సింగిల్ డెస్క్ విధానంలో మార్పులు
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక అనుమతులు 21 రోజుల్లోగా ఇవ్వడం కుదిరేపని కాదని ప్రభుత్వం తాజాగా తేల్చిచెప్పింది. నిర్దిష్టమైన కారణం ఉంటే పారిశ్రామిక అనుమతులు 21 రోజుల్లోగా ఇవ్వకపోయినా సంబంధిత అధికారిపై జరిమానా విధించలేమని.. శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోలేమని స్పష్టీకరించింది. ఈ మేరకు సింగిల్ డెస్క్ విధానం-2015కు సవరణలు, మార్పులు చేస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు చేయడానికి దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా.. అన్ని అనుమతులు ఇచ్చేలా రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ సింగిల్ డెస్క్ విధానం-2015’ను ఏప్రిల్ 29న ప్రభుత్వం ప్రకటించింది. క్షేత్ర స్థాయిలో ఈ విధానం అమలుకు ఇబ్బందులు ఉన్నాయని అధికారవర్గాలు ప్రభుత్వానికి తేల్చిచెప్పాయి. దాంతో.. వెనక్కి తగ్గిన ప్రభుత్వం సింగిల్ డెస్క్ విధానంలో మార్పులు చేసింది.
21 రోజుల్లోగా అనుమతి ఇవ్వకపోతే.. సంబంధిత దరఖాస్తుదారుడు సాధికార కమిటీకి ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈ ఫిర్యాదుపై సాధికార కమిటీ విచారణ చేసి.. 30 రోజుల్లోగా చర్యలు తీసుకుంటుంది. అనుమతి ఇవ్వకపోవడానికి సరైన కారణాన్ని సాధికార కమిటీకి సంబంధిత అధికారి చెబితే ఎలాంటి జరిమానా విధించమని.. శాఖపరమైన చర్యలు కూడా తీసుకోమని తాజాగా చేసిన సవరణలో ప్రభుత్వం పేర్కొంది.
అనుమతులపై అలా కాదు.. ఇలా
Published Sun, Jun 28 2015 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM
Advertisement
Advertisement