ఆదిలాబాద్ : శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం పాటుపడుతున్న పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రస్తుతం ఆయా అవసరాల కోసం పోలీసులు తీసుకుంటున్న రుణాలకు సంబంధించిన రుణ పరిమితి పెంపుపై పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఇటీవల డీజీపీ మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పెంపు నిర్ణయం తీసుకున్నారు. పోలీసు సిబ్బంది ఇళ్లు, ఇంటి స్థలం కొనుగోళ్లు, పిల్లల పెళ్లిళ్లు, వ్యక్తిగతంగా తీసుకునే రుణ పరిమితిని పెంచారు. ఈ నిర్ణయంతో జిల్లాలోని 1400 మంది పోలీసులకు లబ్ధి చేకూరనుంది. ఈ రుణ సహాయాన్ని పెంచడంపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రుణ పరిమితి పెంపు..
జిల్లా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు అందిస్తున్న అన్ని రుణాల పరిమితిని ప్రభుత్వం పెంచింది. పోలీసు సిబ్బందికి ఇంటి కొనుగోలు కోసం ఇస్తున్న రుణాన్ని రూ.10 లక్షలు, ఇంటి స్థలం కొనుగోలుకు ఇస్తున్న రుణాన్ని రూ.2 లక్షలు, వ్యక్తిగత రుణాన్ని రూ.3 లక్షల మేరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కానిస్టేబుల్ ర్యాంక్ వారీగా గతంలో ఇంటి కొనుగోలుకు రూ.20 లక్షల రుణం ఇవ్వగా దాన్ని రూ.30 లక్షలకు, ఇంటి స్థలానికి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచారు. ఎస్సై స్థాయి అధికారులకు ఇంటి కొనుగోలుకు రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షలకు, ఇంటి స్థలానికి రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షలకు పెంచారు. సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులకు ఇంటి కొనుగోలుకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలకు, ఇంటి స్థలానికి రూ.14 లక్షల నుంచి రూ.16లక్షల వరకు పెంచారు. ఐపీసీఎస్‌లకు ఇంటి కోసం రుణం రూ.35 లక్షల నుంచి 45 లక్షలకు, ఇంటి స్థలానికి రూ.16 లక్షల నుంచి రూ.18 లక్షలకు, సిబ్బంది కూతురు వివాహం కోసం ఇచ్చే రుణాన్ని రూ. 4 లక్షల నుంచి రూ.6 లక్షలకు, వ్యక్తిగత రుణాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు.
పోలీసుల హర్షం..
గతంలో పోలీసులకు వ్యక్తిగతంగా, ఇంటి స్థలం కొనుగోలు, ఇల్లు కట్టడానికి, కుమర్తె పెళ్లికి ఇచ్చే రుణాలు అరకొరగా ఉండేవి. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అవి సరిపోక పోలీసులు ఇతర బ్యాంకుల్లో, ఇతరుల వద్ద అప్పులు తీసుకుంటుండే వారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డీజీపీ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సదరు కమిటీ రుణాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు పోలీసులు తీసుకున్న రుణాలపై గతంలో 8.5 శాతం వడ్డీ ఉండేది. ప్రస్తుతం పెంచిన రుణాలకు 7.5 శాతానికి తగ్గించారు. రుణాల కోసం పోలీసులు దరఖాస్తు చేసుకోగానే వాటిని పరిశీలించి పది రోజుల్లోనే రుణాలను అందించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
కుటుంబాలకు ఆర్థిక భరోసా..
పోలీసులకు అందిస్తున్న రుణాల పరిమితిని పెంచడంతో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుంది. ఇంటి నిర్మాణం, కూతుళ్ల పెళ్లిళ్లకు ప్రభుత్వం రుణాలు ఇచ్చిన అవి సరిపోయేవి కావు. ప్రస్తుతం రుణ పెంపు మా ఇబ్బందులను దూరం చేసింది. రుణాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి రుణపడి ఉంటాం. మరింత ఉత్సాహంతో పనిచేస్తాం.
– వెంకటేశ్వర్లు, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు
అధికారులకు కృతజ్ఞతలు..
ఇంటి నిర్మాణం, స్థలం కొనుగోలు, కూతుళ్ల పెళ్లిళ్లకు రుణాలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషకరం. పోలీసు అధికారులు ఇందుకోసం ఎంతో కృషి చేశారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రుణాలు పెంచడం ద్వారా శుభకార్యాలకు, వ్యక్తిగత రుణాలకు బ్యాంకుల చుట్టూ తిరిగే అవస్థలు తప్పుతాయి.
– సయ్యద్ మాజీద్ అలీ, కానిస్టేబుల్, ఆదిలాబాద్ రూరల్
సంతోషంగా ఉంది..
రుణాలు పెంచడం ఎంతో సంతోషంగా ఉంది. నిరంతరం విధులు నిర్వహించే మాకు ఏదైనా అవసరాలకు డబ్బుల కోసం తిరగాల్సిన పనిలేకుండా అన్ని విధాలా రుణాలు పెంచి ఆదుకున్నారు. ఈ నిర్ణయం పోలీసుల్లో మరింత ఉత్సహాన్ని నింపింది. భవిష్యత్‌లో మరిన్ని అనుకూలమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని ఆశిస్తున్నాం.
– అశోక్‌సింగ్, కానిస్టేబుల్, మావల
Published Tue, May 29 2018 6:47 AM | Last Updated on Tue, May 29 2018 6:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment