Artificial scarcity
-
‘ఉల్లి’కి ముకుతాడేద్దాం
సాక్షి ప్రతినిధి, ఏలూరు, తాడేపల్లిగూడెం, సాక్షి, అమరావతి, కర్నూలు (అగ్రికల్చర్): ఉల్లి ధర ఎంతగా పెరిగినప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకుండా రైతు బజార్లలో కిలో కేవలం రూ.25 చొప్పున విక్రయిస్తూనే, మరోవైపు మరింతగా మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అధికారులను ఆదేశించడంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు పలు శాఖల యంత్రాంగం రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా తరలిపోకుండా చర్యలు తీసుకుంటోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వ్యాపారులను కట్టడి చేసే చర్యలకు ఉపక్రమించింది. బహిరంగ మార్కెట్లో కిలో ధర రూ.100పైగా పలుకుతున్నా, ధరల స్థిరీకరణ నిధి ద్వారా అధిక ధరకు కొనుగోలు చేసి, కిలో కేవలం రూ.25 చొప్పున రైతు బజార్లలో ప్రజలకు విక్రయించడాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి వరుస సమీక్షలలో ఇచ్చిన ఆదేశాలు, సూచనలతో మన రాష్ట్రంలో వినియోగదారులను ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా ఉల్లి సరఫరా కొనసాగించడంపై లోతైన కసరత్తు జరిగింది. ఈ విషయంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగి, క్షేత్ర స్థాయికి వెళ్లి వివిధ కోణాల్లో సమస్యపై ఆరా తీసింది. కొంత మంది ట్రేడర్లు కృత్రిమ కొరత సృష్టిస్తూ, పొరుగు రాష్ట్రాలకు తరలిస్తుండటంతో పాటు ట్రేడింగ్‌లో అధిక ధర కొనసాగేలా వ్యవహరిస్తూ.. జిల్లాలకు అవసరమైన మేరకు సరఫరా చేయకపోవడాన్ని గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గురువారం రవాణా, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖలు ఐక్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాయి. మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి వెంకటేశ్వరరావు (నాని)లు.. మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణతో ఫోన్లో మాట్లాడి ఉల్లి సరఫరా, ధరల నియంత్రణ మీద సమీక్షించారు. ఈ సమావేశంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. మూడు నెలల క్రితమే స్పందించిన రాష్ట్రం కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఉల్లి లొల్లి చేస్తోంది. రోజు రోజుకూ ధరలు పెరిగిపోతుండటం పార్లమెంట్‌ను సైతం కుదిపేస్తోంది. ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో మార్కెట్లో కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుండటానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలపై సీఎం జగన్ మూడు సార్లు సమీక్షించారు. ధరల స్ధిరీకరణ నిధిని ఈ సమస్య పరిష్కారానికి వాడాలని ఆదేశించారు. దీంతో కర్నూలు మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేసి, సెప్టెంబరు 27 నుంచి రైతుబజార్లలో కిలో రూ.25కు విక్రయిస్తున్నాం. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఉల్లి ధర కిలో రూ.100 నుంచి రూ.140 వరకు ఉంది. ఈ నేపథ్యంలో అత్యధికంగా 2100 మెట్రిక్ టన్నుల దిగుమతికి ఇండెంట్ పెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ఈ ఉల్లిపాయలు ఈ నెల 12 లేదా 13న ముంబయి పోర్టుకు రానున్నాయి. కార్యాచరణ ఇలా.. ► ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించడంలో భాగంగా ఉల్లి అక్రమ నిల్వలపై మెరుపుదాడులు కొనసాగించాలి. ► నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలి. ► బిల్లులు లేకుండా ఉల్లి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. చెక్‌పోస్టులు, డైలీట్రాన్స్‌పోర్టుల వద్ద తనిఖీలు నిర్వహించాలి. ► అన్ని రైతుబజార్లలో రాయితీపై ఉల్లి విక్రయాలు కొనసాగించాలి. అవసరమైతే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు. విజిలెన్స్ విచారణలో తేలిందిదీ.. ► బయటి రాష్ట్రాల్లో డిమాండ్ పెరగడంతో మన అవసరాలు తీరకుండానే ఎక్కువగా తరలిస్తున్నారు. ► కర్నూలు జిల్లాలో పండే ఉల్లి పంటలో అత్యధికంగా తాడేపల్లిగూడెం వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. అక్కడి నుంచి బైపాస్‌లో బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ► వేలం పాటలో ఉల్లిని పాడుకున్న ఎగుమతి దారుల ప్రతినిధులు సరుకును గ్రేడింగ్ చేసి, సంచి మార్చి తరలిస్తున్నారు. ► కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు మాత్రమే ఎగుమతులను కట్టడి చేయడంతో బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఉల్లి సంగతులు ► రాష్ట్రం మొత్తానికి ప్రతి రోజు 800 టన్నుల ఉల్లి అవసరం అవుతోంది. ఈ లెక్కన ఏటా అటూ ఇటూ 3 లక్షల టన్నుల వినియోగం ఉంది. ► కర్నూలు జిల్లాలో ఏటా 5 లక్షల టన్నుల నుంచి 8 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 80 శాతం ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. ► తాడేపల్లిగూడెం మార్కెట్‌కు ఉల్లిని తీసుకెళ్తే అన్లోడ్ చేయకుండానే కొనుగోలు చేస్తున్నారు. వెంటనే నగదు ఇస్తుండటం వల్ల రైతులు అక్కడికి వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు. ► కర్నూలు మార్కెట్ కమిటీలో ఉల్లిని అమ్మకోవాలంటే నాలుగైదు రోజుల పాటు మార్కెట్లో వేచి ఉండాల్సిన పరిస్థితి (ఈ ఏడాది కాదు). ఆ లోపు ఉల్లి దెబ్బతినేది. అందువల్ల తాడేపల్లిగూడెం వెళ్లేవారు. ► మొత్తం పంటలో 35 శాతం పంటను మాత్రమే కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు తెస్తున్నారు. మిగతా పంటలో అత్యధికం పొలాల్లోనే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ► గత ఏడాది నవంబర్‌లో మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి 1.05 లక్షల టన్నుల ఉల్లి దిగుమతి అయింది. ఈ ఏడాది నవంబర్‌లో దిగుమతైంది కేవలం 47 వేల టన్నులు మాత్రమే. ► దేశంలో పండే పంటలో ఎక్కువ రోజులు నిల్వ ఉండనివి ఒక్క కర్నూలు ఉల్లిపాయలే. మహారాష్ట్ర ఉల్లి, తమిళనాడులో పండే సాంబారు ఉల్లిపాయలు 90 రోజులకు పైగా నిల్వ ఉంటాయి. ఎగుమతులు ఆపేయిస్తున్నాం దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఉంది. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి పలు చర్యలు తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఈ రోజు (గురువారం) కూడా సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశాం. పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేయకుండా చర్యలు తీసుకున్నాం. – పేర్ని వెంకట్రామయ్య(నాని), రవాణా శాఖ మంత్రి దిగుమతులు పెంచాం.. మన అవసరాలకు సరిపడా దిగుమతులపై చాలా రోజుల క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఇప్పటికే రైతు బజార్లలో రాయితీపై ధరపై విక్రయిస్తున్నాం. కిలోపై వంద రూపాయాలకు పైగా భారం పడుతున్నా ప్రజల కోసం ప్రభుత్వం భరిస్తోంది. త్వరలో దిగుబడితో పాటు, దిగుమతులు కూడా అందనున్నాయి. పరిస్థితి అదుపులోకి వస్తుంది. – కొడాలి వెంకటేశ్వరరావు (నాని), పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రభుత్వం దృష్టి సారించింది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉల్లి ధర పెరుగుదలపై లోతుగా పరిశీలించాం. పంట దిగుబడి తక్కువగా ఉండటానికి తోడు ట్రేడర్ల మాయాజాలం కూడా ఇందుకు కారణమవుతోందని ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది. ఈ విషయంపై ఏం చేస్తే బావుంటుందో ప్రభుత్వానికి సూచించాం. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించకుండా ప్రభుత్వం దృష్టి పెట్టింది. రెండు నెలలుగా అక్రమ నిల్వదారులపై దాడులు చేసి, సరుకు స్వాధీనం చేసుకున్నాం. – కె.రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డీజీ -
రైతుకు గోరంత.. దళారికి కొండంత!
♦ పత్తి వ్యాపారుల మాయాజాలం ♦ కృత్రిమ కొరత సృష్టించి కోట్లు దండుకుంటున్న వైనం ♦ సీజన్లో రైతుల నుంచి తక్కువ ధరకే పత్తి కొన్న వ్యాపారులు ♦ గోదాముల్లో భారీగా నిల్వలు ♦ ఇప్పుడు డిమాండ్ ఉండడంతో బయటకు తీసి అమ్మకాలు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : నెలన్నర కిందటి వరకు పత్తి ధర క్వింటాలుకు.. రూ.4,100. మరి నేడు ఏకంగా రూ.7 వేలు!! ఈ పెరిగిన ధరతో రైతులేమైనా బాగుపడుతున్నారా? లేనే లేదు. ఎందుకంటే వారి వద్ద అసలు పత్తే లేదు. దిగుబడి రాగానే ఎప్పుడో అమ్మేసుకున్నారు. రైతుల వద్ద కొన్న పత్తి అంతా ఇప్పటిదాకా దళారుల గోదాముల్లో బందీ అయింది. కాటన్ మిల్లులకు అమ్మకుండా నిల్వ చేశారు. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి తీరా ఇప్పుడు అధిక ధరకు అమ్ముకుంటూ కోట్లు ఆర్జిస్తున్నారు. ఈ మార్కెట్ మాయాజాలంలో ఈసారి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియూ (సీసీఐ) కూడా ఎంతో కొంత లాభపడినట్లు కన్పిస్తోంది. ఎందుకంటే రైతుల వద్ద క్వింటాలుకు గరిష్టంగా రూ.4,100 ధరతో పత్తి కొనుగోలు చేసిన సీసీఐ... ఇటీవల కాటన్ మిల్లులకు రూ.4,570 చొప్పున విక్రయించింది. ధర ఉండదంటూ ప్రచారం.. దేశవ్యాప్తంగా 2015-16లో కోటి 20 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేయగా.. సుమారు 3 కోట్ల 80 లక్షల వరకు పత్తి బేళ్లు ఉత్పత్తి అయినట్లు కాటన్ అడ్వయిజరీ బోర్డు అంచనా వేసింది. పత్తి దిగుబడి అధికంగా ఉండటంతో పెద్దగా ధర ఉండబోదనే ప్రచారాన్ని అప్పట్లో దళారులు తెరపైకి తెచ్చారు. దీంతో ైరె తులు తాము పండించిన పత్తిని మొదట్లోనే అమ్మేసుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రైతుల నుంచి 3 కోట్ల 35 లక్షల బేళ్ల పత్తి అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. అందులో సీసీఐ కొనుగోలు చేసిన పత్తి 60 లక్షల బేళ్లు మాత్రమే. మిగిలినవన్నీ దళారులు కొనుగోలు చేసినవే. రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన జమ్మికుంట మార్కెట్లో ప్రస్తుతం రోజూ వంద క్వింటాళ్లకు మించి అమ్మకాలు జరగడం లేదు. సీసీఐ వద్ద కూడా దేశవ్యాప్తంగా 70 వేల బేళ్లు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక్క తెలంగాణలోనే 25 వేల బేళ్లు ఉన్నాయి. వీటిని చిన్న, మధ్య తరహా స్పిన్నింగ్ మిల్లులకు కేటాయించేందుకు సిద్ధమైంది. దళారులదే రాజ్యం! దేశవ్యాప్తంగా 2.7 కోట్ల బేళ్లను దళారులే కొనుగోలు చేశారు. అందులో 1.5 కోట్ల బేళ్ల మేరకు అమ్మకాలు జరిపారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి పత్తి దిగుమతి ఆలస్యమవడంతో తమిళనాడు, గుజరాత్, మహరాష్ట్ర, కర్ణాటకల్లోని స్పిన్నింగ్ మిల్లులకు దారం కొరత ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న దళారులు నెల రోజులుగా ధర అమాంతం పెంచుతూ వస్తున్నారు. రూ.33 వేలున్న క్యాండీ ధరను రూ.51 వేలకు పెంచారు. గత వారం, పది రోజులుగా క్వింటాలు పత్తిని 6,500 నుంచి రూ.7వేల వరకు విక్రయిస్తున్నారు. మంగళవారం ఖమ్మం మార్కెట్లో రూ.7 వేలకు అమ్ముడుపోయింది. మూతపడుతున్న మిల్లులు.. దక్షిణాఫ్రికా, అస్ట్రేలియా నుంచి తమిళనాడు, మహా రాష్ట్ర, కర్ణాటకకు పెద్ద ఎత్తున బేళ్లు దిగుమతి అవుతుంటాయి. గత మార్చి-ఏప్రిల్‌లో పత్తి దిగుమతి కోసం ఆయా దేశాల ప్రతినిధులకు ఆర్డర్ ఇచ్చినప్పటికీ బాగా ఆలస్యం జరిగింది. దీంతో దేశీయ బడా పత్తి దళారులు తమ వద్దనున్న నిల్వలను బయటకు తీసి అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం దళారుల వద్ద ఇంకా 25 నుంచి 30 లక్షల బేళ్ల పత్తి నిల్వలు ఉన్నట్లు కాటన్ మిల్లుల యజమానులు చెబుతున్నారు. కొందరు కాటన్ మిల్లుల యజమానులు అంత పెద్ద మొత్తంతో పత్తిని కొనుగోలు చేస్తే నష్టపోతామని భావించి మిల్లుల్ని మూసేశారు. ఒక్క జమ్మికుంటలోనే ఐదు మిల్లులు మూత పడ్డాయి. ఈ నెల 25 తర్వాత జిల్లాలోని మిల్లులన్నీ మూసివేయనున్నట్లు కరీంనగర్ జిల్లా కాటన్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు దొనకొండ మల్లారెడ్డి తెలిపారు. దిగిరానున్న ధర ఇన్నాళ్లు కృత్రిమ కొరత సృష్టించి లాభా లు దండుకున్న పత్తి వ్యాపారులు ప్రస్తుతం ధరను తగ్గించే పనిలో పడ్డారు. రెండ్రోజుల క్రితం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నుంచి పత్తి బేళ్లు దిగుమతి కావడమే అందుకు కారణం. మిల్లర్లకు అవసరమైన మేరకు పత్తి దిగుమతి కావడంతో తమ పత్తికి గిరాకీ ఉండదని భావించి దళారులు బుధవారం క్వింటాలు పత్తి రూ.6 వేల నుంచి 6,500 మధ్యలో విక్రయించడం విశేషం. రాబోయే రోజుల్లో పత్తి ధర మరింత తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. అప్పుడే పెరిగితే బాగుండేది గత జనవరి, పిబ్రవరి, మార్చిలో మార్కెట్‌కు పెద్ద ఎత్తున పత్తి వచ్చింది. ఆనాడే ధర పలికితే రైతుకు లాభమయ్యేది. ఇప్పుడు పలుకుతున్న ధరలతో కేవలం పెద్దపెద్ద వ్యాపారులకే లబ్ధి జరుగుతుందే తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదు. ఆ బడా వ్యాపారులే ధర పెంచుతున్నారు.. తగ్గిస్తున్నారు. - దొనకొండ మల్లారెడ్డి, కాటన్ మిల్లుల అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు -
దడ పుట్టిస్తున్న దాడులు
రెండో రోజు 51 హోల్‌సేల్ షాపుల్లో తనిఖీలు రూ.1.48 కోట్ల విలువైన సరకు స్వాధీనం 16 షాపులపై కేసులు నమోదు విశాఖపట్నం: కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై రెవెన్యూ యంత్రాంగం ఉక్కు పాదం మోపింది. మంగళవారం వరుసగా రెండో రోజు కూడా ఎనిమిది బృందాలు నగరంలో వివిధ చోట్ల మెరుపు దాడులు కొనసాగించాయి. పెదవాల్తేరు, ఎంపీపీ కాలనీ, అప్పూఘర్, మధురవాడ, పూర్ణ మార్కెట్, పెదగంట్యాడ, గాజువాక తదితర ప్రాంతాల్లో 51 హోల్సేల్షాపులు గోదాముల్లో కొనసాగించిన దాడుల్లో కోటి 48 లక్షల 85వేల 818ల విలువైన పప్పులు, వంట నూనెలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అనధికారికంగా నిల్వ చేసిన 33.234 ఎంటీల కంది పప్పు, 96.197 ఎంటీల మినపప్పు, పెసరపప్పులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రికార్డుల్లో చూపని 64,961 కేజీల నూనెలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పెదగంట్యాడలో సరస్వతి ట్రేడర్స్, సూర్య ఎంటర్ ప్రైజస్, పూర్ణామార్కెట్‌లోని ఎఎన్ఆర్ ఫుడ్ ట్రేడర్స్, హరూన్ బ్రదర్స్, వర్తిక ఎంటర్ ప్రైజస్, కార్తిక్ ట్రేజర్స్, కామధేను కిరణా జనరల్ స్టోర్, కనకమహాలక్ష్మి ట్రేడర్స్, ఎస్‌కేఎంఎల్ ఫ్లోర్ మిల్, అప్పూఘర్ వద్దనున్న ఎస్‌కేఎంఎల్ ట్రేడర్స్, న్యూరేవతి కిరణా అండ్ జనరల్ స్టోర్స్, మధురవాడలోని గాయత్రి డిపార్టుమెంటల్ స్టోర్స్, రూపేష్ కిరణ్ స్టోర్స్, పెదవాల్తేరులోని పోలమాంబ కిరాణా జనరల్ స్టోర్స్, పోలమాంబ ట్రేడర్స్‌లలో ఈ దాడులు జరిగాయి. అత్యధికంగా పూర్ణమార్కెట్‌లోని కార్తిక ట్రేడర్స్‌లో 12.142 ఎంటీల కందిపప్పు, 15.625 ఎంటీల మినపప్పు, ఇతర పప్పులు, 21,699 కేజీల ఆయిల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.47.96 లక్షలుగా నిర్ధారించారు. నిల్వల్లో తేడాలుండడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, లెసైన్సుల్లేకుండా షాపులు నిర్వహించడం, స్టాక్ బుక్, బిల్ బుక్స్ సక్రమంగా నిర్వహించక పోవడం, ఎఫ్జీఎల్ లైన్స్ లేకుండా గోదాములను నిర్వహించడం వంటి అవకతవకలను గుర్తించారు. 16 షాపులపై కేసులు నమోదు చేసి రికార్డులను సీజ్ చేసారు. జాయింట్ కలెక్టర్ జె.నివాస్ ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, జిల్లా సివిల్ సప్లయిస్, కమర్షియల్ టాక్స్. రెవెన్యూ అధికారులతో ఏర్పాటైన ఎనిమిది ప్రత్యేక బృందాలు ఈ దాడులు చేశాయి. -
పెన్సిడిల్.. నో స్టాక్!
కామారెడ్డి : దగ్గుమందు పెన్సిడిల్‌కు కృత్రిమ కొరత ఏర్పడింది. కామారెడ్డికి చెందిన అజంతా మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులు అధిక సంపాదనకు ఆశపడి పెన్సిడిల్ మందులను పెద్ద ఎత్తున బంగ్లాదేశ్‌కు తరలించిన వ్యవహారంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలతో డ్రగ్ మాఫియా తమ వద్ద స్టాక్‌ను సర్దుకున్నట్టు తెలుస్తోంది. దీంతో కామారెడ్డిలో పెన్సిడిల్ సిరప్ కోసం మందుల దుకాణాలకు వెళితే ‘నో స్టాక్’ అనే సమాధానం వస్తోంది. మందుల దందాలో ఆరితేరిన కొందరు వ్యాపారులు అడ్డగోలు సంపాదనకు అలవాటుపడి అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న వ్యవహారం వెలుగుచూసిం ది. ఈ విషయం బయటకు పొక్కకుం డా అక్రమ రవాణాకు పాల్పడి చిక్కిన వ్యాపారులు ఔషధ నియంత్రణ శాఖ అధికారులను మేనేజ్ చేసినట్టు ప్రచా రం జరిగింది. అయితే సరిహద్దులు దా టిన అక్రమ దందాపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం స్థానికంగా కలకలం రేపింది. రహస్య ప్రాంతాలకు పెన్సిడిల్ స్టాక్.... పెన్సిడిల్ను భారీ మొత్తంలో తెప్పించి సరఫరా చేసే సదరు ఏజెన్సీ నిర్వాహకులు తమ వద్ద ఉన్న స్టాక్‌ను రహస్య ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తోంది. దీంతో స్థానిక రిటైల్ వ్యాపారులకు సదరు ఏజెన్సీ వారు స్టాక్ లేదని చెప్పినట్లు సమాచారం. పెన్సిడిల్ కొరత మూలంగా మందుల దుకాణాల వాళ్లు వేరే సిరప్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు యత్నాలు.. పెన్సిడిల్ సిరప్‌ను నిబంధనలకు విరుద్ధంగా, తప్పుడు బిల్లులతో ఇతర దేశాలకు సరఫరా చేసిన వ్యవహారంలో కేసుల నుంచి తప్పించుకునేందుకు సదరు ఏజెన్సీ నిర్వాహకులు పైరవీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని కేసులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తమకున్న పలుకుబడి ద్వారా ప్రభుత్వ పెద్దలను కలిసి ఈ కేసు నుంచి బయటపడేయాలని కోరినట్టు తెలిసింది. -
ఎరువు ఎక్కడ ?
సాక్షి, గుంటూరు :ఎరువుల పంపిణీపై జిల్లారైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రతీసారీ వ్యాపారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అక్టోబర్‌లో ఎరువుల అవసరాన్ని గుర్తించి సర్కారు ఇప్పట్నుంచే మేల్కోవాలని రైతు సంఘాల నేతలు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా వుండడంతో జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలో సుమారు 6 లక్షల హెక్టార్లలో వరి, పత్తి, మిర్చి సాగుచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 65 శాతం మేర వరి, మిర్చి పొలాల్లో ఎరువులు చల్లేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. పత్తి పూత, పిందె దశలో ఉండగా, మరికొద్ది రోజుల్లో యూరియా ఎరువును చల్లాల్సి ఉంది. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులతో పాటు ఎంఓపీకి వచ్చేరోజుల్లో డిమాండ్ ఏర్పడనుంది. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటికి 2 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే రైతులకు వ్యాపారుల ద్వారా అందాయి. మరో 80 వేల మెట్రిక్ టన్నుల వరకు మార్క్‌ఫెడ్, వ్యాపారులు, సొసైటీల వద్ద నిల్వ ఉన్న ట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వరినాట్లు వేసిన 25 రోజుల తరువాత ఎరువులతో అవసరం ఉంటుంది. ప్రస్తుతం అన్ని చోట్లా వరి నాట్లు పూర్తయి నెల కావస్తోంది. కొన్ని ఎరువుల కంపెనీలు రవాణ ఖర్చుల సాకుతో ఎంఆర్పీపై బస్తాకు రూ. 20 నుంచి రూ.50 వరకు పెంచి విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రభుత్వం సకాలంలో స్పందించి ఎరువుల స్టాక్ తెప్పించాలని, లేనిపక్షంలో ఖరీఫ్‌పై పెట్టుకున్న ఆశలు గల్లంతవుతాయని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. వ్యాట్ బాదుడు ... అన్నం పెట్టే రైతన్నకూ వ్యాట్ భారం తప్పడం లేదు. ఎరువుల కొనుగోలుపై అదనంగా వ్యాట్ భారం పడుతుంది. గతంలో ఎన్న డూ లేనంతగా ఎరువుల ధరలు పెరిగిపోయాయి. రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణను ఎత్తేయడంతో యూరియా మినహా ఇతర ఎరువులన్నీ ఆకాశన్నంటి ఉన్నాయి. దీనికితోడు రాష్ట్రప్రభుత్వం వడ్డించే వ్యాట్ మరింతభారంగా తయారైంది.ఎరువు లపై ఐదు శాతం వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) విధిస్తున్నారు. బస్తాపై కనిష్టంగా రూ.14.19, గరిష్టంగా రూ.54.09 అదనంగా చెల్లించాలి. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి ఎరువుల కొనుగోలుపై రూ. 40 కోట్ల వరకు వ్యాట్ భారం అదనంగా పడనుంది.