హైదరాబాద్‌కు శనిలా ప్రతిపక్షాలు: కర్నె
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాలు హైదరాబాద్ నగరాభి వృద్ధికి సహకరించకపోగా కాళ్లలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజ మెత్తారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు హైదరాబాద్‌కు శనిలా పట్టాయని అన్నారు. గత టీడీపీ, కాంగ్రెస్‌ల పాలన కాలంలోనే అద్భుత హైదరాబాద్ వికృత నగరంగా మారిందని విమర్శించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఆ రెండు పార్టీలు తమ పాలనలో హైదరాబాద్ భవిష్యత్‌ను పట్టించుకోలేదని, హైటెక్ అంటూ సినిమా చూపించాయే తప్ప పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ, నాణ్యమైన రోడ్ల నిర్మాణం, బస్తీల ప్రగతిని పట్టించుకోలేదని ఆరోపించారు.
కాంగ్రెస్, టీడీపీల హయాంలో నాలాలు కబ్జా అయ్యాయని, చెరువులు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను దాదాపు ఆరు దశాబ్దాల పాటు గబ్బిలంలా పట్టుకున్న కాంగ్రెస్, టీడీపీలు ఇప్పుడు నాలాలు, లోతట్టు ప్రాంతాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.