు కేంద్రం దృష్టికీ వెళ్లింది. ఏపీ నుంచి వచ్చే ప్రతీ ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని అంతర్గత ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) రుణ మంజూరులో కొత్త నిబంధనలు తెరమీదకు తెచ్చే ప్రతిపాదన చేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఏకంగా కేంద్ర ప్రభుత్వ ష్యూరిటీ ఉంటే తప్ప రుణాలు ఇవ్వలేమని తీర్మానించుకున్నాయి. రెండురోజుల క్రితం కొన్ని సంస్థలు ఈ తరహా లేఖలు కూడా రాసినట్టు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. జవాబుదారీతనం పెంచుతాం: మిశ్రా రాయితీల గోల్మాల్ నేపథ్యంలో తమశాఖలో మరింత జవాబుదారీతనం పెంచుతామని పరిశ్రమల శాఖ డెరైక్టర్ కార్తికేయ మిశ్రా ‘సాక్షి’కిచ్చిన వివరణలో తెలిపారు. అధికారుల సస్పెన్షన్, ఇతర పరిణామాలు పెట్టుబడుల వేగాన్ని అడ్డుకోబోవన్నారు. ఇక నుంచి రాయితీలన్నీ ఈ-ఫైలింగ్ పద్ధతిలో ఆన్లైన్లో ఇస్తామని తెలిపారు. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
► కనకదుర్గమ్మ వారిధి చెక్‌పోస్టు వద్ద ► ఆకస్మిక తనిఖీలు ► 220 క్వింటాళ్లు స్వాధీనం.. అదుపులోకి ముగ్గురు విజయవాడ(కృష్ణలంక) : అక్రమంగా తరలిస్తున్న 220 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వై.టి.నాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ ఆర్.విజయ్‌పాల్ శనివారం కనకదుర్గమ్మ వారధి సమీపంలోని చెక్‌పోస్టు దగ్గర ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నుంచి అక్రమంగా తరలి వెళుతున్న లారీని తనిఖీ చేసి రేషన్ బియ్యంను పట్టుకుని కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం దాచేపల్లిలో ఏపీ05టిఎ4 417 లారీలో నల్గొండ తిప్పర్తికి చెందిన పలువురు ఆటోల్లో తీసుకువచ్చిన రేషన్ బియ్యంను 445 సంచుల్లో 220 క్వింటాళ్ల లోడు ఎక్కించారు. గుంటూరు జిల్లా పొందుగల, కొండముడు చెక్‌పోస్ట్‌లను దాటుకుని వారధికి చేరుకుని విజిలెన్స్ తనిఖీకి చిక్కింది. ఈ మేరకు డ్రైవర్ దారపడ శ్రీను, క్లీనర్ మట్టా శ్రీను, బియ్యం తరలించే మధ్యవర్తి కదిమళ్ల నరేష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దాచేపల్లి నుంచి కాకినాడ పోర్టుకు వెళ్లి అక్కడ నుంచి షిప్‌పై రాయపూర్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. విజిలెన్స్ సీఐ ఎన్.ఎస్.అపర్ణ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, ఆర్ఐలు శర్మ, మున్వర్ ఈ దాడిలో పాల్గొన్నారు. -
దొరికితేనే దొంగలు..
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: ప్రజాపంపిణీపై పర్యవేక్షణ కొరవడింది. పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మార్కెట్లో యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. డీలర్ల నుంచి అక్రమార్కులు కేజీ రూ.10 కొని వాటిని రీ సైక్లింగ్ చేసి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. దీంతో వేల టన్నుల బియ్యం నల్లబజారుకు తరలిపోతున్నాయి. రేషన్ డీలర్లపై నిఘా పెట్టాల్సిన రెవెన్యూ అధికారులు మొక్కుబడి తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. రైస్ మిల్లర్లు కూడా అక్రమ నిల్వలకు పాల్పడుతున్నారు. డీలర్లు, రైస్‌మిల్లుల యజమానులు దొరికితేనే దొంగలు..లేకపోతే దొరల్లా తిరుగుతున్నారు. జిల్లాలో 2,085 చౌకధరల దుకాణాలుండగా 8,90,507 రేషన్‌కార్డులున్నా యి. వాటిలో 6,73,999 తెల్లకార్డులు, 52,140 అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణ కార్డులు వెయ్యివరకు ఉన్నాయి. ప్రతినెలా పది వేల టన్నుల బియ్యం సరఫరా అవుతుంటాయి. కిలో రూపాయికే ఇస్తున్న ఈ బియ్యాన్ని డీలర్లు కిలో పది రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిందిలా... ప్రతినెలా డీలర్లు డీడీలు చెల్లించిన అనంతరం ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్‌షాపులకు లారీల ద్వారా బియ్యం సరఫరా చేస్తుంటారు. సరుకులు తీసుకెళ్లే లారీ వెంట రూట్ ఆఫీసర్ ఉండాలి. షాపులో సరుకు దించిన వెంటనే స్టాక్ రిజిస్టర్లో సంతకం చేయాలి. బియ్యం పక్కదారి పట్టకుండా రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా పెట్టాలి. అవసరమైతే తనిఖీలు చేయాలి. స్టాక్‌బోర్డు సక్రమంగా నిర్వహిస్తోందీ లేనిదీ చూడాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే 6ఏ కేసులు నమోదు చేసి డీలర్లపై చర్యలు తీసుకోవాలి. జరుగుతోందిలా... రెవెన్యూ అధికారులు మొక్కుబడి తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఒక్కో రేషన్‌డీలరు నెలకు రూ.700 చొప్పున మండలంలో ఎంతమంది డీలర్లుంటే అంతమందీ వసూలు చేసి తహసీల్దార్ కార్యాలయానికి పంపిస్తుంటారన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా తనిఖీలు మొక్కుబడిగా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల మేల్కొన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు బియ్యం మాఫియాపై నిఘా పెట్టింది. ఒక్క మార్చి నెలలోనే టన్నులకొద్దీ బియ్యాన్ని స్వాధీనం చేసుకుందంటే డీలర్లు ఎంత అవినీతికి పాల్పడుతున్నారో తేటతెల్లమవుతోంది. కంభం పట్టణంలో మార్చి 5న ఒక ఆటోలో తరలిస్తున్న ప్రజాపంపిణీ బియ్యాన్ని స్థానికంగా ఉన్న ఒక పార్టీ నాయకులు చూసి పట్టుకున్నారు. ఇవి మధ్యాహ్న భోజన పథకం బియ్యం అని ఆటోడ్రైవర్ తెలపడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. మార్చి 17న సంతమాగులూరు మండలం ఏల్చూరు పరిసర ప్రాంతమైన కొండ మలుపుల్లో దాడులు చేసి 300 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పర్చూరులో మార్చి 14న రేషన్‌షాపులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించిన దాడుల్లో స్థానిక 49వ వార్డులో ఉన్న షాపులో రికార్డులు సక్రమంగాలేవని తేలింది. డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 21న గుడ్లూరులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 54 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు. అదే నెలలో మార్టూరులోని ధాన్యం మిల్లుల్లో అక్రమ నిల్వల్ని కనుగొన్నారు. సరుకు వివరాలు లేనందున రూ.14 లక్షల విలువ చేసే 200 క్వింటాళ్ల ధాన్యం, 300 క్వింటాళ్ల బియ్యం, 100 క్వింటాళ్ల నూకలను సీజ్ చేశారు. అదేవిధంగా ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు సమీపంలో ఉన్న లక్ష్మీ నరసింహ రైస్‌మిల్లుపై దాడిచేసి 3,590 బస్తాల ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. చీరాల ప్రాంతంలో కూడా పేదల బియ్యానికి రెక్కలొచ్చాయి. అనేకసార్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో పలువురు బియ్యం మాఫియాదారులు దొరికిపోయిన సందర్భాలున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు బుద్ధిపుట్టినప్పుడు తనిఖీలు చేస్తేనే ఇలా టన్నుల కొద్దీ బియ్యం పట్టుబడుతున్నాయి. ఈ లెక్కన ఏడాదంతా ప్రజా పంపిణీ బియ్యాన్ని నిరంతరం డీలర్లు నల్లబజారుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారో స్పష్టమవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పేదల బియ్యం పక్కదారి పట్టకుండా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రజాపంపిణీలో అక్రమాలపై కొరడా
రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు మండల స్టాక్ పాయింట్లు, రేషన్ దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ గోదాముల్లో రూ. 20.80 కోట్ల అక్రమ నిల్వలు గుర్తింపు మొత్తంగా పదిహేను రోజుల్లో రూ. 145 కోట్ల విలువైన సరుకులు స్వాధీనం.. 55 కేసులు నమోదు మరిన్ని దాడులు చేస్తామని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ ఆర్పీ ఠాకూర్ వెల్లడి రేషన్ దుకాణాల్లో పేదలకు అందజేయాల్సిన సరుకులను నల్లబజారుకు తరలిస్తున్న అక్రమార్కులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కొరడా ఝుళిపించింది. గత కొద్ది రోజులుగా 20 జిల్లాల్లోని మండల స్థాయి స్టాక్ కేంద్రాలతో పాటు రేషన్‌షాపులు, గోదాములపై దాడులు జరిపింది. మొత్తంగా దాదాపు రూ. 145 కోట్ల విలువైన సరుకులను స్వాధీనం చేసుకుని... 55 కేసులు నమోదు చేసింది. ఇందులో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు చెందిన గోదాముల్లో అక్రమంగా నిల్వ చేసిన దాదాపు రూ. 20 కోట్ల విలువైన ధాన్యం కూడా ఉండడం గమనార్హం. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ బుధవారం ఈ దాడులకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కొంతకాలంగా రాష్ట్రంలోని వివిధ రేషన్ షాపులలో నిత్యావసర సరుకులు సక్రమంగా అందడం లేదని.. వాటిని కాంట్రాక్టర్లు, రేషన్ డీలర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వాటిని ఆధారంగా చేసుకుని మూడో తేదీ నుంచి విజిలెన్స్ అధికారులు దాడులు ప్రారంభించారు. చిత్తూరు, మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, నల్లగొండ, హైదరాబాద్, పశ్చిమ గోదావరి, వైఎస్సార్ కడప, గుంటూరు, కరీంనగర్, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, మెదక్ జిల్లాల్లోని మండల స్థాయి స్టాక్ కేంద్రాలు, రేషన్ దుకాణాలతో పాటు వివిధ గోదాముల్లో తనిఖీలు నిర్వహించారు. బుధవారం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణ శివారులోని జమ్మలమడుగు, గుంజలపాడు రహదారుల్లోని పది గోదాముల్లో సుమారు రూ. 50 కోట్ల విలువ చేసే 1.78 లక్షల బస్తాల శనగపప్పును సీజ్ చేశారు. మొత్తంగా మూడో తేదీ నుంచి బుధవారం వరకు 138 గోదాములు, రేషన్ దుకాణాలపై దాడులను నిర్వహించగా... కాంట్రాక్టర్ల అక్రమాలు భారీ ఎత్తున వెలుగు చూశాయి. ముఖ్యంగా స్టాక్ కేంద్రాల నుంచి రేషన్ షాపులకు సరుకులు రవాణా చేసే దశలోనే వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు వెల్లడైంది. అధికారులు ఈ దాడుల్లో 8,655.1 క్వింటాళ్ల ఎర్రపప్పు, 4,37,854 క్వింటాళ్ల శనగపప్పు, 1,60,680 క్వింటాళ్ల పెసరపప్పు, వేరుశనగ తదితర ధాన్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్ ధర ప్రకారం రూ. 145 కోట్లకు పైగా ఉంటుందని ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా అక్రమార్కులపై నిత్యావసర వస్తువుల చట్టంలోని 6(ఎ) కింద 55 కేసులు నమోదు చేశామని, ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని ఆయన చెప్పారు. పేద రైతుల కడుపుకొడుతున్నారు.. ఎమ్మెల్యే పయ్యూవుల కేశవ్ సోదరులు అక్రవుంగా దాచి పెట్టిన ధాన్యం నిల్వలపై ఉన్నతాధికారులు సవుగ్ర విచారణ చేపట్టాలని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తేజోనాథ్, కిసాన్ సెల్ కో-ఆర్డినేటర్ అశోక్ డివూండ్ చేశారు. గోదాములపై దాడుల అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సోదరులు ఎంతో వుంది రైతులను బెదిరించి వారి పాసు పుస్తకాలు లాక్కొని ధాన్యం నిల్వలపై బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారని.. పేద రైతుల కడుపు కొడుతున్నారని వారు మండిపడ్డారు.