cotton traders
-
అక్రమాలు జరిగితే జైలుకే
♦ పత్తి కొనుగోళ్లపై అధికారులు, వ్యాపారులకు హరీశ్ హెచ్చరిక ♦ మంత్రులు, సీసీఐ అధికారులతో సమీక్ష ♦ విక్రయించిన రెండు రోజుల్లో రైతు ఖాతాలోకి డబ్బు ♦ అక్టోబర్ 20లోగా కొనుగోలు కేంద్రాలన్నీ ప్రారంభించాలి సాక్షి, హైదరాబాద్: రైతుల ముసుగులో వ్యాపారులు పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి అమ్ముకోకుండా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయాలని మార్కెటింగ్ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. ఈ విషయంలో తప్పులు చేస్తే అధికారులు, వ్యాపారులు, సిబ్బందిపై కఠిన చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. అవసరమైతే కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ‘‘పత్తి అమ్మిన 48 గంటల్లోపు డబ్బును రైతు ఖాతాకు నేరుగా జమ చేయాలి. కొనుగోలు కేంద్రాలన్నీ వారంలో ఆరు రోజులు పూర్తిస్థాయిలో పనిచేయాలి’’అని ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై బుధవారం సచివాలయంలో మంత్రుల బృందంతో ఆయన సమీక్ష జరిపారు. మంత్రులు ఈటల, తుమ్మల, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పత్తి కొనుగోళ్లపై ఈ నెల 18న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని హరీశ్ పేర్కొన్నారు. అక్టోబర్ 3 నుంచి 20లోగా పత్తి కొనుగోలు కేంద్రాలన్నింటినీ ప్రారంభించాలని సీసీఐని ఆదేశించారు. ‘‘చరిత్రలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఈ ఏడాది పత్తి పండిస్తున్నందున తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. పత్తి కొనుగోలు కేంద్రాలను 92 నుంచి 143కు పెంచాలని ఇటీవల కేంద్ర జౌళి మంత్రిని కోరాను. జిన్నింగ్ మిల్లులను కూడా అవసరమైన మేరకు కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేయాలని కోరాను. కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి శుక్రవారం రాష్ట్రానికి వస్తున్నారు. పత్తి కొనుగోలు ఏర్పాట్లను సమీక్షిస్తారు’’అని వివరించారు. రైతులకు ఆందోళన వద్దు రైతులకు అందోళన వద్దని హరీశ్ భరోసా ఇచ్చారు. వారు పత్తిని మార్కెట్లో గానీ, ధర తగ్గితే సీసీఐకి గానీ అమ్మడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ‘‘యార్డుల్లో ధర నిర్ణయమయ్యాక వేరే కారణాలతో రైతుకు ధర తగ్గిస్తే సహించబోం. రైతులు పత్తిని ఎక్కువ దూరం తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, పండించిన ప్రాంతానికి దగ్గరగా ఉండే మిల్లులను నోటిఫై చేసేలా చూడాలి. వారు యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రైతుల గుర్తింపుకు యార్డుల్లోనే కంప్యూటర్లను ఏర్పాటు చేయండి’’అని కలెక్టర్లను కోరారు. పత్తి కొనుగోలు కేంద్రాలన్నింటినీ స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులతో ప్రారంభించాలన్నారు. జిల్లాల్లో కేంద్రాల వివరాలు రైతులకు తెలిసేలా తక్షణం కరపత్రాలు, వాల్ పోస్టర్లు ముద్రించి ప్రచారం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ‘‘రోజుల తరబడి యార్డుల్లో, కేంద్రాల్లో వేచి ఉండకుండా పత్తిని కొనుగోలు చేయించాలి. అవసరమైన సిబ్బందిని మార్కెటింగ్, రెవెన్యూ, వ్యవసాయ తదితర శాఖల నుంచి తీసుకోండి’’ అని ఆదేశించారు. -
రైతుకు గోరంత.. దళారికి కొండంత!
♦ పత్తి వ్యాపారుల మాయాజాలం ♦ కృత్రిమ కొరత సృష్టించి కోట్లు దండుకుంటున్న వైనం ♦ సీజన్లో రైతుల నుంచి తక్కువ ధరకే పత్తి కొన్న వ్యాపారులు ♦ గోదాముల్లో భారీగా నిల్వలు ♦ ఇప్పుడు డిమాండ్ ఉండడంతో బయటకు తీసి అమ్మకాలు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : నెలన్నర కిందటి వరకు పత్తి ధర క్వింటాలుకు.. రూ.4,100. మరి నేడు ఏకంగా రూ.7 వేలు!! ఈ పెరిగిన ధరతో రైతులేమైనా బాగుపడుతున్నారా? లేనే లేదు. ఎందుకంటే వారి వద్ద అసలు పత్తే లేదు. దిగుబడి రాగానే ఎప్పుడో అమ్మేసుకున్నారు. రైతుల వద్ద కొన్న పత్తి అంతా ఇప్పటిదాకా దళారుల గోదాముల్లో బందీ అయింది. కాటన్ మిల్లులకు అమ్మకుండా నిల్వ చేశారు. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి తీరా ఇప్పుడు అధిక ధరకు అమ్ముకుంటూ కోట్లు ఆర్జిస్తున్నారు. ఈ మార్కెట్ మాయాజాలంలో ఈసారి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియూ (సీసీఐ) కూడా ఎంతో కొంత లాభపడినట్లు కన్పిస్తోంది. ఎందుకంటే రైతుల వద్ద క్వింటాలుకు గరిష్టంగా రూ.4,100 ధరతో పత్తి కొనుగోలు చేసిన సీసీఐ... ఇటీవల కాటన్ మిల్లులకు రూ.4,570 చొప్పున విక్రయించింది. ధర ఉండదంటూ ప్రచారం.. దేశవ్యాప్తంగా 2015-16లో కోటి 20 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేయగా.. సుమారు 3 కోట్ల 80 లక్షల వరకు పత్తి బేళ్లు ఉత్పత్తి అయినట్లు కాటన్ అడ్వయిజరీ బోర్డు అంచనా వేసింది. పత్తి దిగుబడి అధికంగా ఉండటంతో పెద్దగా ధర ఉండబోదనే ప్రచారాన్ని అప్పట్లో దళారులు తెరపైకి తెచ్చారు. దీంతో ైరె తులు తాము పండించిన పత్తిని మొదట్లోనే అమ్మేసుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రైతుల నుంచి 3 కోట్ల 35 లక్షల బేళ్ల పత్తి అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. అందులో సీసీఐ కొనుగోలు చేసిన పత్తి 60 లక్షల బేళ్లు మాత్రమే. మిగిలినవన్నీ దళారులు కొనుగోలు చేసినవే. రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన జమ్మికుంట మార్కెట్లో ప్రస్తుతం రోజూ వంద క్వింటాళ్లకు మించి అమ్మకాలు జరగడం లేదు. సీసీఐ వద్ద కూడా దేశవ్యాప్తంగా 70 వేల బేళ్లు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక్క తెలంగాణలోనే 25 వేల బేళ్లు ఉన్నాయి. వీటిని చిన్న, మధ్య తరహా స్పిన్నింగ్ మిల్లులకు కేటాయించేందుకు సిద్ధమైంది. దళారులదే రాజ్యం! దేశవ్యాప్తంగా 2.7 కోట్ల బేళ్లను దళారులే కొనుగోలు చేశారు. అందులో 1.5 కోట్ల బేళ్ల మేరకు అమ్మకాలు జరిపారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి పత్తి దిగుమతి ఆలస్యమవడంతో తమిళనాడు, గుజరాత్, మహరాష్ట్ర, కర్ణాటకల్లోని స్పిన్నింగ్ మిల్లులకు దారం కొరత ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న దళారులు నెల రోజులుగా ధర అమాంతం పెంచుతూ వస్తున్నారు. రూ.33 వేలున్న క్యాండీ ధరను రూ.51 వేలకు పెంచారు. గత వారం, పది రోజులుగా క్వింటాలు పత్తిని 6,500 నుంచి రూ.7వేల వరకు విక్రయిస్తున్నారు. మంగళవారం ఖమ్మం మార్కెట్లో రూ.7 వేలకు అమ్ముడుపోయింది. మూతపడుతున్న మిల్లులు.. దక్షిణాఫ్రికా, అస్ట్రేలియా నుంచి తమిళనాడు, మహా రాష్ట్ర, కర్ణాటకకు పెద్ద ఎత్తున బేళ్లు దిగుమతి అవుతుంటాయి. గత మార్చి-ఏప్రిల్‌లో పత్తి దిగుమతి కోసం ఆయా దేశాల ప్రతినిధులకు ఆర్డర్ ఇచ్చినప్పటికీ బాగా ఆలస్యం జరిగింది. దీంతో దేశీయ బడా పత్తి దళారులు తమ వద్దనున్న నిల్వలను బయటకు తీసి అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం దళారుల వద్ద ఇంకా 25 నుంచి 30 లక్షల బేళ్ల పత్తి నిల్వలు ఉన్నట్లు కాటన్ మిల్లుల యజమానులు చెబుతున్నారు. కొందరు కాటన్ మిల్లుల యజమానులు అంత పెద్ద మొత్తంతో పత్తిని కొనుగోలు చేస్తే నష్టపోతామని భావించి మిల్లుల్ని మూసేశారు. ఒక్క జమ్మికుంటలోనే ఐదు మిల్లులు మూత పడ్డాయి. ఈ నెల 25 తర్వాత జిల్లాలోని మిల్లులన్నీ మూసివేయనున్నట్లు కరీంనగర్ జిల్లా కాటన్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు దొనకొండ మల్లారెడ్డి తెలిపారు. దిగిరానున్న ధర ఇన్నాళ్లు కృత్రిమ కొరత సృష్టించి లాభా లు దండుకున్న పత్తి వ్యాపారులు ప్రస్తుతం ధరను తగ్గించే పనిలో పడ్డారు. రెండ్రోజుల క్రితం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నుంచి పత్తి బేళ్లు దిగుమతి కావడమే అందుకు కారణం. మిల్లర్లకు అవసరమైన మేరకు పత్తి దిగుమతి కావడంతో తమ పత్తికి గిరాకీ ఉండదని భావించి దళారులు బుధవారం క్వింటాలు పత్తి రూ.6 వేల నుంచి 6,500 మధ్యలో విక్రయించడం విశేషం. రాబోయే రోజుల్లో పత్తి ధర మరింత తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. అప్పుడే పెరిగితే బాగుండేది గత జనవరి, పిబ్రవరి, మార్చిలో మార్కెట్‌కు పెద్ద ఎత్తున పత్తి వచ్చింది. ఆనాడే ధర పలికితే రైతుకు లాభమయ్యేది. ఇప్పుడు పలుకుతున్న ధరలతో కేవలం పెద్దపెద్ద వ్యాపారులకే లబ్ధి జరుగుతుందే తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదు. ఆ బడా వ్యాపారులే ధర పెంచుతున్నారు.. తగ్గిస్తున్నారు. - దొనకొండ మల్లారెడ్డి, కాటన్ మిల్లుల అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు