ప్రమాదాల బాధ్యులపై కఠిన చర్యలు: సీఎం జగన్‌ | YS Jagan Mohan Reddy Review Meeting About Industrial Accidents | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు

Published Tue, Aug 4 2020 5:47 PM | Last Updated on Tue, Aug 4 2020 6:54 PM

YS Jagan Mohan Reddy Review Meeting About Industrial Accidents - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరిగిన వరుస పారిశ్రామిక ప్రమాదాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్షా నిర్వహించారు. పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో తనిఖీలు చేస్తున్నామని సమావేశంలో అధికారులు వెల్లడించారు. వచ్చే రెండు మూడు నెలల్లో ఈ తనిఖీలు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. పారిశ్రామిక ప్రమాదాల నివారణకుగాను అధికారులు ఇండస్ట్రీయల్‌ సేఫ్టీ పాలసీని ప్రతిపాదించారు.

పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ సేఫ్టీ పాలసీ కిందకు తీసుకురావాలని అన్నారు. ఎలాంటి పరిశ్రమలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయన్నదాని గురించి ఇ-అట్లాసులో వివరాలు పొందుపర్చాలని అధికారులు సూచించారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారు కూడా.. కేటగిరీ ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నదాని పై ఇ-అట్లాస్‌ ద్వారా వివరాలు వెల్లడించాలని అధికారులు తెలిపారు. 
(చదవండి: మోడ‌ల్ ప‌ట్ట‌ణాలు: ‌రూ.20 కోట్లు మంజూరు)

ఏడాదికి రెండు సార్లు
పరిశ్రమలు దాఖలు చేసే కాంప్లియన్స్‌ నివేదికలను ఏడాదికి రెండు సార్లు ఇచ్చేలా చూడాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నామన్న అంశాన్ని సంబంధిత కంపెనీలు బోర్డులపై ప్రదర్శించాలని తెలిపారు. వీటిపై థర్డ్‌పార్టీ తనిఖీలు కూడా ఉండాలని ఆదేశించారు. కేవలం పరిశ్రమల్లోనే కాకుండా ఇండస్ట్రియల్‌ పార్కుల్లో కూడా నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్నది చూడాలన్నారు. పర్యవేక్షణ యంత్రాంగం బలంగా ఉండాలని సీఎం తెలిపారు. విశాఖ గ్యాస్‌ దుర్ఘటనలో ఇన్‌హెబిటర్స్‌ (నిరోధం) ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదని సీఎం వైఎస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు. పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని చెప్పారు.

అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్‌ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానాలు వేస్తారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. మన దగ్గర అలాంటి పరిస్థితి లేదన్నారు‌. మనం కూడా ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలన్నారు. పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.50లక్షల పరిహారం ఇచ్చేలా పారిశ్రామిక విధానంలో నిబంధనలు పొందుపర్చాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పర్యావరణ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌ ప్రసాద్, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.
(ఈ- రక్షాబంధన్‌కు విశేష ఆదరణ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement