డీసీఎం వాహనంలో పట్టుబడ్డ బియ్యం బస్తాలు చూపుతున్న విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ వినాయక్‌రెడ్డి
వర్గల్(గజ్వేల్): విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పంజా విసిరారు. డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సుమారు రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే 108.50 క్వింటాళ్ల బియ్యంతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించారు. రామచంద్రాపురం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ వినాయక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గురువారం టీఎస్ 30 టీ 3023 నంబర్ గల డీసీఎమ్ వాహనంలో అక్రమంగా పీడీఎస్ రేషన్ బియ్యం గజ్వేల్ మీదుగా తూప్రాన్ వైపు తరలివెళ్తున్నట్లు విజిలెన్స్ అధికారి వినాయక్‌రెడ్డికి పక్కా సమాచారం అందింది.
వెంటనే ఆయన తూప్రాన్–గజ్వేల్ రోడ్డుపై నిఘా వేశారు. అదేమార్గంలో పీడీఎస్ బియ్యంతో వస్తున్న సదరు డీసీఎం కన్పించింది. వెంటనే దానిని నిలువరించే ప్రయత్నం చేయగా, వర్గల్ మండల నాచారం పెట్రోల్ బంక్ వద్ద డ్రైవర్ వాహనాన్ని ఆపేసి పారిపోయాడు. డీసీఎమ్ వాహనంలో 217 బస్తాలలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించామని, సుమారు 108.50 క్వింటాళ్ల బియ్యం విలువ రూ. రెండున్నర లక్షలు ఉంటుందని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ వినాయక్‌రెడ్డి తెలిపారు. వాహనంతో సహా బియ్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. అనంతరం వాటిని రెవెన్యూ అధికారులకు స్వాధీనం చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment