‘ఉల్లి’కి ముకుతాడేద్దాం | AP Government Has Takes Decision To Reduce Onion Price | Sakshi
Sakshi News home page

‘ఉల్లి’కి ముకుతాడేద్దాం

Published Fri, Dec 6 2019 4:04 AM | Last Updated on Fri, Dec 6 2019 4:13 AM

AP Government Has Takes Decision To Reduce Onion Price - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు, తాడేపల్లిగూడెం, సాక్షి, అమరావతి, కర్నూలు (అగ్రికల్చర్‌):  ఉల్లి ధర ఎంతగా పెరిగినప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకుండా రైతు బజార్లలో కిలో కేవలం రూ.25 చొప్పున విక్రయిస్తూనే, మరోవైపు మరింతగా మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అధికారులను ఆదేశించడంతో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు పలు శాఖల యంత్రాంగం రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా తరలిపోకుండా చర్యలు తీసుకుంటోంది.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వ్యాపారులను కట్టడి చేసే చర్యలకు ఉపక్రమించింది. బహిరంగ మార్కెట్‌లో కిలో ధర రూ.100పైగా పలుకుతున్నా, ధరల స్థిరీకరణ నిధి ద్వారా అధిక ధరకు కొనుగోలు చేసి, కిలో కేవలం రూ.25 చొప్పున రైతు బజార్లలో ప్రజలకు విక్రయించడాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి వరుస సమీక్షలలో ఇచ్చిన ఆదేశాలు, సూచనలతో మన రాష్ట్రంలో వినియోగదారులను ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా ఉల్లి సరఫరా కొనసాగించడంపై లోతైన కసరత్తు జరిగింది. ఈ విషయంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం రంగంలోకి దిగి, క్షేత్ర స్థాయికి వెళ్లి వివిధ కోణాల్లో సమస్యపై ఆరా తీసింది.

కొంత మంది ట్రేడర్లు కృత్రిమ కొరత సృష్టిస్తూ, పొరుగు రాష్ట్రాలకు తరలిస్తుండటంతో పాటు ట్రేడింగ్‌లో అధిక ధర కొనసాగేలా వ్యవహరిస్తూ.. జిల్లాలకు అవసరమైన మేరకు సరఫరా చేయకపోవడాన్ని గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గురువారం రవాణా, పౌర సరఫరాలు, మార్కెటింగ్‌ శాఖలు ఐక్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాయి. మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి వెంకటేశ్వరరావు (నాని)లు.. మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణతో ఫోన్‌లో మాట్లాడి ఉల్లి సరఫరా, ధరల నియంత్రణ మీద సమీక్షించారు. ఈ సమావేశంలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.
 
మూడు నెలల క్రితమే స్పందించిన రాష్ట్రం
కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఉల్లి లొల్లి చేస్తోంది. రోజు రోజుకూ ధరలు పెరిగిపోతుండటం పార్లమెంట్‌ను సైతం కుదిపేస్తోంది. ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో మార్కెట్‌లో కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుండటానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలపై సీఎం జగన్‌ మూడు సార్లు సమీక్షించారు. ధరల స్ధిరీకరణ నిధిని ఈ సమస్య పరిష్కారానికి వాడాలని ఆదేశించారు. దీంతో కర్నూలు మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేసి, సెప్టెంబరు 27 నుంచి రైతుబజార్లలో కిలో రూ.25కు విక్రయిస్తున్నాం. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఉల్లి ధర కిలో రూ.100 నుంచి రూ.140 వరకు ఉంది. ఈ నేపథ్యంలో అత్యధికంగా 2100 మెట్రిక్‌ టన్నుల దిగుమతికి ఇండెంట్‌ పెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే. ఈ ఉల్లిపాయలు ఈ నెల 12 లేదా 13న ముంబయి పోర్టుకు రానున్నాయి.  
 
కార్యాచరణ ఇలా..
► ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించడంలో భాగంగా ఉల్లి అక్రమ నిల్వలపై మెరుపుదాడులు కొనసాగించాలి.  
► నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలి.  
► బిల్లులు లేకుండా ఉల్లి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. చెక్‌పోస్టులు, డైలీట్రాన్స్‌పోర్టుల వద్ద తనిఖీలు నిర్వహించాలి.
► అన్ని రైతుబజార్లలో రాయితీపై ఉల్లి విక్రయాలు కొనసాగించాలి. అవసరమైతే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు.  
 
విజిలెన్స్‌ విచారణలో తేలిందిదీ..
► బయటి రాష్ట్రాల్లో డిమాండ్‌ పెరగడంతో మన అవసరాలు తీరకుండానే ఎక్కువగా తరలిస్తున్నారు.  
► కర్నూలు జిల్లాలో పండే ఉల్లి పంటలో అత్యధికంగా తాడేపల్లిగూడెం వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. అక్కడి నుంచి బైపాస్‌లో  బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.
► వేలం పాటలో ఉల్లిని పాడుకున్న ఎగుమతి దారుల ప్రతినిధులు సరుకును గ్రేడింగ్‌ చేసి, సంచి మార్చి తరలిస్తున్నారు.
► కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు మాత్రమే ఎగుమతులను కట్టడి చేయడంతో బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు తరలిస్తున్నారు.    


 
ఉల్లి సంగతులు
► రాష్ట్రం మొత్తానికి ప్రతి రోజు 800 టన్నుల ఉల్లి అవసరం అవుతోంది. ఈ లెక్కన ఏటా అటూ ఇటూ 3 లక్షల టన్నుల వినియోగం ఉంది.  
► కర్నూలు జిల్లాలో ఏటా 5 లక్షల టన్నుల నుంచి 8 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 80 శాతం ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది.
► తాడేపల్లిగూడెం మార్కెట్‌కు ఉల్లిని తీసుకెళ్తే అన్‌లోడ్‌ చేయకుండానే కొనుగోలు చేస్తున్నారు. వెంటనే నగదు ఇస్తుండటం వల్ల రైతులు అక్కడికి వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు.  
► కర్నూలు మార్కెట్‌ కమిటీలో ఉల్లిని అమ్మకోవాలంటే నాలుగైదు రోజుల పాటు మార్కెట్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి (ఈ ఏడాది కాదు). ఆ లోపు ఉల్లి దెబ్బతినేది. అందువల్ల తాడేపల్లిగూడెం వెళ్లేవారు.  
► మొత్తం పంటలో 35 శాతం పంటను మాత్రమే కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు తెస్తున్నారు. మిగతా పంటలో అత్యధికం పొలాల్లోనే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.  
► గత ఏడాది నవంబర్‌లో మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి 1.05 లక్షల టన్నుల ఉల్లి దిగుమతి అయింది. ఈ ఏడాది నవంబర్‌లో దిగుమతైంది కేవలం 47 వేల టన్నులు మాత్రమే.  
► దేశంలో పండే పంటలో ఎక్కువ రోజులు నిల్వ ఉండనివి ఒక్క కర్నూలు ఉల్లిపాయలే. మహారాష్ట్ర ఉల్లి, తమిళనాడులో పండే సాంబారు ఉల్లిపాయలు 90 రోజులకు పైగా నిల్వ ఉంటాయి.    
 
ఎగుమతులు ఆపేయిస్తున్నాం
దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఉంది. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి పలు చర్యలు తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఈ రోజు (గురువారం) కూడా సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశాం. పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేయకుండా చర్యలు తీసుకున్నాం.  

– పేర్ని వెంకట్రామయ్య(నాని), రవాణా శాఖ మంత్రి  

 
దిగుమతులు పెంచాం..
మన అవసరాలకు సరిపడా దిగుమతులపై చాలా రోజుల క్రితమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టి సారించారు. ఇప్పటికే రైతు బజార్లలో రాయితీపై ధరపై విక్రయిస్తున్నాం. కిలోపై వంద రూపాయాలకు పైగా భారం పడుతున్నా ప్రజల కోసం ప్రభుత్వం భరిస్తోంది. త్వరలో దిగుబడితో పాటు, దిగుమతులు కూడా అందనున్నాయి. పరిస్థితి అదుపులోకి వస్తుంది.  

– కొడాలి వెంకటేశ్వరరావు (నాని), పౌర సరఫరాల శాఖ మంత్రి

 
ప్రభుత్వం దృష్టి సారించింది..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉల్లి ధర పెరుగుదలపై లోతుగా పరిశీలించాం. పంట దిగుబడి తక్కువగా ఉండటానికి తోడు ట్రేడర్ల మాయాజాలం కూడా ఇందుకు కారణమవుతోందని ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది. ఈ విషయంపై ఏం చేస్తే బావుంటుందో ప్రభుత్వానికి సూచించాం. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించకుండా ప్రభుత్వం దృష్టి పెట్టింది. రెండు నెలలుగా అక్రమ నిల్వదారులపై దాడులు చేసి, సరుకు స్వాధీనం చేసుకున్నాం.

– కె.రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement