ఎరువు ఎక్కడ ?
Published Thu, Sep 26 2013 11:45 PM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
సాక్షి, గుంటూరు :ఎరువుల పంపిణీపై జిల్లారైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రతీసారీ వ్యాపారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అక్టోబర్‌లో ఎరువుల అవసరాన్ని గుర్తించి సర్కారు ఇప్పట్నుంచే మేల్కోవాలని రైతు సంఘాల నేతలు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా వుండడంతో జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలో సుమారు 6 లక్షల హెక్టార్లలో వరి, పత్తి, మిర్చి సాగుచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 65 శాతం మేర వరి, మిర్చి పొలాల్లో ఎరువులు చల్లేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. పత్తి పూత, పిందె దశలో ఉండగా, మరికొద్ది రోజుల్లో యూరియా ఎరువును చల్లాల్సి ఉంది. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులతో పాటు ఎంఓపీకి వచ్చేరోజుల్లో డిమాండ్ ఏర్పడనుంది.
ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటికి 2 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే రైతులకు వ్యాపారుల ద్వారా అందాయి. మరో 80 వేల మెట్రిక్ టన్నుల వరకు మార్క్‌ఫెడ్, వ్యాపారులు, సొసైటీల వద్ద నిల్వ ఉన్న ట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వరినాట్లు వేసిన 25 రోజుల తరువాత ఎరువులతో అవసరం ఉంటుంది. ప్రస్తుతం అన్ని చోట్లా వరి నాట్లు పూర్తయి నెల కావస్తోంది. కొన్ని ఎరువుల కంపెనీలు రవాణ ఖర్చుల సాకుతో ఎంఆర్‌పీపై బస్తాకు రూ. 20 నుంచి రూ.50 వరకు పెంచి విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రభుత్వం సకాలంలో స్పందించి ఎరువుల స్టాక్ తెప్పించాలని, లేనిపక్షంలో ఖరీఫ్‌పై పెట్టుకున్న ఆశలు గల్లంతవుతాయని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.
వ్యాట్ బాదుడు ...
అన్నం పెట్టే రైతన్నకూ వ్యాట్ భారం తప్పడం లేదు. ఎరువుల కొనుగోలుపై అదనంగా వ్యాట్ భారం పడుతుంది. గతంలో ఎన్న డూ లేనంతగా ఎరువుల ధరలు పెరిగిపోయాయి. రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణను ఎత్తేయడంతో యూరియా మినహా ఇతర ఎరువులన్నీ ఆకాశన్నంటి ఉన్నాయి. దీనికితోడు రాష్ట్రప్రభుత్వం వడ్డించే వ్యాట్ మరింతభారంగా తయారైంది.ఎరువు లపై ఐదు శాతం వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) విధిస్తున్నారు. బస్తాపై కనిష్టంగా రూ.14.19, గరిష్టంగా రూ.54.09 అదనంగా చెల్లించాలి. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్‌లు కలిపి ఎరువుల కొనుగోలుపై రూ. 40 కోట్ల వరకు వ్యాట్ భారం అదనంగా పడనుంది.
Advertisement
Advertisement