సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుగా హైదరాబాద్ నగరాన్నే ఎంచుకుంటున్నాయని, ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు అన్నారు. మైక్రోసాప్ట్ మొదలు పలు సంస్థలు నగరంలో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రశాంతంగా కొనసాగిస్తున్నాయన్నారు.
ఇంతటి అద్భుతమైన వాతావరణం ఏర్పాటుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు కృషి అమోఘమని ఆయన ఉద్ఘాటించారు. బుధవారం ఐటీసీ కాకతీయలో జరిగిన అమెరికన్ ఇండియా ఫౌండేషన్(ఏఐఎఫ్) హైదరాబాద్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో అత్యంత యువశక్తి ఉన్న దేశం భారత్ మాత్రమేనని, మన దేశంలో సగం జనాభా యువకులతోనే నిండి ఉందన్నారు.
ఎలాంటి విజయాలనైనా సాధించే సత్తా భారత్‌కు ఉందన్నారు. ఇటీవల కోవిడ్–19 విపత్కర పరిస్థితుల్లో అత్యంత వేగంగా వ్యాక్సిన్ తయారు చేసింది భారతదేశమేనన్నారు. అందులోనూ హైదరాబాద్ పాత్ర మరువలేనిదని, ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయిన టీకాల్లో మూడోవంతు భారత్‌లోనే తయారయ్యాయని కేటీఆర్ ఉద్ఘాటించారు.
విశ్వనగరంగా హైదరాబాద్...
గడిచిన ఎనిమిది సంవత్సరాల కాలంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపాంతరం చెందిందని మంత్రి కేటీఆర్ వాఖ్యానించారు. అత్యాధునిక వసతులతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సంస్థలను ఆకర్షిస్తోందని వివరించారు. ఏఎఎఫ్ హైదరాబాద్ చాప్టర్ ప్రారంభం ఎంతో సంతోషకరమన్న కేటీఆర్ ఏఎంఎఫ్ చేపట్టే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment