సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్ తమ అనుబంధ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ద్వారా హైదరాబాద్‌లో మరోసారి భారీ పెట్టుబడులు పెట్టనుంది. నగరంలో మూడు డేటా సెంటర్ల ఏర్పాటు కోసం రూ. 20,096 కోట్ల పెట్టుబడి పెడతామని 2020లో ప్రకటించిన ఏడబ్ల్యూఎస్ తాజాగా తమ విస్తరణ ప్రణాళికలు, వ్యాపార వ్యూహాల్లో భాగంగా 2030 నాటికి దశలవారీగా తమ పెట్టుబడులను రూ. 36,300 కోట్లకు పెంచనున్నట్లు ప్రకటించింది. అంటే కొత్తగా మరో రూ. 16,204 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది.
శుక్రవారం నగరంలోని హెచ్‌ఐసీసీలో జరిగిన ‘ఏడబ్ల్యూఎస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్’లో ఆ సంస్థ ఈ మేరకు ప్రకటన చేసింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ వినియోగదారులకు అత్యుత్తమ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అందించేందుకు ఏడబ్ల్యూఎస్ ఇప్పటికే చందన్‌వెల్లి, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీలో మూడు డేటా సెంటర్ల క్యాంపస్‌లను ఏర్పాటు చేసింది. వాటి మొదటి దశ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావడంతో వినియోగదారులకు పూర్తిస్థాయిలో క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
అమెజాన్ విస్తరణకు సహకరిస్తాం: మంత్రి కేటీఆర్
అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ, అదనపు పెట్టుబడి ప్రకటనను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు స్వాగతించారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు వెళ్లిన కేటీఆర్ అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ఏడబ్ల్యూఎస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్’లో ప్రసంగించారు. అమెజాన్ భారీ పెట్టుబడులతో డేటా సెంటర్ హబ్‌గా తెలంగాణ మారుతుందనే ఆశాభాశాన్ని వ్యక్తం చేశారు.
అమెజాన్ విస్తరణ ప్రణాళికలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. రాష్ట్రానికి వస్తున్న అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదొకటని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ–గవర్నెన్స్, హెల్త్‌కేర్, పురపాలక కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు ఏడబ్ల్యూఎస్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హైదరాబాద్‌లోని ఏడబ్ల్యూఎస్ క్యాంపస్‌లతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతోపాటు స్టార్టప్‌లకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment