సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశ్రమలు, వాణిజ్యంపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో జరుగిన ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ రోజా, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాల అమలుకు వీలుగా నైపుణ్యమున్న మానవనరులను తయారుచేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లకోసం 25 ఇంజినీరింగ్ కాలేజీలను గుర్తించే ప్రక్రియ వేగంగా జరగాలని అన్నారు.
పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యున్నత పారదర్శక విధానాలను పారిశ్రామిక వర్గాలకు వివరించాలని సీఎం చెప్పారు. నౌకాశ్రయాలు, ఎయిర్ పోర్టులు, మెట్రోరైళ్లు, ఎలక్ట్రిక్ బస్సులు తదితర బీఓటీ ప్రాజెక్టులపైన దృష్టిపెట్టి పెట్టుబడులను ఆకర్షించాలని అన్నారు. ఇలాంటి ప్రాజెక్టులకు గ్లోబల్ టెండర్లు వేసి.. తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని వెల్లడించారు. పెట్టబడులను ఆకర్షించేలా రాష్ట్రానికి కొత్త నినాదం తీసుకురావాలని చెప్పారు. ‘ఇజ్రాయెల్ పర్యటనలో చూశాను. అక్కడ డీ శాలినేషన్ వాటర్‌ను వాడుతున్నారు. ఒక్క రూపాయికే 25 లీటర్ల తాగునీరు ఇస్తున్నారు. రూ.2 కే 20 లీటర్ల రక్షిత నీరు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన చంద్రబాబు మాట తప్పారు’ అని సీఎం జగన్ విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
పర్యావరణానికి నష్టం కలిగించకూడదు..
పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేముందు వాటివల్ల ఎలాంటి కాలుష్యం వెలువడే అవకాశముందో ముందుగానే గ్రహించాలి. అవి టాక్సిక్ పదార్థాలను వెదజల్లుతాయా..? లేదా..? అనేది చూడాలి. ఫార్మా కంపెనీల నుంచి వస్తున్న కాలుష్యంలో తక్కువ మొత్తంలోనే శుద్దిచేస్తున్నారు. మిగతా కాలుష్యం అంతా గాలిలో కలిసిపోతోంది. పర్యావరణానికి ఎట్టిపరిస్థితుల్లోనూ నష్టం కలిగించకూడదు. లేకపోతే భవిష్యత్ తరాలకు మనం మిగిల్చేది ఏమీ ఉండదు. ఏ సముద్ర తీరం వద్దకు వెళ్లినా కాలుష్యమే ఉంటోంది. విశాఖలో సముద్రంలోని నీళ్లని చూస్తే కాలుష్యం తీవ్రత తెలుస్తుంది. కాలుష్యానికి భయపడి అనేక దేశాలు.. కొన్ని రకాలైన పరిశ్రమలను నిరాకరిస్తున్నాయి. కాలుష్యం పట్ల చాలా కఠినంగా ఉండాలి. పొల్యూషన్ బోర్డు క్లియర్ చేసిన తర్వాతే పరిశ్రమలకు అనుమతి ఇవ్వండి. శక్తిమంతమైన పొల్యూషన్ బోర్డు ఉండాలి.
ఇన్సెంటివ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి..
2015–16 నుంచి రూ. 2 వేల కోట్లు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్‌లు పెండింగులో ఉన్నాయి. అయినా, ఈజ్‌ఆప్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రానికి ర్యాంకులెలా వచ్చాయి..?ప్రజలనెప్పుడూ మనం మోసం చేయకూదు. మరోవైపు ఇన్సెంటివ్‌లు ఇస్తాం, పెట్టుబడులు పెట్టండి అంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టమని ఏ ముఖం పెట్టకుని అడుగుతాం. గత ప్రభుత్వంలో ప్రతిరోజూ పరిశ్రమలు గురించి మాట్లాడారు, ప్రతిదేశమూ తిరిగారు, ప్రమోషన్ చేశారు.. కాని ఏం లాభం. పరిశ్రమలకోసం మనం ఏదైతే హామీలు ఇస్తామో.. అవి తప్పనసరిగా ఆచరణయోగ్యంగా ఉండాలి. మున్సిపాల్టీలు, రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో మంచి సాఫ్ట్‌వేర్ వినియోగించి.. పారదర్శకంగా సేవలు అందేలా చూడండి.
ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టండి..
వచ్చే ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 ఏళ్లు దాటిన మహిళలకు నాలుగేళ్లలో రూ. 75వేలు వైఎస్సార్ చేయూత కింద ఇస్తున్నాం. అలాగే ఆసరా కింద మహిళలను ఆదుకుంటున్నాం. ఈ డబ్బు వారి జీవితాలను మార్చేలా, వారికి మరింత ఆదాయం తెచ్చేలా ఒక ప్రణాళిక తీసుకొచ్చేలా ఆలోచన చేయండి. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతోంది.. ఈ పథకాన్ని చిన్న, మధ్య, సూక్ష్మస్థాయి పరిశ్రమలు వినియోగించుకునేలా చూడండి.
ఏపీఎస్‌ఆర్టీసీ లాభదాయకంగా పనిచేయాలి..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలి. డీజిల్ రూపంలో ఉన్న భారాన్ని తొలగించాలి. బకింగ్ హాం కెనాల్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలి. దీనికోసం ప్రణాళికలు వేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ప్రతి నియోజకవర్గాన్ని మ్యాపింగ్ చేయాలి. ఎక్కడెక్కడ ఏ రకమైన పంటలు పండుతున్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలన్న దానిపై ఒక ప్రణాళిక తయారుచేయాలి. మండలాలవారీగా నెలకొల్పాల్సిన కోల్డ్ స్టోరీజీ సెంటర్లను కూడా గుర్తించాలి. ఆక్వా ప్రాంతాలపై కూడా దృష్టిపెట్టాలి. కల్తీ ఫీడ్, కల్తీ సీడ్ రాకుండా చూడాలి. కడప స్టీల్‌ప్లాంట్‌పైన అధికారులు దృష్టిపెట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment