దడ పుట్టిస్తున్న దాడులు
రెండో రోజు 51 హోల్‌సేల్ షాపుల్లో తనిఖీలు
రూ.1.48 కోట్ల విలువైన సరకు స్వాధీనం
16 షాపులపై కేసులు నమోదు
విశాఖపట్నం: కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై రెవెన్యూ యంత్రాంగం ఉక్కు పాదం మోపింది. మంగళవారం వరుసగా రెండో రోజు కూడా ఎనిమిది బృందాలు నగరంలో వివిధ చోట్ల మెరుపు దాడులు కొనసాగించాయి. పెదవాల్తేరు, ఎంపీపీ కాలనీ, అప్పూఘర్, మధురవాడ, పూర్ణ మార్కెట్, పెదగంట్యాడ, గాజువాక తదితర ప్రాంతాల్లో 51 హోల్‌సేల్‌షాపులు గోదాముల్లో కొనసాగించిన దాడుల్లో కోటి 48 లక్షల 85వేల 818ల విలువైన పప్పులు, వంట నూనెలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అనధికారికంగా నిల్వ చేసిన 33.234 ఎంటీల కంది పప్పు, 96.197 ఎంటీల మినపప్పు, పెసరపప్పులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రికార్డుల్లో చూపని 64,961 కేజీల నూనెలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
పెదగంట్యాడలో సరస్వతి ట్రేడర్స్, సూర్య ఎంటర్ ప్రైజస్, పూర్ణామార్కెట్‌లోని ఎఎన్‌ఆర్ ఫుడ్ ట్రేడర్స్, హరూన్ బ్రదర్స్, వర్తిక ఎంటర్ ప్రైజస్, కార్తిక్ ట్రేజర్స్, కామధేను కిరణా జనరల్ స్టోర్, కనకమహాలక్ష్మి ట్రేడర్స్, ఎస్‌కేఎంఎల్ ఫ్లోర్ మిల్, అప్పూఘర్ వద్దనున్న ఎస్‌కేఎంఎల్ ట్రేడర్స్, న్యూరేవతి కిరణా అండ్ జనరల్ స్టోర్స్, మధురవాడలోని గాయత్రి డిపార్టుమెంటల్ స్టోర్స్, రూపేష్ కిరణ్ స్టోర్స్, పెదవాల్తేరులోని పోలమాంబ కిరాణా జనరల్ స్టోర్స్, పోలమాంబ ట్రేడర్స్‌లలో ఈ దాడులు జరిగాయి. అత్యధికంగా పూర్ణమార్కెట్‌లోని కార్తిక ట్రేడర్స్‌లో 12.142 ఎంటీల కందిపప్పు, 15.625 ఎంటీల మినపప్పు, ఇతర పప్పులు, 21,699 కేజీల ఆయిల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.47.96 లక్షలుగా నిర్ధారించారు. నిల్వల్లో తేడాలుండడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, లెసైన్సుల్లేకుండా షాపులు నిర్వహించడం, స్టాక్ బుక్, బిల్ బుక్స్ సక్రమంగా నిర్వహించక పోవడం, ఎఫ్‌జీఎల్ లైన్స్ లేకుండా గోదాములను నిర్వహించడం వంటి అవకతవకలను గుర్తించారు. 16 షాపులపై కేసులు నమోదు చేసి రికార్డులను సీజ్ చేసారు. జాయింట్ కలెక్టర్ జె.నివాస్ ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, జిల్లా సివిల్ సప్లయిస్, కమర్షియల్ టాక్స్. రెవెన్యూ అధికారులతో ఏర్పాటైన ఎనిమిది ప్రత్యేక బృందాలు ఈ దాడులు చేశాయి.