సభలో ‘వర్గీకరణ’ రగడ
వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుపట్టిన విపక్షాలు
- అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లడంపై ప్రకటన చేయాలని డిమాండ్
- ససేమిరా అన్న ప్రభుత్వం.. వెల్‌లోకి వెళ్లి విపక్ష సభ్యుల ఆందోళన
- సంపత్, సండ్ర, రేవంత్‌లను సస్పెండ్ చేసిన స్పీకర్ మధుసూదనాచారి
- తర్వాత కూడా ప్రభుత్వ ప్రకటనకు ఇతర సభ్యుల పట్టు
- అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటన
- సభ్యుల సస్పెన్షన్ కూడా ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: ఎస్సీల వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో మంగళవారం రగడ జరిగింది. వర్గీకరణపై అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకువెళ్లే విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడం.. అందుకు సర్కారు ససేమిరా అనడంతో సభ వేడెక్కింది. అధికార, విపక్షా లు రెండూ పట్టుదలకు పోవడంతో సభ్యుల సస్పెన్షన్ దాకా వెళ్లింది. ఆ తర్వాత రెండు పక్షాలు పట్టువిడుపులు ప్రదర్శించాయి. త్వరలోనే అఖిలపక్ష బృందాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్తామని ప్రభుత్వం ప్రకటించ డంతోపాటు సభ్యుల సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే అధికార, విపక్ష సభ్యుల ఆరోపణ లు, ప్రత్యారోపణలు, నినాదాలతో గంటకు పైగా సభలో గందరగోళం నెలకొంది. ఈ అలజడి మధ్యే కొన్ని ప్రశ్నలపై మంత్రులు సమాధానాలిచ్చారు.
‘వాయిదా’తో మొదలు..
సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీకి చెందిన సభ్యులు ఎస్సీల వర్గీకర ణపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని స్పీకర్‌ను కోరారు. అందుకు స్పీకర్ మధుసూదనాచారి అంగీకరించలేదు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎలాంటి చర్చకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దీంతో విపక్ష సభ్యులు గొడవకు దిగారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్ కుమార్ (కాంగ్రెస్), కిషన్‌రెడ్డి (బీజేపీ), సండ్ర వెంకటవీరయ్య, రేవంత్‌రెడ్డి (టీడీపీ) స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుని ఎస్సీల వర్గీకరణపై తమ ప్రభుత్వమే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, ఇందులో ఎవరికీ భిన్నాభిప్రా యాలు లేవని పేర్కొన్నారు.
ఇది ప్రశ్నోత్తరాల సమయమైనందున సభ్యులు సహకరించాలని కోరారు. దీంతో సభ్యులు పోడియం నుంచి తమ సీట్ల వద్దకు వెళ్లినా సంపత్‌కుమార్, వెంకటవీరయ్య మాత్రం పోడియం వద్దే ఉండి నినాదాలు చేశారు. ఈ గందరగోళంలోనే మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి తమ శాఖలకు చెందిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అయినా విపక్ష సభ్యులు తమ సీట్లలో కూర్చోకపోవడం, ఆ ఇద్దరు సభ్యులు వెల్‌లోనే ఉండడంతో మరో మంత్రి ఈటల రాజేందర్ జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వర్గీకరణపై డిప్యూటీ సీఎం నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందాన్ని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధాని వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. విపక్షాలు దీనిపై ఇంకో రూపంలో చర్చకు రావాలని సూచించారు. కానీ, సంపత్, సండ్రలతో పాటు ఇతర విపక్ష సభ్యులు చాలాసేపు నినాదాలు కొనసాగించారు. దళిత వ్యతిరేక ప్రభుత్వమని నినాదాలు చేశారు.
సంపత్, సండ్ర, రేవంత్‌ల సస్పెన్షన్
విపక్షాలు వెనక్కు తగ్గకపోవడంతో.. శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు సస్పెన్షన్ ప్రతిపాదన తెచ్చారు. సంపత్‌కుమార్ (కాంగ్రెస్), వెంకటవీరయ్య, రేవంత్‌రెడ్డి (టీడీపీ)లను శీతాకాల సమావేశాల వరకు సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. దాన్ని సభ ఆమోదించినట్టు ప్రకటించిన స్పీకర్.. వారిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే వెల్‌లో ఉన్న ఇద్దరు సభ్యులతో పాటు తననెందుకు సస్పెండ్ చేశారని రేవంత్‌రెడ్డి అడిగే ప్రయత్నం చేసినా... స్పీకర్ ఆ ముగ్గురు సభ్యులనూ మార్షల్స్ చేత బయటకి పంపించారు. అప్పుడు ఉత్తమ్‌తోపాటు ఇతర విపక్షాల సభ్యులంతా మళ్లీ వెల్‌లోకి వచ్చి గొడవ చేశారు. స్పీకర్ ప్రశ్నోత్తరాలను యథాతథంగా కొనసాగించారు.
జానా రాకతో మారిన సీన్
ఈ సమయంలో సభలోకి వచ్చిన సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. విపక్ష సభ్యులకు మద్దతుగా వెల్‌లోకి వెళ్లారు. ప్రభుత్వ ప్రకటన కోసం డిమాండ్ చేశారు. ఈ సమయంలో కోమటిరెడ్డితోపాటు వంశీచంద్‌రెడ్డి, డీకే అరుణ, మాధవరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, పద్మావతి, చిన్నారెడ్డి కూడా వెల్‌లోకి వచ్చారు. బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి.. ఒక్క చిన్న మాట కోసం ఇంత చేస్తున్నారని, అలాంటప్పుడు అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ భవన్‌లో నిర్వ హించుకోవచ్చు కదా అని వ్యాఖ్యానించారు. అప్పుడు సభలోకి ప్రతిపక్ష నేత జానారెడ్డి వచ్చారు.విషయం తెలుసుకున్న ఆయన.. చర్చచేయాలని తమకేమీ లేదని, కేవలం ప్రభుత్వం ప్రకటన చేస్తే సరి పోతుందన్నారు. కిషన్‌రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో హరీశ్‌రావు ప్రకటన చేశారు. ‘‘ సీఎం నేతృత్వంలో అఖిలపక్ష బృందాన్ని త్వరలోనే ఢిల్లీ తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోర డంతో... సభ హుందాతనాన్ని, గౌరవాన్ని పెంచడం కోసం విపక్షాల అభ్యర్థన మేరకు వారిపై సస్పెన్షన్ ఎత్తివేసే తీర్మానం పెడుతున్నట్టు హరీశ్ ప్రకటించారు.