Industrial Department
-
ప్రమాదాల బాధ్యులపై కఠిన చర్యలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరిగిన వరుస పారిశ్రామిక ప్రమాదాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్షా నిర్వహించారు. పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో తనిఖీలు చేస్తున్నామని సమావేశంలో అధికారులు వెల్లడించారు. వచ్చే రెండు మూడు నెలల్లో ఈ తనిఖీలు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. పారిశ్రామిక ప్రమాదాల నివారణకుగాను అధికారులు ఇండస్ట్రీయల్ సేఫ్టీ పాలసీని ప్రతిపాదించారు. పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ సేఫ్టీ పాలసీ కిందకు తీసుకురావాలని అన్నారు. ఎలాంటి పరిశ్రమలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయన్నదాని గురించి ఇ-అట్లాసులో వివరాలు పొందుపర్చాలని అధికారులు సూచించారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారు కూడా.. కేటగిరీ ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నదాని పై ఇ-అట్లాస్ ద్వారా వివరాలు వెల్లడించాలని అధికారులు తెలిపారు. (చదవండి: మోడల్ పట్టణాలు: రూ.20 కోట్లు మంజూరు) ఏడాదికి రెండు సార్లు పరిశ్రమలు దాఖలు చేసే కాంప్లియన్స్ నివేదికలను ఏడాదికి రెండు సార్లు ఇచ్చేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నామన్న అంశాన్ని సంబంధిత కంపెనీలు బోర్డులపై ప్రదర్శించాలని తెలిపారు. వీటిపై థర్డ్‌పార్టీ తనిఖీలు కూడా ఉండాలని ఆదేశించారు. కేవలం పరిశ్రమల్లోనే కాకుండా ఇండస్ట్రియల్ పార్కుల్లో కూడా నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్నది చూడాలన్నారు. పర్యవేక్షణ యంత్రాంగం బలంగా ఉండాలని సీఎం తెలిపారు. విశాఖ గ్యాస్ దుర్ఘటనలో ఇన్‌హెబిటర్స్ (నిరోధం) ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని చెప్పారు. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానాలు వేస్తారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. మన దగ్గర అలాంటి పరిస్థితి లేదన్నారు. మనం కూడా ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలన్నారు. పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.50లక్షల పరిహారం ఇచ్చేలా పారిశ్రామిక విధానంలో నిబంధనలు పొందుపర్చాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ ప్రసాద్, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. (ఈ- రక్షాబంధన్‌కు విశేష ఆదరణ) -
పెట్టుబడులకు స్వర్గధామం
సాక్షి, హైదరాబాద్: ‘టీఎస్–ఐపాస్ ద్వారా ఇప్పటివరకు రూ.1,96,404 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అనుమతించిన 12,021 పరిశ్రమల్లో 75 శాతం పైగా కార్యకలాపాలను ప్రారంభించాయి. రానున్న రోజుల్లో రాష్ట్రానికి రూ. 45,848 కోట్ల పెట్టుబడులు మెగా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టుల రూపంలో రానున్నాయి, తద్వారా సుమారు 83 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి’అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. 2019–20 పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి కేటీఆర్ మంగళవారం ఇక్కడ ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుతో పోల్చితే 2019–20లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) 8.2 శాతం నమోదైందని మంత్రి పేర్కొన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 2018–19లో 4.55 శాతం ఉండగా, 2019–20లో 4.76 శాతానికి పెరిగిందన్నారు. జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.1,34,432 తో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,28,216 అన్నారు. దేశ ఎగుమతుల్లోనూ తెలంగాణ వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగిందన్నారు. ‘నెట్ ఆఫీస్ అబ్జర్షన్ విషయంలో హైదరాబాద్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అత్యత్తుమ జీవన ప్రమాణాల విషయంలో హైదరాబాద్ మరోసారి ప్రథమ స్థానం దక్కించుకుంది. నీతి ఆయోగ్ ప్రకటించిన సుస్థిర అభివృద్ధి సూచికల్లో బెస్ట్ పెర్ఫామింగ్ స్టేట్ గా రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. కరోనా సంక్షోభంలో తెలంగాణలోని పరిశ్రమలు పెద్దఎత్తున ప్రభుత్వానికి అండగా నిలిచాయి. రిలీఫ్ ఫండ్ కు రూ.150 కోట్లతో పాటు ఇతరత్రా కాంట్రిబ్యూషన్ రూపంలో అందించారు’అని తెలిపారు. ఫార్మా రంగంలో.. ఈసారి కూడా హైదరాబాద్ ఫార్మా మరియు లైఫ్ సైన్స్ రంగంలో జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో తన వాటాను 35 శాతంగా కొనసాగించింది. 800 ఫార్మా, బయోటెక్, మెడికల్ టెక్నాలజీ కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయి. వీటి వ్యాపార విలువ 50 బిలియన్ డాలర్లు. వచ్చే దశాబ్దకాలంలో 100 బిలియన్ డాలర్లకు పెంచాలని, 4 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోంది. నోవార్టిస్ తన డిజిటల్ ఇన్నోవేషన్ హబ్ హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ యూనిట్‌కు ఎస్ఎంటీ కంపెనీ పునాది వేసింది. రూ.250 కోట్లతో 20 ఎకరాల్లో మెడికల్ డివైస్ పార్క్‌లో ఈ పరిశ్రమ రానున్నది. 1,500 మందికి నేరుగా ఉపాధి లభించనుంది. మెడికల్ డివైస్ పార్క్‌లో సుమారు 25 కంపెనీలు తమ కంపెనీ ఏర్పాటు పనులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయి. జీనోమ్ వ్యాలీ వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికి 200 కంపెనీలతో సుమారు 10 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. శాండజ్, టీసీఐ కెమికల్స్, యాపన్ బయో, వల్లర్క్ ఫార్మా ఇలాంటి అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. సింజిన్ కంపెనీ జీనోమ్ వ్యాలీలో రూ.170 కోట్లతో పరిశ్రమను స్థాపించింది. 1,80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ కంపెనీలను ఒకేచోట చేర్చేందుకు రూ.100 కోట్ల పెట్టుబడితో ఎంఎన్ పార్క్ బిల్డింగ్ కోసం జినోమ్ వ్యాలీలో పునాదిరాయి వేయడం జరిగింది. హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వం జాతీయ పెట్టుబడి, తయారీ జోన్ (నిమ్జ్) గుర్తింపునిచ్చింది ‘ఏరోస్పేస్’లోనూ సత్తా.. ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టార్లో ఉత్తమ రాష్ట్రంగా కేంద్ర విమానయాన శాఖ నుంచి రాష్ట్రానికి పురస్కారం వరించింది. జీఎంఆర్ విమానాశ్రయం ప్రపంచంలోనే మూడో గ్రోయింగ్ ఎయిర్ పోర్టుగా అవార్డు అందుకుంది. నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ లిమిటెడ్ సుమారు ఐదు డిఫెన్స్ ప్రాజెక్టులను హైదరాబాద్‌కు తీసుకురావడంతో 600 మందికి ఉపాధి లభించనుంది. 2.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.350 కోట్లతో జీఎంఆర్ బిజినెస్ పార్కును శంషాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.300 కోట్లతో ఏడు ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, ఒక మెగా ఫుడ్ పార్క్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మరో రూ.3 వేల కోట్ల పెట్టుబడులతో వివిధ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు కార్యకలాపాలను ప్రారంభించేందుకు పనులు ప్రారంభించాయి. చేనేత, వస్త్ర రంగంలో.. సిరిసిల్లలో 60 ఎకరాల్లో అప్పారెల్ పార్క్‌ను, మరో వీవింగ్ పార్కును అభివృద్ధి చేయడం జరుగుతున్నది. 88 ఎకరా ల్లో 50 ఇండస్ట్రియల్ షెడ్ల నిర్మాణంతో 4,416 పవర్ లూ మ్లు, 60 వార్పిన్ యూనిట్లను ఏర్పాటు చేసే అవ కాశం ఉంది. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో రూ.960 కోట్లతో 300 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు కు యంగ్ వన్ కంపెనీ తుది దశ ఒప్పందా న్ని కుదుర్చుకుంది. 12 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. చందన్వెల్లిలో వెల్స్పన్ గ్రూపు రూ.1,150 కోట్లతో కేవలం 14 నెలల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. వేయి మందికి ఉపాధి లభించింది. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో రూ.327 కోట్లతో 30 ఎకరాల్లో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గణేశా ఈకోస్పియర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో వెయ్యిమందికి ఉద్యోగాలు లభిస్తాయి. రిటైల్ రంగంలో.. 20 వేల చదరపు అడుగులతో గచ్చిబౌలిలో తెలంగాణలోనే లార్జెస్ట్ డెలివరీ సెంటర్‌ను అమెజాన్ స్టార్ట్ చేసింది. వాల్ మార్ట్ రాష్ట్రంలో 5వ స్టోర్‌ను వరంగల్‌లో ప్రారంభించింది. -
మానవ వనరుల్ని తయారు చేయండి : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశ్రమలు, వాణిజ్యంపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో జరుగిన ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ రోజా, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాల అమలుకు వీలుగా నైపుణ్యమున్న మానవనరులను తయారుచేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకోసం 25 ఇంజినీరింగ్ కాలేజీలను గుర్తించే ప్రక్రియ వేగంగా జరగాలని అన్నారు. పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యున్నత పారదర్శక విధానాలను పారిశ్రామిక వర్గాలకు వివరించాలని సీఎం చెప్పారు. నౌకాశ్రయాలు, ఎయిర్ పోర్టులు, మెట్రోరైళ్లు, ఎలక్ట్రిక్ బస్సులు తదితర బీఓటీ ప్రాజెక్టులపైన దృష్టిపెట్టి పెట్టుబడులను ఆకర్షించాలని అన్నారు. ఇలాంటి ప్రాజెక్టులకు గ్లోబల్ టెండర్లు వేసి.. తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని వెల్లడించారు. పెట్టబడులను ఆకర్షించేలా రాష్ట్రానికి కొత్త నినాదం తీసుకురావాలని చెప్పారు. ‘ఇజ్రాయెల్ పర్యటనలో చూశాను. అక్కడ డీ శాలినేషన్ వాటర్‌ను వాడుతున్నారు. ఒక్క రూపాయికే 25 లీటర్ల తాగునీరు ఇస్తున్నారు. రూ.2 కే 20 లీటర్ల రక్షిత నీరు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన చంద్రబాబు మాట తప్పారు’ అని సీఎం జగన్ విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. పర్యావరణానికి నష్టం కలిగించకూడదు.. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేముందు వాటివల్ల ఎలాంటి కాలుష్యం వెలువడే అవకాశముందో ముందుగానే గ్రహించాలి. అవి టాక్సిక్ పదార్థాలను వెదజల్లుతాయా..? లేదా..? అనేది చూడాలి. ఫార్మా కంపెనీల నుంచి వస్తున్న కాలుష్యంలో తక్కువ మొత్తంలోనే శుద్దిచేస్తున్నారు. మిగతా కాలుష్యం అంతా గాలిలో కలిసిపోతోంది. పర్యావరణానికి ఎట్టిపరిస్థితుల్లోనూ నష్టం కలిగించకూడదు. లేకపోతే భవిష్యత్ తరాలకు మనం మిగిల్చేది ఏమీ ఉండదు. ఏ సముద్ర తీరం వద్దకు వెళ్లినా కాలుష్యమే ఉంటోంది. విశాఖలో సముద్రంలోని నీళ్లని చూస్తే కాలుష్యం తీవ్రత తెలుస్తుంది. కాలుష్యానికి భయపడి అనేక దేశాలు.. కొన్ని రకాలైన పరిశ్రమలను నిరాకరిస్తున్నాయి. కాలుష్యం పట్ల చాలా కఠినంగా ఉండాలి. పొల్యూషన్ బోర్డు క్లియర్ చేసిన తర్వాతే పరిశ్రమలకు అనుమతి ఇవ్వండి. శక్తిమంతమైన పొల్యూషన్ బోర్డు ఉండాలి. ఇన్సెంటివ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.. 2015–16 నుంచి రూ. 2 వేల కోట్లు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్‌లు పెండింగులో ఉన్నాయి. అయినా, ఈజ్‌ఆప్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రానికి ర్యాంకులెలా వచ్చాయి..?ప్రజలనెప్పుడూ మనం మోసం చేయకూదు. మరోవైపు ఇన్సెంటివ్‌లు ఇస్తాం, పెట్టుబడులు పెట్టండి అంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టమని ఏ ముఖం పెట్టకుని అడుగుతాం. గత ప్రభుత్వంలో ప్రతిరోజూ పరిశ్రమలు గురించి మాట్లాడారు, ప్రతిదేశమూ తిరిగారు, ప్రమోషన్ చేశారు.. కాని ఏం లాభం. పరిశ్రమలకోసం మనం ఏదైతే హామీలు ఇస్తామో.. అవి తప్పనసరిగా ఆచరణయోగ్యంగా ఉండాలి. మున్సిపాల్టీలు, రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో మంచి సాఫ్ట్వేర్ వినియోగించి.. పారదర్శకంగా సేవలు అందేలా చూడండి. ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టండి.. వచ్చే ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 ఏళ్లు దాటిన మహిళలకు నాలుగేళ్లలో రూ. 75వేలు వైఎస్సార్ చేయూత కింద ఇస్తున్నాం. అలాగే ఆసరా కింద మహిళలను ఆదుకుంటున్నాం. ఈ డబ్బు వారి జీవితాలను మార్చేలా, వారికి మరింత ఆదాయం తెచ్చేలా ఒక ప్రణాళిక తీసుకొచ్చేలా ఆలోచన చేయండి. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతోంది.. ఈ పథకాన్ని చిన్న, మధ్య, సూక్ష్మస్థాయి పరిశ్రమలు వినియోగించుకునేలా చూడండి. ఏపీఎస్ఆర్టీసీ లాభదాయకంగా పనిచేయాలి.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలి. డీజిల్ రూపంలో ఉన్న భారాన్ని తొలగించాలి. బకింగ్ హాం కెనాల్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలి. దీనికోసం ప్రణాళికలు వేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ప్రతి నియోజకవర్గాన్ని మ్యాపింగ్ చేయాలి. ఎక్కడెక్కడ ఏ రకమైన పంటలు పండుతున్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలన్న దానిపై ఒక ప్రణాళిక తయారుచేయాలి. మండలాలవారీగా నెలకొల్పాల్సిన కోల్డ్ స్టోరీజీ సెంటర్లను కూడా గుర్తించాలి. ఆక్వా ప్రాంతాలపై కూడా దృష్టిపెట్టాలి. కల్తీ ఫీడ్, కల్తీ సీడ్ రాకుండా చూడాలి. కడప స్టీల్ప్లాంట్పైన అధికారులు దృష్టిపెట్టాలి. -
పెద్దల పాత్ర నిజమే..!
- రాయితీల పక్కదారిపై విజిలెన్స్ కమిషన్ నిర్ధారణ - మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రాయితీల పేరుతో గత ఆర్థిక సంవత్సరం చివర్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2,050 కోట్ల నిధుల్లో ఎక్కువభాగం దుర్వినియోగం అయ్యాయని, ఇందులో భారీ మొత్తం పెద్దల జేబుల్లోకే వెళ్లిందని విజిలెన్స్ కమిషన్ నిర్ధారించింది. పరిశ్రమలు క్షేత్రస్థాయిలో ఉన్నాయా లేవో కూడా పరిశీలించకుండానే నిధులిచ్చేశారని భావిస్తున్నట్టు సమాచారం ఇందులో పెద్ద స్థాయి వ్యక్తుల పాత్ర ఉన్నందున శాఖాపరమైన విచారణలో వాస్తవాలు బయటకు రావని, అందువల్ల ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించింది. గత పదేళ్లకు సంబంధించిన పారిశ్రామిక రాయితీలు విడుదల చేయడంలోనే గూడుపుఠాణి దాగి ఉందని అనుమానిస్తోంది. వాస్తవానికి 2015-16 చివర్లో ఏకంగా పదేళ్ల పెండింగ్ పారిశ్రామిక రాయితీలు విడుదల చేయడాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇందులో భారీ కుంభకోణం ఉందని మొత్తం నిధుల్లో 30 నుంచి 50 శాతం వరకు పెద్దల జేబుల్లోకే వెళ్లాయని కూడా ఇటీవల తెలియజేసింది. సీఐడీ విచారణ యోచనలో సీఎస్ పారిశ్రామిక రాయితీల్లో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌కు ఫిర్యాదు అందిం ది. దీనిపై సీఎస్ పరిశ్రమల శాఖ నుంచి నివేదిక కోరారు.విజిలెన్స్ విచారణకు ఆదేశించినప్పటికీ నెలలు తరబడి జాప్యం చేయడంపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. పరిశ్రమల శాఖలో ఉన్నతస్థాయి అధికారులకు తెలిసే రూ.పది కోట్లు దారిమళ్లి సమాం తర బ్యాంకు అకౌంట్లలోకి వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖ నుంచి నివేదిక వచ్చిన తర్వాత.. అందులోని తీవ్రత ఆధారంగా సీఐడీ విచారణకు ఆదేశించాలని సీఎస్ భావిస్తున్నట్టు సమాచారం. ఏపీ ఫైళ్లు క్షుణ్ణంగా పరిశీలించండి రాయితీల వ్యవహారం పరిశ్రమల శాఖలో కలకలం రేపుతోంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐ పెట్టుబడిదారులు గత నాలుగు రోజులుగా ఈ వ్యవహారంపై వాకబు చేస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు కేంద్రం దృష్టికీ వెళ్లింది. ఏపీ నుంచి వచ్చే ప్రతీ ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని అంతర్గత ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) రుణ మంజూరులో కొత్త నిబంధనలు తెరమీదకు తెచ్చే ప్రతిపాదన చేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఏకంగా కేంద్ర ప్రభుత్వ ష్యూరిటీ ఉంటే తప్ప రుణాలు ఇవ్వలేమని తీర్మానించుకున్నాయి. రెండురోజుల క్రితం కొన్ని సంస్థలు ఈ తరహా లేఖలు కూడా రాసినట్టు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. జవాబుదారీతనం పెంచుతాం: మిశ్రా రాయితీల గోల్మాల్ నేపథ్యంలో తమశాఖలో మరింత జవాబుదారీతనం పెంచుతామని పరిశ్రమల శాఖ డెరైక్టర్ కార్తికేయ మిశ్రా ‘సాక్షి’కిచ్చిన వివరణలో తెలిపారు. అధికారుల సస్పెన్షన్, ఇతర పరిణామాలు పెట్టుబడుల వేగాన్ని అడ్డుకోబోవన్నారు. ఇక నుంచి రాయితీలన్నీ ఈ-ఫైలింగ్ పద్ధతిలో ఆన్లైన్లో ఇస్తామని తెలిపారు. -
జిల్లా పరిశ్రమల కేంద్రాలకు కొత్త రూపు
♦ నూతన భవనాలు, మౌలికసౌకర్యాలకు నిధులు ♦ పరిశ్రమల శాఖ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా భారీ ప్రచారం సాక్షి, హైదరాబాద్: నూతన పారిశ్రామిక విధానంతో కేవలం పది నెలల కాలంలో రూ.30వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన పరిశ్రమల శాఖ.. సంస్థాగతంగా పనితీరును మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించింది. జిల్లా స్థాయి నుంచి పరిశ్రమల శాఖ కార్యాలయాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. కార్యాలయాల్లో మంచి పరిసరాలు, పనివాతావరణం ఉంటేనే పెట్టుబడులను ఆకర్షించడం మరింత సులభమవుతుందని పరిశ్రమల శాఖ భావిస్తోంది. జిల్లాల్లోని పారిశ్రామిక కేంద్రాలను (డీఐసీలు) సుమారు 25ఏళ్ల క్రితం నిర్మించారు. ఆ తర్వాత వాటి నిర్వహణపై దృష్టి సారించక, మరమ్మతులు లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. వరంగల్ జిల్లా పారిశ్రామిక కేంద్రం శిథిలావస్థకు చేరడంతో ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతోంది. మరోవైపు హైదరాబాద్‌లోని వాణిజ్య, పరిశ్రమల శాఖ కమిషనర్ కార్యాలయం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఇది వారసత్వ (హెరిటేజ్) భవనం కావడంతో దానిని పునరుద్ధరించి, వాడుకలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిషనర్ కార్యాలయాన్ని పునరుద్ధరించేందుకు రూ.6.78 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. జిల్లా స్థాయిలో డీఐసీలకు కొత్త రూపు ఇచ్చేందుకు రూ.5 కోట్లు, కమిషనరేట్ భవనం మరమ్మతులకు రూ.3.75 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు కేంద్ర కార్యాలయంతో పాటు జిల్లా పరిశ్రమల కేంద్రాల్లో ఫర్నీచర్, కంప్యూటర్లు తదితరాలకు కాలం చెల్లినా... వాటినే వినియోగిస్తున్నారు. దీంతో కమిషనరేట్, డీఐసీల్లో నూతన ఫర్నీచర్, కంప్యూటర్లు ఇతర సామగ్రిని సమకూర్చడంతోపాటు, కార్యాలయాలకు ఆధునిక హంగులు అద్దాలని నిర్ణయించారు. అలాగే అన్ని కార్యాలయాల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రచారానికి రూ.50 కోట్లు! రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో అందుబాటులో ఉన్న మౌలిక సౌకర్యాలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, రోడ్‌షోల ద్వారా పారిశ్రామిక రంగంలో రాష్ట్ర శక్తి సామర్థ్యాలకు ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించారు. పారిశ్రామిక ప్రదర్శనల్లో పాల్గొనడం, బ్రోచర్లు, కరపత్రాల ముద్రణ, ఫిల్మ్‌లు, అడ్వర్టయిజ్మెంట్లు ద్వారా.. పరిశ్రమల శాఖ బ్రాండ్ ఇమేజీని పెంచి.. పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ఇవ్వాలని పరిశ్రమల శాఖ భావిస్తోంది. దీనికోసం రూ.50 కోట్ల మేర వెచ్చించనున్నారని తెలుస్తోంది. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగవంతమవుతుందని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. -
టెక్స్టైల్ యూనిట్ల అనుమతులు రద్దు
పాశమైలారం పార్కుపై మంత్రుల సమీక్ష * ఆగస్టు 21లోగా కార్యాచరణ ప్రణాళిక * ఈటీపీ నిర్మాణానికి ఏడాదికి పైగా గడువు * టెక్స్టైల్ పార్కులో రాజ్యమేలుతున్న సమస్యలు సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా పాశమైలారం టెక్స్టైల్ పార్కులో ప్లాట్లు కేటాయించినా పనులు ప్రారంభించని యూనిట్ల అనుమతులు రద్దు కానున్నాయి. ఆగస్టు 21లోగా పార్కు స్థితిగతులపై సంపూర్ణ కార్యాచరణ ప్రణాళికను రూపొందించే బాధ్యత పరిశ్రమల శాఖ కార్యదర్శికి అప్పగించారు. పార్కులో మౌలిక సౌకర్యా ల కల్పనకు సంబంధించిన అంశాలపై నిరే ్ధశిత వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృ ద్ధి సంస్థ (టీఎస్ ఐఐసీ) సూచనలు అందజేయాల్సి ఉంటుంది. కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు (ఈటీపీ) నిర్మాణాన్ని 12 నుంచి 16 నెలల వ్యవధిలో పూర్తి చేయాలి. అనుమతులు రద్దు చేసిన యూనిట్లను తిరిగి ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులకు కేటాయించనున్నారు. పార్కు నిర్వహణ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సీని యర్ అధికారిని నియమిస్తారు. మెదక్ జిల్లా పాశమైలారం టెక్స్టైల్ పార్కు స్థితిగతులపై పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మహిపాల్‌రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డితో పాటు టెక్స్టైల్ పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు. 2012లో కేటాయింపులు జరిగినా.. 2012లో పాశమైలారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.13.37 కోట్ల వ్యయంతో పార్కును అభివృధ్ది చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు మౌళిక సౌకర్యాల కల్పనకు రూ.9.22 కోట్లు వెచ్చించారు. మొత్తం 80 ప్లాట్లుగా విభజించి 42 మందికి 67 ప్లాట్లు కేటాయించారు. మరో 21 ప్లాట్లు కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్లాట్లు పొందిన వాటిలో 15 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి ప్రారంభించినా..ప్రస్తుతం 7 మాత్రమే పనిచేస్తున్నాయి. కోట్లు వెచ్చించినా పార్కు స్థాపన ద్వారా ఆశించిన స్థాయిలో ఉపాధి లభించడం లేదు. పారిశ్రామిక వాడలో సౌకర్యాల లేమి కూడా పెట్టుబడిదారులను నిరుత్సాహ పరుస్తున్నాయి. పార్కు చుట్టూ రక్షణ గోడ లేకపోవడంతో నిర్మాణ సామగ్రి, ముడిసరుకు, యంత్రాలకు రక్షణ లేకుండా పోయింది. టెక్స్టైల్ పరిశ్రమలు కాకుండా ఇతర పరిశ్రమలు కూడా ఏర్పాటైనట్లు ఫిర్యాదులున్నాయి. డైయింగ్ తదితరాల ద్వారా వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఈటీపీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. మరోవైపు యూనిట్ల నిర్మాణం పూర్తి కాకముందే పన్ను చెల్లించాలంటూ ఐలా (పారిశ్రామిక వాడల స్థానిక అభివృద్ధి సంస్థ) నోటీసులు జారీ చేస్తోంది. ఉత్పత్తి ప్రారంభం కాకముందే పన్నుల వసూలుపై పెట్టుబడిదారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. -
అనుమతులపై అలా కాదు.. ఇలా
సింగిల్ డెస్క్ విధానంలో మార్పులు సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక అనుమతులు 21 రోజుల్లోగా ఇవ్వడం కుదిరేపని కాదని ప్రభుత్వం తాజాగా తేల్చిచెప్పింది. నిర్దిష్టమైన కారణం ఉంటే పారిశ్రామిక అనుమతులు 21 రోజుల్లోగా ఇవ్వకపోయినా సంబంధిత అధికారిపై జరిమానా విధించలేమని.. శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోలేమని స్పష్టీకరించింది. ఈ మేరకు సింగిల్ డెస్క్ విధానం-2015కు సవరణలు, మార్పులు చేస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు చేయడానికి దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా.. అన్ని అనుమతులు ఇచ్చేలా రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ సింగిల్ డెస్క్ విధానం-2015’ను ఏప్రిల్ 29న ప్రభుత్వం ప్రకటించింది. క్షేత్ర స్థాయిలో ఈ విధానం అమలుకు ఇబ్బందులు ఉన్నాయని అధికారవర్గాలు ప్రభుత్వానికి తేల్చిచెప్పాయి. దాంతో.. వెనక్కి తగ్గిన ప్రభుత్వం సింగిల్ డెస్క్ విధానంలో మార్పులు చేసింది. 21 రోజుల్లోగా అనుమతి ఇవ్వకపోతే.. సంబంధిత దరఖాస్తుదారుడు సాధికార కమిటీకి ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈ ఫిర్యాదుపై సాధికార కమిటీ విచారణ చేసి.. 30 రోజుల్లోగా చర్యలు తీసుకుంటుంది. అనుమతి ఇవ్వకపోవడానికి సరైన కారణాన్ని సాధికార కమిటీకి సంబంధిత అధికారి చెబితే ఎలాంటి జరిమానా విధించమని.. శాఖపరమైన చర్యలు కూడా తీసుకోమని తాజాగా చేసిన సవరణలో ప్రభుత్వం పేర్కొంది.