పత్తి కొనుగోళ్లలో సీసీఐ సహాయ నిరాకరణ
త్వరలో ఢిల్లీకి ఎంపీ, మంత్రుల బృందం: హరీశ్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ సహాయ నిరాకరణ చేస్తోందని రాష్ట్ర మార్కెటింగ్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. గతేడాది 84 కొనుగోలు కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు జరిగితే, ఈసారి ఇప్పటివరకు 32 కేంద్రాలను కూడా ప్రారంభించలేదని అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పత్తి మార్కెట్‌ను హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సజావుగా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్తుందని చెప్పారు. పత్తికి మద్దతు ధర కల్పించడంలో కేంద్రం ఏ మాత్రం సహకరించడం లేదని, కొన్ని కేంద్రాల్లో సీసీఐ వారంలో కేవలం మూడు రోజులే పత్తి కొనుగోళ్లు చేస్తోందని విమర్శించారు.
సీసీఐ ఇప్పటికీ ఇంకా జిన్నింగ్ మిల్లులతో అగ్రిమెంట్ కూడా చేసుకోలేదని, కొనుగోలు కేంద్రాలకు పూర్తి స్థాయిలో సీపీవో (కాటన్ పర్చేజ్ ఆఫీసర్లు)ను నియమించలేదని విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై కూడా హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పత్తికొనుగోళ్లు సజావుగా నిర్వహించేలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్‌రెడ్డి, రాథోడ్ బాపూరావు తదితరులు పాల్గొన్నారు.