పెట్టుబడులకు స్వర్గధామం | KTR Unveiled The Industrial Department Annual Progress Report Of 2019-2020 | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు స్వర్గధామం

Published Wed, Jun 24 2020 1:55 AM | Last Updated on Wed, Jun 24 2020 1:55 AM

KTR Unveiled The Industrial Department Annual Progress Report Of 2019-2020 - Sakshi

పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదికను ఆవిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘టీఎస్‌–ఐపాస్‌ ద్వారా ఇప్పటివరకు రూ.1,96,404 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అనుమతించిన 12,021 పరిశ్రమల్లో 75 శాతం పైగా కార్యకలాపాలను ప్రారంభించాయి. రానున్న రోజుల్లో రాష్ట్రానికి రూ. 45,848 కోట్ల పెట్టుబడులు మెగా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రాజెక్టుల రూపంలో రానున్నాయి, తద్వారా సుమారు 83 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి’అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. 2019–20 పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఇక్కడ ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుతో పోల్చితే 2019–20లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) 8.2 శాతం నమోదైందని మంత్రి పేర్కొన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 2018–19లో 4.55 శాతం ఉండగా, 2019–20లో 4.76 శాతానికి పెరిగిందన్నారు.

జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.1,34,432 తో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,28,216 అన్నారు. దేశ ఎగుమతుల్లోనూ తెలంగాణ వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగిందన్నారు. ‘నెట్‌ ఆఫీస్‌ అబ్జర్షన్‌ విషయంలో హైదరాబాద్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అత్యత్తుమ జీవన ప్రమాణాల విషయంలో హైదరాబాద్‌ మరోసారి ప్రథమ స్థానం దక్కించుకుంది. నీతి ఆయోగ్‌ ప్రకటించిన సుస్థిర అభివృద్ధి సూచికల్లో బెస్ట్‌ పెర్ఫామింగ్‌ స్టేట్‌ గా రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. కరోనా సంక్షోభంలో తెలంగాణలోని పరిశ్రమలు పెద్దఎత్తున ప్రభుత్వానికి అండగా నిలిచాయి. రిలీఫ్‌ ఫండ్‌ కు రూ.150 కోట్లతో పాటు ఇతరత్రా కాంట్రిబ్యూషన్‌ రూపంలో అందించారు’అని తెలిపారు.

ఫార్మా రంగంలో..

  • ఈసారి కూడా హైదరాబాద్‌ ఫార్మా మరియు లైఫ్‌ సైన్స్‌ రంగంలో జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో తన వాటాను 35 శాతంగా కొనసాగించింది. 800 ఫార్మా, బయోటెక్, మెడికల్‌ టెక్నాలజీ కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయి. వీటి వ్యాపార విలువ 50 బిలియన్‌ డాలర్లు. వచ్చే దశాబ్దకాలంలో 100 బిలియన్‌ డాలర్లకు పెంచాలని, 4 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోంది.  
  • నోవార్టిస్‌ తన డిజిటల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ హైదరాబాద్లో ప్రారంభించింది. ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ యూనిట్‌కు ఎస్‌ఎంటీ కంపెనీ పునాది వేసింది. రూ.250 కోట్లతో 20 ఎకరాల్లో మెడికల్‌ డివైస్‌ పార్క్‌లో ఈ పరిశ్రమ రానున్నది. 1,500 మందికి నేరుగా ఉపాధి లభించనుంది. మెడికల్‌ డివైస్‌ పార్క్‌లో సుమారు 25 కంపెనీలు తమ కంపెనీ ఏర్పాటు పనులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయి.  
  • జీనోమ్‌ వ్యాలీ వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికి 200 కంపెనీలతో సుమారు 10 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. శాండజ్, టీసీఐ కెమికల్స్, యాపన్‌ బయో, వల్లర్క్‌ ఫార్మా ఇలాంటి అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. సింజిన్‌ కంపెనీ జీనోమ్‌ వ్యాలీలో రూ.170 కోట్లతో పరిశ్రమను స్థాపించింది. 1,80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ కంపెనీలను ఒకేచోట చేర్చేందుకు రూ.100 కోట్ల పెట్టుబడితో ఎంఎన్‌ పార్క్‌ బిల్డింగ్‌ కోసం జినోమ్‌ వ్యాలీలో పునాదిరాయి వేయడం జరిగింది. 
  • హైదరాబాద్‌ ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వం జాతీయ పెట్టుబడి, తయారీ జోన్‌ (నిమ్జ్‌) గుర్తింపునిచ్చింది 

‘ఏరోస్పేస్‌’లోనూ సత్తా.. 
ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ సెక్టార్‌లో ఉత్తమ రాష్ట్రంగా కేంద్ర విమానయాన శాఖ నుంచి రాష్ట్రానికి పురస్కారం వరించింది. జీఎంఆర్‌ విమానాశ్రయం ప్రపంచంలోనే మూడో గ్రోయింగ్‌ ఎయిర్‌ పోర్టుగా అవార్డు అందుకుంది. నోవా ఇంటిగ్రేటెడ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ సుమారు ఐదు డిఫెన్స్‌ ప్రాజెక్టులను హైదరాబాద్‌కు తీసుకురావడంతో 600 మందికి ఉపాధి లభించనుంది. 2.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.350 కోట్లతో జీఎంఆర్‌ బిజినెస్‌ పార్కును శంషాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. 

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగం 
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రూ.300 కోట్లతో ఏడు ఇంటిగ్రేటెడ్‌ కోల్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు, ఒక మెగా ఫుడ్‌ పార్క్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మరో రూ.3 వేల కోట్ల పెట్టుబడులతో వివిధ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రాజెక్టులు కార్యకలాపాలను ప్రారంభించేందుకు పనులు ప్రారంభించాయి.  

చేనేత, వస్త్ర రంగంలో..

  • సిరిసిల్లలో 60 ఎకరాల్లో అప్పారెల్‌ పార్క్‌ను, మరో వీవింగ్‌ పార్కును అభివృద్ధి చేయడం జరుగుతున్నది. 88 ఎకరా ల్లో 50 ఇండస్ట్రియల్‌ షెడ్ల నిర్మాణంతో 4,416 పవర్‌ లూ మ్‌లు, 60 వార్పిన్‌ యూనిట్లను ఏర్పాటు చేసే అవ కాశం ఉంది. కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కులో రూ.960 కోట్లతో 300 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు కు యంగ్‌ వన్‌ కంపెనీ తుది దశ ఒప్పందా న్ని కుదుర్చుకుంది. 12 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 
  • చందన్వెల్లిలో వెల్‌స్పన్‌ గ్రూపు రూ.1,150 కోట్లతో కేవలం 14 నెలల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. వేయి మందికి ఉపాధి లభించింది. 
  • కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కులో రూ.327 కోట్లతో 30 ఎకరాల్లో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గణేశా ఈకోస్పియర్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో వెయ్యిమందికి ఉద్యోగాలు లభిస్తాయి.

రిటైల్‌ రంగంలో..
20 వేల చదరపు అడుగులతో గచ్చిబౌలిలో తెలంగాణలోనే లార్జెస్ట్‌ డెలివరీ సెంటర్‌ను అమెజాన్‌ స్టార్ట్‌ చేసింది. వాల్‌ మార్ట్‌ రాష్ట్రంలో 5వ స్టోర్‌ను వరంగల్‌లో ప్రారంభించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement