ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అక్రమాలపై విజిలెన్స్‌ కొరడా | Vigilance attack on irregularities in private hospitals | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అక్రమాలపై విజిలెన్స్‌ కొరడా

Published Sat, May 15 2021 5:18 AM | Last Updated on Sat, May 15 2021 8:31 AM

Vigilance attack on irregularities in private hospitals - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా చికిత్స పేరిట అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై విజిలెన్స్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ కొరఢా ఝులిపిస్తున్నాయి. బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు 13 ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహించి అక్రమాలకు పాల్పడిన 9 ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశాయి. వీటితోపాటు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్న మరో 5 ఆస్పత్రుల నిర్వాహకులపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేశాయి. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం నిర్ధేశించిన చార్జీల కంటే అధికంగా వసూలు చేయడం, ఆరోగ్యశ్రీ కార్డు గల రోగులకు వైద్యం చేయకపోవడం, ఆరోగ్యశ్రీ రోగుల నుంచి కూడా బిల్లులు వసూలు చేయడం, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్మడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.

గుంటూరు జిల్లా నరసారావుపేటలోని అంజిరెడ్డి ఆస్పత్రి, విశాఖపట్నంలోని ఆదిత్య, దుర్గ, వైఎస్సార్‌ జిల్లాలోని సంజీవిని, విజయవాడ భవానీపురంలోని ఆంధ్రా ఆస్పత్రి, కాకినాడ ఇనోదయ, కేర్‌ ఎమర్జెన్సీ ఆస్పత్రి, ఏలూరులోని ఆంధ్రా ఆసుపత్రి, జంగారెడ్డిగూడెంలోని చిరంజీవి ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. కాగా, విశాఖలో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల విషయంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దర్ని అరెస్ట్‌ చేశారు. నెల్లూరులో నలుగురిపై కేసు నమోదు చేసి, మరో కేసులో ఒకర్ని అరెస్ట్‌ చేశారు. విజయవాడలో నలుగుర్ని అరెస్ట్‌ చేశారు. ఆయా ఆస్పత్రులపై ఐపీసీ సెక్షన్‌ 188, 269, 420, విపత్తుల చట్టంలోని సెక్షన్‌ 51(8), 51(బి), 53, డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ యాక్ట్‌ 18 (బి), ఈసీ యాక్ట్‌ 61, 71 ప్రకారం కేసులు నమోదు చేశారు. 

ఇప్పటివరకు 46 ఆస్పత్రులపై కేసులు
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 46 ఆస్పత్రులపై క్రిమినల్‌ చర్యలు తీసుకున్నట్టు రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని అంజిరెడ్డి ఆస్పత్రిపై ఈ నెల 5న కేసు నమోదైందని, అయినా అక్రమాలకు పాల్పడటంతో మరోమారు క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్టు చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement