రైతుకు గోరంత.. దళారికి కొండంత! | Coats to create an artificial shortage and an merchent | Sakshi
Sakshi News home page

రైతుకు గోరంత.. దళారికి కొండంత!

Published Thu, Jul 21 2016 4:30 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

రైతుకు గోరంత.. దళారికి కొండంత! - Sakshi

రైతుకు గోరంత.. దళారికి కొండంత!

పత్తి వ్యాపారుల మాయాజాలం
కృత్రిమ కొరత సృష్టించి కోట్లు దండుకుంటున్న వైనం
సీజన్‌లో రైతుల నుంచి తక్కువ ధరకే పత్తి కొన్న వ్యాపారులు
గోదాముల్లో భారీగా నిల్వలు
ఇప్పుడు డిమాండ్ ఉండడంతో బయటకు తీసి అమ్మకాలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :  నెలన్నర కిందటి వరకు పత్తి ధర క్వింటాలుకు.. రూ.4,100. మరి నేడు ఏకంగా రూ.7 వేలు!! ఈ పెరిగిన ధరతో రైతులేమైనా బాగుపడుతున్నారా? లేనే లేదు. ఎందుకంటే వారి వద్ద అసలు పత్తే లేదు. దిగుబడి రాగానే ఎప్పుడో అమ్మేసుకున్నారు.  రైతుల వద్ద కొన్న పత్తి అంతా ఇప్పటిదాకా దళారుల గోదాముల్లో బందీ అయింది. కాటన్ మిల్లులకు అమ్మకుండా నిల్వ చేశారు. మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి తీరా ఇప్పుడు అధిక ధరకు అమ్ముకుంటూ కోట్లు ఆర్జిస్తున్నారు. ఈ మార్కెట్ మాయాజాలంలో ఈసారి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియూ (సీసీఐ) కూడా ఎంతో కొంత లాభపడినట్లు కన్పిస్తోంది. ఎందుకంటే రైతుల వద్ద క్వింటాలుకు గరిష్టంగా రూ.4,100 ధరతో పత్తి కొనుగోలు చేసిన సీసీఐ... ఇటీవల కాటన్ మిల్లులకు రూ.4,570 చొప్పున విక్రయించింది.

 ధర ఉండదంటూ ప్రచారం..
దేశవ్యాప్తంగా 2015-16లో కోటి 20 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేయగా.. సుమారు 3 కోట్ల 80 లక్షల వరకు పత్తి బేళ్లు ఉత్పత్తి అయినట్లు కాటన్ అడ్వయిజరీ బోర్డు అంచనా వేసింది. పత్తి దిగుబడి అధికంగా ఉండటంతో పెద్దగా ధర ఉండబోదనే ప్రచారాన్ని అప్పట్లో దళారులు తెరపైకి తెచ్చారు. దీంతో ైరె తులు తాము పండించిన పత్తిని మొదట్లోనే అమ్మేసుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రైతుల నుంచి 3 కోట్ల 35 లక్షల బేళ్ల పత్తి అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. అందులో సీసీఐ కొనుగోలు చేసిన పత్తి 60 లక్షల బేళ్లు మాత్రమే. మిగిలినవన్నీ దళారులు కొనుగోలు చేసినవే.  రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన జమ్మికుంట మార్కెట్‌లో ప్రస్తుతం రోజూ వంద క్వింటాళ్లకు మించి అమ్మకాలు జరగడం లేదు. సీసీఐ వద్ద కూడా దేశవ్యాప్తంగా 70 వేల బేళ్లు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక్క తెలంగాణలోనే 25 వేల బేళ్లు ఉన్నాయి. వీటిని చిన్న, మధ్య తరహా స్పిన్నింగ్ మిల్లులకు కేటాయించేందుకు సిద్ధమైంది.

 దళారులదే రాజ్యం!
దేశవ్యాప్తంగా 2.7 కోట్ల బేళ్లను దళారులే కొనుగోలు చేశారు. అందులో 1.5 కోట్ల బేళ్ల మేరకు అమ్మకాలు జరిపారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి పత్తి దిగుమతి ఆలస్యమవడంతో తమిళనాడు, గుజరాత్, మహరాష్ట్ర, కర్ణాటకల్లోని స్పిన్నింగ్ మిల్లులకు దారం కొరత ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న దళారులు నెల రోజులుగా ధర అమాంతం పెంచుతూ వస్తున్నారు. రూ.33 వేలున్న క్యాండీ  ధరను రూ.51 వేలకు పెంచారు. గత వారం, పది రోజులుగా క్వింటాలు పత్తిని 6,500 నుంచి రూ.7వేల వరకు విక్రయిస్తున్నారు. మంగళవారం ఖమ్మం మార్కెట్‌లో రూ.7 వేలకు అమ్ముడుపోయింది.

 మూతపడుతున్న మిల్లులు..
దక్షిణాఫ్రికా, అస్ట్రేలియా నుంచి తమిళనాడు, మహా రాష్ట్ర, కర్ణాటకకు పెద్ద ఎత్తున బేళ్లు దిగుమతి అవుతుంటాయి. గత మార్చి-ఏప్రిల్‌లో పత్తి దిగుమతి కోసం ఆయా దేశాల ప్రతినిధులకు ఆర్డర్ ఇచ్చినప్పటికీ బాగా ఆలస్యం జరిగింది. దీంతో దేశీయ బడా పత్తి దళారులు తమ వద్దనున్న నిల్వలను బయటకు తీసి అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం దళారుల వద్ద ఇంకా 25 నుంచి 30 లక్షల బేళ్ల పత్తి నిల్వలు ఉన్నట్లు కాటన్ మిల్లుల యజమానులు చెబుతున్నారు. కొందరు కాటన్ మిల్లుల యజమానులు అంత పెద్ద మొత్తంతో పత్తిని కొనుగోలు చేస్తే నష్టపోతామని భావించి మిల్లుల్ని మూసేశారు. ఒక్క జమ్మికుంటలోనే ఐదు మిల్లులు మూత పడ్డాయి. ఈ నెల 25 తర్వాత జిల్లాలోని మిల్లులన్నీ మూసివేయనున్నట్లు కరీంనగర్ జిల్లా కాటన్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు దొనకొండ మల్లారెడ్డి తెలిపారు.

దిగిరానున్న ధర
ఇన్నాళ్లు కృత్రిమ కొరత సృష్టించి లాభా లు దండుకున్న పత్తి వ్యాపారులు ప్రస్తుతం ధరను తగ్గించే పనిలో పడ్డారు. రెండ్రోజుల క్రితం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నుంచి పత్తి బేళ్లు దిగుమతి కావడమే అందుకు కారణం. మిల్లర్లకు అవసరమైన మేరకు పత్తి దిగుమతి కావడంతో తమ పత్తికి గిరాకీ ఉండదని భావించి దళారులు బుధవారం క్వింటాలు పత్తి రూ.6 వేల నుంచి 6,500 మధ్యలో విక్రయించడం విశేషం. రాబోయే రోజుల్లో పత్తి ధర మరింత తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి.

అప్పుడే పెరిగితే బాగుండేది
గత జనవరి, పిబ్రవరి, మార్చిలో మార్కెట్‌కు పెద్ద ఎత్తున పత్తి వచ్చింది. ఆనాడే ధర పలికితే రైతుకు లాభమయ్యేది. ఇప్పుడు పలుకుతున్న ధరలతో కేవలం పెద్దపెద్ద వ్యాపారులకే లబ్ధి జరుగుతుందే తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదు. ఆ బడా వ్యాపారులే ధర పెంచుతున్నారు.. తగ్గిస్తున్నారు. -  దొనకొండ మల్లారెడ్డి, కాటన్ మిల్లుల అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement