అక్రమాలు జరిగితే జైలుకే
♦ పత్తి కొనుగోళ్లపై అధికారులు, వ్యాపారులకు హరీశ్ హెచ్చరిక
♦ మంత్రులు, సీసీఐ అధికారులతో సమీక్ష
♦ విక్రయించిన రెండు రోజుల్లో రైతు ఖాతాలోకి డబ్బు
♦ అక్టోబర్ 20లోగా కొనుగోలు కేంద్రాలన్నీ ప్రారంభించాలి
సాక్షి, హైదరాబాద్: రైతుల ముసుగులో వ్యాపారులు పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి అమ్ముకోకుండా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయాలని మార్కెటింగ్ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. ఈ విషయంలో తప్పులు చేస్తే అధికారులు, వ్యాపారులు, సిబ్బందిపై కఠిన చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. అవసరమైతే కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ‘‘పత్తి అమ్మిన 48 గంటల్లోపు డబ్బును రైతు ఖాతాకు నేరుగా జమ చేయాలి. కొనుగోలు కేంద్రాలన్నీ వారంలో ఆరు రోజులు పూర్తిస్థాయిలో పనిచేయాలి’’అని ఆదేశించారు.
పత్తి కొనుగోళ్లపై బుధవారం సచివాలయంలో మంత్రుల బృందంతో ఆయన సమీక్ష జరిపారు. మంత్రులు ఈటల, తుమ్మల, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పత్తి కొనుగోళ్లపై ఈ నెల 18న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని హరీశ్ పేర్కొన్నారు. అక్టోబర్ 3 నుంచి 20లోగా పత్తి కొనుగోలు కేంద్రాలన్నింటినీ ప్రారంభించాలని సీసీఐని ఆదేశించారు. ‘‘చరిత్రలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఈ ఏడాది పత్తి పండిస్తున్నందున తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. పత్తి కొనుగోలు కేంద్రాలను 92 నుంచి 143కు పెంచాలని ఇటీవల కేంద్ర జౌళి మంత్రిని కోరాను. జిన్నింగ్ మిల్లులను కూడా అవసరమైన మేరకు కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేయాలని కోరాను. కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి శుక్రవారం రాష్ట్రానికి వస్తున్నారు. పత్తి కొనుగోలు ఏర్పాట్లను సమీక్షిస్తారు’’అని వివరించారు.
రైతులకు ఆందోళన వద్దు
రైతులకు అందోళన వద్దని హరీశ్ భరోసా ఇచ్చారు. వారు పత్తిని మార్కెట్లో గానీ, ధర తగ్గితే సీసీఐకి గానీ అమ్మడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ‘‘యార్డుల్లో ధర నిర్ణయమయ్యాక వేరే కారణాలతో రైతుకు ధర తగ్గిస్తే సహించబోం. రైతులు పత్తిని ఎక్కువ దూరం తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, పండించిన ప్రాంతానికి దగ్గరగా ఉండే మిల్లులను నోటిఫై చేసేలా చూడాలి. వారు యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రైతుల గుర్తింపుకు యార్డుల్లోనే కంప్యూటర్లను ఏర్పాటు చేయండి’’అని కలెక్టర్లను కోరారు. పత్తి కొనుగోలు కేంద్రాలన్నింటినీ స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులతో ప్రారంభించాలన్నారు. జిల్లాల్లో కేంద్రాల వివరాలు రైతులకు తెలిసేలా తక్షణం కరపత్రాలు, వాల్ పోస్టర్లు ముద్రించి ప్రచారం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ‘‘రోజుల తరబడి యార్డుల్లో, కేంద్రాల్లో వేచి ఉండకుండా పత్తిని కొనుగోలు చేయించాలి. అవసరమైన సిబ్బందిని మార్కెటింగ్, రెవెన్యూ, వ్యవసాయ తదితర శాఖల నుంచి తీసుకోండి’’ అని ఆదేశించారు.