subsidies scheme
-
‘ఎలక్ట్రానిక్స్’కు 50 వేల కోట్ల రాయితీలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అగ్రగామి మొబైల్ తయారీ కంపెనీలను భారత్‌కు ఆకర్షించే లక్ష్యంతో.. రూ.50 వేల కోట్ల రాయితీలతో కేంద్రం ముందుకు వచ్చింది. ఈ రాయితీలను పొందేందుకు గాను ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ప్రపంచంలో అగ్రగామి ఐదు మొబైల్ తయారీ కంపెనీలను తొలి దశలో భారత్‌కు ఆకర్షించే లక్ష్యంతో ఉన్నట్టు కేంద్ర ఐటీ, టెలికం రంగాల మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా ప్రకటించారు. అదే సమయంలో దేశీయంగాను ఐదు కంపెనీలను ప్రోత్సహించనున్నామని (ఐదు ఛాంపియన్లను సృష్టించడం) చెప్పారు. ‘‘మొత్తం రూ.50,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ప్రపంచ మొబైల్ మార్కెట్లో 80 శాతం వాటా 5–6 భారీ కంపెనీల చేతుల్లోనే ఉంది. పీఎల్ఐ పథకం కింద ఐదు అగ్రగామి కంపెనీలను అనుమతించనున్నాం’’ అని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ, స్థానిక కంపెనీలతో కలసి భారత్‌ను మంచి ఉత్పాదకత, నైపుణ్య దేశంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా ఉందంటూ, మొదటి స్థానాన్ని చేరుకునే దిశగా కృషి చేస్తున్నట్టు ప్రకటించారు. ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు ఇటీవలే ప్రభుత్వం మూడు పథకాలను ప్రకటించడం గమనార్హం. -
‘రియల్’ రయ్.. రయ్..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్రం ఇచ్చిన రాయితీలు రాష్ట్రంలో ఆ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా రాజధాని భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 2020 వరకు రూ. 45 లక్షలలోపు గృహాల కొనుగోలుకు రుణాలు తీసుకునే వారికి వడ్డీ చెల్లింపులో అదనంగా రూ. లక్షన్నర మేరకు ఆదాయపు పన్ను రాయితీ లభించనుంది. ఫలితంగా గృహ రుణాలపై లభించే ఆదాయపు పన్ను రాయితీ రూ. 3.5 లక్షలకు చేరుకుంది. దేశంలో ప్రతి కుటుంబానికీ సొంతింటి కలను నెరవేరుస్తామని చెబుతున్న కేంద్రం... ప్రస్తుతం ఇచ్చిన రాయితీతో సొంతింటి కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. మరోవైపు తొలిసారిగా ఇళ్లు కొనుగోలు చేస్తున్న వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద గరిష్టంగా రూ. 2.67 లక్షల వడ్డీ రాయితీ రావడం గమనార్హం. దీంతో మొత్తం పన్ను రాయితీ రూ. 6 లక్షలకు చేరుకుంది. కేంద్రం ఇచ్చిన ఈ రాయితీలతో నిర్మాణరంగం మరింత ఊపందుకోనుంది. మరోవైపు భారీ గృహ సముదాయాలు నిర్మించేందుకు ముందుకు వచ్చే రియల్ సంస్థలకు భూములు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని రియల్ కంపెనీలు స్వాగతిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయం సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే మధ్యతరగతి వాళ్ల కలలను సాకారం చేయనుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. పెట్రో ధరలతో ముడిసరుకుల భారం.. పెట్రోల్, డీజిల్‌లపై సెస్ విధించడంతో లీటరుకు రూ. 2 చొప్పున పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇది నిర్మాణరంగంపైనా ప్రభావం చూపే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. నిర్మాణ రంగానికి కీలకమైన ఇసుక, స్టీలు, సిమెంటు, కాంక్రీటు తదితర సరుకులపై రవాణా భారం పడే అవకాశాలు ఉండటంతో బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో మరింత జోరుగా.. దేశంలోని ప్రధాన నగరాల్లోకెల్లా హైదరాబాదులోనే ధరలు తక్కువగా ఉండటం తెలిసిందే. దీంతో భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా ఊపందుకుంటోంది. ప్రభుత్వం తాజాగా కల్పించిన ప్రోత్సాహకాలు, రాయితీలను భవిష్యత్తులో మరిన్ని కల్పిస్తే రియల్ రంగం వేగంగా ముందుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్ రెసిడెన్షియల్ విభాగంలో 30 శాతం వృద్ధి నమోదైందని ఇటీవల క్రెడాయ్ (ద కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులు వెల్లడించారు. పెరిగిన ఇళ్ల రేట్లు గృహ విక్రయాల్లో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానం దక్కించుకుందని రియల్ ఎస్టేట్ సేవల సంస్థ జేఎల్ఎల్ వెల్లడించింది. 2019 ప్రథమార్థంలో దేశవ్యాప్తంగా ఉన్న 7 నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితిపై అధ్యయనం చేసింది. ప్లాట్ల అమ్మకాల్లో హైదరాబాద్ వేరే నగరాలను వెనక్కి నెట్టింది. జనవరి నుంచి జూన్ మధ్య దాదాపు 65 శాతం వృద్ధి నమోదు కాగా, జాతీయ సగటు 22 శాతంగా ఉంది. ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్ నిలిచాయి. పశ్చిమ హైదరాబాద్‌లో నివాస సముదాయాలకు గిరాకీ ఎక్కువ ఉందని తెలిపింది. స్వాగతిస్తున్నాం... గృహ రుణాలపై లభించే ఆదాయపు పన్ను రాయితీ రూ. 3.5 లక్షలకు పెంచడాన్ని స్వాగతిస్తున్నాం. దీనికి పీఎంఏవై కింద లభిస్తున్న రూ. 2.67 లక్షల పన్ను రాయితీ కలిపితే గరిష్టంగా రూ. 6 లక్షల ప్రయోజనం చేకూరనుంది. సొంతింటి కలను నెరవేర్చాలనుకునే మధ్యతరగతి వర్గాలకు మంచి ప్రోత్సాహాన్నిస్తుంది. భారీ గృహ సముదాయాలు నిర్మించాలనుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు భూ కేటాయింపులు చేయాలనుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఆహ్వనిస్తున్నాం. అయితే పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు వల్ల రవాణా చార్జీలు పెరిగి ఇసుక, స్టీలు, సిమెంటు, కాంక్రీటు వంటి వాటి ధరలు పెరుగుతాయన్న ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌ను ఆర్బీఐ పరిధిలోకి తీసుకురావడం వల్ల బిల్డర్లకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పిస్తుందని విశ్వసిస్తున్నాం. ఈసారి బడ్జెట్లో ఇవన్నీ నిర్మాణరంగానికి సానుకూల అంశాలే. – సి.శేఖర్‌రెడ్డి, మాజీ ప్రెసిడెంట్, క్రెడాయ్ -
పోలీసులకు ఆర్థిక అండ
ఆదిలాబాద్ : శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం పాటుపడుతున్న పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రస్తుతం ఆయా అవసరాల కోసం పోలీసులు తీసుకుంటున్న రుణాలకు సంబంధించిన రుణ పరిమితి పెంపుపై పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఇటీవల డీజీపీ మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పెంపు నిర్ణయం తీసుకున్నారు. పోలీసు సిబ్బంది ఇళ్లు, ఇంటి స్థలం కొనుగోళ్లు, పిల్లల పెళ్లిళ్లు, వ్యక్తిగతంగా తీసుకునే రుణ పరిమితిని పెంచారు. ఈ నిర్ణయంతో జిల్లాలోని 1400 మంది పోలీసులకు లబ్ధి చేకూరనుంది. ఈ రుణ సహాయాన్ని పెంచడంపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రుణ పరిమితి పెంపు.. జిల్లా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు అందిస్తున్న అన్ని రుణాల పరిమితిని ప్రభుత్వం పెంచింది. పోలీసు సిబ్బందికి ఇంటి కొనుగోలు కోసం ఇస్తున్న రుణాన్ని రూ.10 లక్షలు, ఇంటి స్థలం కొనుగోలుకు ఇస్తున్న రుణాన్ని రూ.2 లక్షలు, వ్యక్తిగత రుణాన్ని రూ.3 లక్షల మేరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కానిస్టేబుల్ ర్యాంక్ వారీగా గతంలో ఇంటి కొనుగోలుకు రూ.20 లక్షల రుణం ఇవ్వగా దాన్ని రూ.30 లక్షలకు, ఇంటి స్థలానికి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచారు. ఎస్సై స్థాయి అధికారులకు ఇంటి కొనుగోలుకు రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షలకు, ఇంటి స్థలానికి రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షలకు పెంచారు. సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులకు ఇంటి కొనుగోలుకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలకు, ఇంటి స్థలానికి రూ.14 లక్షల నుంచి రూ.16లక్షల వరకు పెంచారు. ఐపీసీఎస్లకు ఇంటి కోసం రుణం రూ.35 లక్షల నుంచి 45 లక్షలకు, ఇంటి స్థలానికి రూ.16 లక్షల నుంచి రూ.18 లక్షలకు, సిబ్బంది కూతురు వివాహం కోసం ఇచ్చే రుణాన్ని రూ. 4 లక్షల నుంచి రూ.6 లక్షలకు, వ్యక్తిగత రుణాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. పోలీసుల హర్షం.. గతంలో పోలీసులకు వ్యక్తిగతంగా, ఇంటి స్థలం కొనుగోలు, ఇల్లు కట్టడానికి, కుమర్తె పెళ్లికి ఇచ్చే రుణాలు అరకొరగా ఉండేవి. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అవి సరిపోక పోలీసులు ఇతర బ్యాంకుల్లో, ఇతరుల వద్ద అప్పులు తీసుకుంటుండే వారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డీజీపీ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సదరు కమిటీ రుణాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు పోలీసులు తీసుకున్న రుణాలపై గతంలో 8.5 శాతం వడ్డీ ఉండేది. ప్రస్తుతం పెంచిన రుణాలకు 7.5 శాతానికి తగ్గించారు. రుణాల కోసం పోలీసులు దరఖాస్తు చేసుకోగానే వాటిని పరిశీలించి పది రోజుల్లోనే రుణాలను అందించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కుటుంబాలకు ఆర్థిక భరోసా.. పోలీసులకు అందిస్తున్న రుణాల పరిమితిని పెంచడంతో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుంది. ఇంటి నిర్మాణం, కూతుళ్ల పెళ్లిళ్లకు ప్రభుత్వం రుణాలు ఇచ్చిన అవి సరిపోయేవి కావు. ప్రస్తుతం రుణ పెంపు మా ఇబ్బందులను దూరం చేసింది. రుణాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి రుణపడి ఉంటాం. మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. – వెంకటేశ్వర్లు, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు అధికారులకు కృతజ్ఞతలు.. ఇంటి నిర్మాణం, స్థలం కొనుగోలు, కూతుళ్ల పెళ్లిళ్లకు రుణాలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషకరం. పోలీసు అధికారులు ఇందుకోసం ఎంతో కృషి చేశారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రుణాలు పెంచడం ద్వారా శుభకార్యాలకు, వ్యక్తిగత రుణాలకు బ్యాంకుల చుట్టూ తిరిగే అవస్థలు తప్పుతాయి. – సయ్యద్ మాజీద్ అలీ, కానిస్టేబుల్, ఆదిలాబాద్ రూరల్ సంతోషంగా ఉంది.. రుణాలు పెంచడం ఎంతో సంతోషంగా ఉంది. నిరంతరం విధులు నిర్వహించే మాకు ఏదైనా అవసరాలకు డబ్బుల కోసం తిరగాల్సిన పనిలేకుండా అన్ని విధాలా రుణాలు పెంచి ఆదుకున్నారు. ఈ నిర్ణయం పోలీసుల్లో మరింత ఉత్సహాన్ని నింపింది. భవిష్యత్‌లో మరిన్ని అనుకూలమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని ఆశిస్తున్నాం. – అశోక్‌సింగ్, కానిస్టేబుల్, మావల -
పెద్దల పాత్ర నిజమే..!
- రాయితీల పక్కదారిపై విజిలెన్స్ కమిషన్ నిర్ధారణ - మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రాయితీల పేరుతో గత ఆర్థిక సంవత్సరం చివర్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2,050 కోట్ల నిధుల్లో ఎక్కువభాగం దుర్వినియోగం అయ్యాయని, ఇందులో భారీ మొత్తం పెద్దల జేబుల్లోకే వెళ్లిందని విజిలెన్స్ కమిషన్ నిర్ధారించింది. పరిశ్రమలు క్షేత్రస్థాయిలో ఉన్నాయా లేవో కూడా పరిశీలించకుండానే నిధులిచ్చేశారని భావిస్తున్నట్టు సమాచారం ఇందులో పెద్ద స్థాయి వ్యక్తుల పాత్ర ఉన్నందున శాఖాపరమైన విచారణలో వాస్తవాలు బయటకు రావని, అందువల్ల ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించింది. గత పదేళ్లకు సంబంధించిన పారిశ్రామిక రాయితీలు విడుదల చేయడంలోనే గూడుపుఠాణి దాగి ఉందని అనుమానిస్తోంది. వాస్తవానికి 2015-16 చివర్లో ఏకంగా పదేళ్ల పెండింగ్ పారిశ్రామిక రాయితీలు విడుదల చేయడాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇందులో భారీ కుంభకోణం ఉందని మొత్తం నిధుల్లో 30 నుంచి 50 శాతం వరకు పెద్దల జేబుల్లోకే వెళ్లాయని కూడా ఇటీవల తెలియజేసింది. సీఐడీ విచారణ యోచనలో సీఎస్ పారిశ్రామిక రాయితీల్లో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌కు ఫిర్యాదు అందిం ది. దీనిపై సీఎస్ పరిశ్రమల శాఖ నుంచి నివేదిక కోరారు.విజిలెన్స్ విచారణకు ఆదేశించినప్పటికీ నెలలు తరబడి జాప్యం చేయడంపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. పరిశ్రమల శాఖలో ఉన్నతస్థాయి అధికారులకు తెలిసే రూ.పది కోట్లు దారిమళ్లి సమాం తర బ్యాంకు అకౌంట్లలోకి వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖ నుంచి నివేదిక వచ్చిన తర్వాత.. అందులోని తీవ్రత ఆధారంగా సీఐడీ విచారణకు ఆదేశించాలని సీఎస్ భావిస్తున్నట్టు సమాచారం. ఏపీ ఫైళ్లు క్షుణ్ణంగా పరిశీలించండి రాయితీల వ్యవహారం పరిశ్రమల శాఖలో కలకలం రేపుతోంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐ పెట్టుబడిదారులు గత నాలుగు రోజులుగా ఈ వ్యవహారంపై వాకబు చేస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు కేంద్రం దృష్టికీ వెళ్లింది. ఏపీ నుంచి వచ్చే ప్రతీ ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని అంతర్గత ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) రుణ మంజూరులో కొత్త నిబంధనలు తెరమీదకు తెచ్చే ప్రతిపాదన చేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఏకంగా కేంద్ర ప్రభుత్వ ష్యూరిటీ ఉంటే తప్ప రుణాలు ఇవ్వలేమని తీర్మానించుకున్నాయి. రెండురోజుల క్రితం కొన్ని సంస్థలు ఈ తరహా లేఖలు కూడా రాసినట్టు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. జవాబుదారీతనం పెంచుతాం: మిశ్రా రాయితీల గోల్మాల్ నేపథ్యంలో తమశాఖలో మరింత జవాబుదారీతనం పెంచుతామని పరిశ్రమల శాఖ డెరైక్టర్ కార్తికేయ మిశ్రా ‘సాక్షి’కిచ్చిన వివరణలో తెలిపారు. అధికారుల సస్పెన్షన్, ఇతర పరిణామాలు పెట్టుబడుల వేగాన్ని అడ్డుకోబోవన్నారు. ఇక నుంచి రాయితీలన్నీ ఈ-ఫైలింగ్ పద్ధతిలో ఆన్లైన్లో ఇస్తామని తెలిపారు.