పెద్దల పాత్ర నిజమే..!
- రాయితీల పక్కదారిపై విజిలెన్స్ కమిషన్ నిర్ధారణ
- మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రాయితీల పేరుతో గత ఆర్థిక సంవత్సరం చివర్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2,050 కోట్ల నిధుల్లో ఎక్కువభాగం దుర్వినియోగం అయ్యాయని, ఇందులో భారీ మొత్తం పెద్దల జేబుల్లోకే వెళ్లిందని విజిలెన్స్ కమిషన్ నిర్ధారించింది. పరిశ్రమలు క్షేత్రస్థాయిలో ఉన్నాయా లేవో కూడా పరిశీలించకుండానే నిధులిచ్చేశారని భావిస్తున్నట్టు సమాచారం ఇందులో పెద్ద స్థాయి వ్యక్తుల పాత్ర ఉన్నందున శాఖాపరమైన విచారణలో వాస్తవాలు బయటకు రావని, అందువల్ల ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించింది.
గత పదేళ్లకు సంబంధించిన పారిశ్రామిక రాయితీలు విడుదల చేయడంలోనే గూడుపుఠాణి దాగి ఉందని అనుమానిస్తోంది. వాస్తవానికి 2015-16 చివర్లో ఏకంగా పదేళ్ల పెండింగ్ పారిశ్రామిక రాయితీలు విడుదల చేయడాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇందులో భారీ కుంభకోణం ఉందని మొత్తం నిధుల్లో 30 నుంచి 50 శాతం వరకు పెద్దల జేబుల్లోకే వెళ్లాయని కూడా ఇటీవల తెలియజేసింది.
సీఐడీ విచారణ యోచనలో సీఎస్
పారిశ్రామిక రాయితీల్లో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌కు ఫిర్యాదు అందిం ది. దీనిపై సీఎస్ పరిశ్రమల శాఖ నుంచి నివేదిక కోరారు.విజిలెన్స్ విచారణకు ఆదేశించినప్పటికీ నెలలు తరబడి జాప్యం చేయడంపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. పరిశ్రమల శాఖలో ఉన్నతస్థాయి అధికారులకు తెలిసే రూ.పది కోట్లు దారిమళ్లి సమాం తర బ్యాంకు అకౌంట్లలోకి వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖ నుంచి నివేదిక వచ్చిన తర్వాత.. అందులోని తీవ్రత ఆధారంగా సీఐడీ విచారణకు ఆదేశించాలని సీఎస్ భావిస్తున్నట్టు సమాచారం.
ఏపీ ఫైళ్లు క్షుణ్ణంగా పరిశీలించండి
రాయితీల వ్యవహారం పరిశ్రమల శాఖలో కలకలం రేపుతోంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఎన్‌ఆర్‌ఐ పెట్టుబడిదారులు గత నాలుగు రోజులుగా ఈ వ్యవహారంపై వాకబు చేస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు కేంద్రం దృష్టికీ వెళ్లింది. ఏపీ నుంచి వచ్చే ప్రతీ ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని అంతర్గత ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) రుణ మంజూరులో కొత్త నిబంధనలు తెరమీదకు తెచ్చే ప్రతిపాదన చేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఏకంగా కేంద్ర ప్రభుత్వ ష్యూరిటీ ఉంటే తప్ప రుణాలు ఇవ్వలేమని తీర్మానించుకున్నాయి. రెండురోజుల క్రితం కొన్ని సంస్థలు ఈ తరహా లేఖలు కూడా రాసినట్టు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు.
జవాబుదారీతనం పెంచుతాం: మిశ్రా
రాయితీల గోల్‌మాల్ నేపథ్యంలో తమశాఖలో మరింత జవాబుదారీతనం పెంచుతామని పరిశ్రమల శాఖ డెరైక్టర్ కార్తికేయ మిశ్రా ‘సాక్షి’కిచ్చిన వివరణలో తెలిపారు. అధికారుల సస్పెన్షన్, ఇతర పరిణామాలు పెట్టుబడుల వేగాన్ని అడ్డుకోబోవన్నారు. ఇక నుంచి రాయితీలన్నీ ఈ-ఫైలింగ్ పద్ధతిలో ఆన్‌లైన్‌లో ఇస్తామని తెలిపారు.