ఆదివారం కల్వకుర్తి బహిరంగ సభలో ప్రసంగిస్తున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, నాగర్‌కర్నూల్: ముప్పై ఏళ్ల పాటు ప్రజలకు తాగునీరు కూడా అందించని కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇప్పుడు తప్పుడు కేసులతో సాగునీటి ప్రాజెక్టు పనులను అడ్డుకుంటున్నారని మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. రైతుల ముఖాలు చూసైనా కాంగ్రెస్ నేతలు తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలు గ్రీన్ ట్రిబ్యునల్‌లో వేసిన కేసుల వల్లే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో జాప్యం జరుగుతోందని, 123 జీవోపై రాద్ధాంతం చేయడం వల్లే భూసేకరణలో సమస్యలు ఏర్పడ్డాయన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలోని 30 వేల ఎకరాల ఆయకట్టుకు తొలిసారి మంత్రి నీటిని విడుదల చేశారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలతో కలసి కృష్ణా జలాలకు పూజలు నిర్వహించారు.
అనంతరం కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘‘నిన్నటి దాకా కలగా ఉన్న కల్వకుర్తి ప్రాజెక్టు ఈ రోజు నిజమైంది. 1984లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. 30 ఏళ్లయినా ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సోయి గత ప్రభుత్వాలకు కలుగలేదు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కల్వకుర్తి పథకం పనుల్లో కదలిక వచ్చింది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ పథకంపై రూ.1200 కోట్లు ఖర్చు చేసింది. చివరి ఆయకట్టులోని కల్వకుర్తి నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకే రూ.178 కోట్లు ఖర్చు చేసింది’’ అని వివరించారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వ లేకపోతున్నారని, అందుకే ప్రతి పనిని అడ్డుకుంటూ న్యాయపరమైన చిక్కులు తెచ్చి పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలకు మానవత్వం ఉంటే ఇప్పటివరకు ప్రాజెక్టులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ప్రజలను నమ్ముకుని పాలన సాగిస్తున్నామని, వారి మద్దతుతో మరోసారి అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు.
అంతకుముందు మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల కుయుక్తులను ప్రజలు నమ్మరని అన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి కల్వకుర్తి పథకంపై కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని సభలో వివరించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, దేవరకద్ర ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జోరువాన కురుస్తున్నా హరీశ్ తన పర్యటన కొనసాగించడంతో నాయకులు, అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment