త్వరలో కొత్త మార్కెట్ చట్టం | New Market Act was coming Soon | Sakshi
Sakshi News home page

త్వరలో కొత్త మార్కెట్ చట్టం

Published Mon, Oct 17 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

త్వరలో కొత్త మార్కెట్ చట్టం

త్వరలో కొత్త మార్కెట్ చట్టం

- మార్కెట్ యార్డుల్లో ధాన్యం ఆరబెట్టే యంత్రాలు
- నూతన జిల్లాల నేపథ్యంలో మరిన్ని రైతు బజార్లు
మార్కెట్ కమిటీ చైర్మన్ల అవగాహన సదస్సులో మంత్రి హరీశ్‌రావు
 
 సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతమున్న మార్కెట్ చట్టంలో మార్పుచేర్పులు చేసి త్వరలో కొత్త మార్కెట్ చట్టం తీసుకొస్తామని మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్యదర్శులు, ఇతర అధికారులకు ఆదివారం ఇక్కడ జరిగిన అవగాహన సదస్సుకు మంత్రి హాజరయ్యారు. హరీశ్‌రావు మాట్లాడుతూ మార్కెట్ యార్డుల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత దేశంలో తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రిజర్వేషన్ల కారణంగా 56 మంది మహిళలు చైర్మన్లుగా ఎంపికయ్యారన్నారు. మొక్కజొన్న, వరి ధాన్యాన్ని ఆరబెట్టే యంత్రాలను మార్కెట్లలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మొదట జనగాం మార్కెట్‌లో దీన్ని ఏర్పాటు చేస్తామని... దశలవారీగా అన్ని మార్కెట్ యార్డుల్లో ఆ యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 30 మార్కెట్ యార్డులను ఏర్పాటు చేశామని, మరో 10 యార్డులు పరిశీలనలో ఉన్నాయని హరీశ్ చెప్పారు. రైతు బంధు పథకం వల్ల గిట్టుబాటు ధర లేనప్పుడు రైతు ఉచితంగా మార్కెట్ యార్డులకు చెందిన గోదాముల్లో దాచుకోవచ్చని... ఆ సమయంలో షరతుల్లేకుండా వారికి ధాన్యం విలువలో 70 శాతం సొమ్ము ఇస్తామన్నారు. ఆరు నెలల్లో ఎప్పుడు ధర వచ్చినా వారు వచ్చి వాటిని విక్రయించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు బాగా నిండాయన్నారు.

రైతుకు 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం రూ. 4,600 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రైతు, రైతు ఆధారిత, వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటిపై బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.41 వేల కోట్లు ఖర్చు చేస్తోం దన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు తెల్లవారుజామునే మార్కెట్లకు వెళ్లి సాయంత్రం వరకు ఉండాలని, అప్పుడు సమస్యలు రావన్నారు. ‘నామ్’ అమలులో  ఉన్న సర్వర్ సమస్యలను పరిష్కరించాలని హరీశ్‌రావు ఆదేశించారు. చాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడర్లతోనూ సమావేశం నిర్వహించి వారి సహకారాన్ని కోరతామన్నారు. గోదాములు, షెడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించకుండా చూడాలన్నారు.

 చైర్మన్లు, కార్యదర్శులకు అవార్డులు
 కొత్త జిల్లాల నేపథ్యంలో మరిన్ని రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఉల్లి, టమాటా పంటలకు కనీస మద్దతు ధర అమలు చేస్తున్నామన్నారు. బాగా పనిచేసే మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్యదర్శులకు టాప్-3 అవార్డులను ప్రతి రబీ, ఖరీఫ్ సీజన్లలో ఇస్తామన్నారు. కర్ణాటక, గుజరాత్‌లలో మార్కెట్లను పరిశీలనకు 2 విడతలుగా మార్కెట్ కమిటీ చైర్మన్లను ఆయా రాష్ట్రాలకు పంపిస్తామన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్లు బాగా పనిచేస్తే భవిష్యత్తులో రైతులను ఓటర్లుగా మార్చుకునే వీలుంటుందని... ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఎదిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించడంతో అందరూ చప్పట్లు చరిచారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ జగన్‌మోహన్, మార్కెటింగ్ డెరైక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్, సీసీఐ ప్రతినిధి చొక్కలింగం తదితరులు పాల్గొన్నారు.
 
 రాష్ట్రంలో 90 పత్తి కొనుగోలు కేంద్రాలు
 నల్లగొండలో కాటన్ కార్పొరేషన్ బ్రాంచీ
 
 రాష్ట్రంలో 90 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్ణయించింది. పత్తి దిగుబడులు, కొనుగోలు అంశాలపై సీసీఐ డెరైక్టర్ చొక్క లింగంతో మంత్రి హరీశ్‌రావు ఆదివారం చర్చలు జరిపారు. అనంతరం మంత్రి కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం 84 కొనుగోలు కేంద్రాలుండగా మంత్రి హరీశ్‌రావు విన్నపం మేరకు కొత్తగా మరో 6 కొనుగోలు కేంద్రాలకు సీసీఐ అంగీకరించిందని తెలిపారు.

ఈ నెలాఖరులోగా 45 పత్తి కొనుగోలు కేంద్రాలు, నవంబర్ చివరిలోగా మరో 45  కేంద్రాలను ప్రాధాన్యం ప్రకారం ప్రారంభించనున్నట్లు సీసీఐ డెరైక్టర్ తెలిపినట్లు వివరించారు. ఇప్పటివరకు ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో సీసీఐ కార్యాలయాలు పనిచేస్తున్నాయని, కొత్తగా నల్లగొండ జిల్లాలో మరో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు సీసీఐ అంగీకరించినట్లు వెల్లడించారు. అయితే ఆదిలాబాద్ సీసీఐ కార్యాలయంతో కరీంనగర్ జిల్లాకు చెందిన పత్తి కొనుగోలు వ్యవహారాల పరిపాలన కార్యకలాపాలను అనుసంధానం చేయనున్నట్లు సీసీఐ డెరైక్టర్ తెలిపినట్లు పేర్కొన్నారు. క్వింటాలు పత్తికి మార్కెట్ ధర గతంలో రూ.4,010 ఉండగా, ఇప్పుడు రూ.4,160 ధర పలుకుతున్నట్లు సీసీఐ వెల్లడించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement