ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష | Cm Jagan Review Meeting On Aadudam Andhra Program | Sakshi
Sakshi News home page

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష

Published Wed, Dec 20 2023 6:31 PM | Last Updated on Thu, Dec 21 2023 2:45 PM

Cm Jagan Review Meeting On Aadudam Andhra Program - Sakshi

సాక్షి, అమరావతి: ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. డిసెంబరు 26న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశమని.. దీనికోసం సీఎస్‌ జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో పాటు సంబంధిత విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు.

క్రీడలను ప్రోత్సహిస్తూ ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం ఏపీ రాష్ట్రంలో జరగలేదన్న సీఎం జగన్‌.. అలాంటి కార్యక్రమాన్ని మనం తలపెట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమాన్ని అయినా ఒక బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేస్తూ చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎవరూ చేయని కార్యక్రమాలు మనం చేపట్టామన్నారు. 

‘నాడు నేడు కార్యక్రమం ద్వారా 45వేల స్కూళ్లను సమూలంగా మార్పు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు చేయగలుగుతామా ? అని ఒక   క్వశ్చన్‌ మార్క్‌ ఉండేది.  అలాగే 15వేల సచివాలయాలను స్థాపించగలుగుతామా అన్నది మరోక క్వశ్చన్‌ మార్కు? ప్రతి సచివాలయం పరిధిలో విలేజ్‌ క్లినిక్‌ పెట్టగలుగుతామా అన్నది ఇంకోక క్వశ్చన్‌ మార్కు? 1.30 లక్షల మందిని అతితక్కువ కాలంలో సచివాలయాల్లో నియమించగలుగతామా?  అన్నది కూడా మరో క్వశ్చన్‌ మార్కు? ఇవన్నీ విజయవంతంగా చేయగలిగాం. 

అక్కడ నుంచి మొదలుపెడితే ఆరోగ్యసురక్ష వరకు ప్రతి కార్యక్రమాన్నీ ఒక ఛాలెంజ్‌గానే చేపట్టాం. దేవుడి దయతో ప్రతి అడుగులోనూ అంచనాలను మించి పనిచేయగలిగాం. అందులో భాగమే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం కూడా.  15వేల సచివాలయాలను ఒక కార్యక్రమంలో భాగం చేయడంతో పాటు, సచివాలయ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించే విధంగా అడుగులు వేస్తున్నాం.

గ్రామస్థాయిలో వ్యాయామం, క్రీడలు ప్రమోట్‌ చేయాలి
దీనికి రెండు ప్రధాన కారణాలు. ఒకటి మనం ఆరోగ్యసురక్ష, ఆరోగ్యశ్రీ మీద పెడుతున్న శ్రద్ధ, విలేజ్‌ క్లినిక్స్‌ ఇవన్నీ ప్రివెంటివ్‌ కేర్‌ మీద ఎప్పుడూ పడని అడగులు మనం రాష్ట్రంలో వేస్తున్నాం. ప్రివెంటివ్‌ కేర్‌ అన్నది ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే అందులో ముఖ్యమైనది వ్యాయామం. గ్రామస్థాయిలో వ్యాయామం, క్రీడలు ఈ రెండింటిని ప్రమోట్‌ చేయడం అన్నది ఒక ప్రధాన కారణం అయితే..

రెండోది గ్రామస్థాయిలో మన దగ్గరున్న క్రీడా ప్రతిభను, మట్టిలో మాణిక్యాలను గుర్తించి, వారికి సరైన గుర్తింపు ఇవ్వగలిగితే మరింత మంది ప్రతిభావంతులు బయటపడతారు. గ్రామస్థాయి నుంచి మన పిల్లలు పెద్ద సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుంది. 

ఈ రెండు కారణాలను దృష్టిలో ఉంచుకుని.. వీటిని ప్రమోట్‌ చేయడం కోసం రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అడుగులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విషయంలో ఇప్పటికే సీఎస్, ఇతర అధికారులు పలుదఫాలుగా సమావేశమయ్యారు. విధివిధానాలు రూపొందించారు.

ప్రధానంగా 5 క్రీడలకు ప్రోత్సహిస్తూ..
ఇందులో 5 క్రీడలను ప్రోత్సహించాలి. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో లను ప్రమోట్‌ చేయాలి. గ్రామస్థాయి నుంచి వీటిని ప్రమోట్‌ చేయాలన్నదే మన లక్ష్యం.గ్రామస్థాయి నుంచి మొదలుపెట్టి రాష్ట్రస్థాయి వరకు నిర్వహించి.. వీటిని ముగించడంతో పాటు మనం ఐడెంటిపై చేసిన ప్రతిభగల క్రీడాకారులను మరలా ప్రోత్సహించే వరకు కూడా అడుగులు పడాలి. 

పోటీలను ప్రారంభించే ముందు సన్నహాకంగా...జిల్లా స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి వరకు పండగలా అవగాహన కార్యక్రమం మొదలుపెట్టాలి. అందులో భాగంగా 3 కిలోమీటర్ల మారథాన్‌ వంటి కార్యక్రమాలు జిల్లా స్థాయిలో నిర్వహించాలి. దీనిద్వారా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ఒక ఉత్సాహాన్ని తీసుకుని రాగలుగుతాం.
చదవండి: విజయవాడ: సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌ 

47 రోజుల పాటు ఆటల పండగ...
డిసెంబరు 26 నుంచి కార్యక్రమం మొదలై.. 47 రోజులపాటు ఫిబ్రవరి 10 వరకు సచివాలయం, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కార్యక్రమం వివిధ దశల్లో జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎస్‌ఓపీని సమగ్రంగా మరోక్కసారి పరిశీలించాలి. అదే విధంగా దీనికోసం 14,997 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 9,043 క్రీడా మైదానాలను గుర్తించారు.

క్రీడల నిర్వహణ కోసం మైదానాలన్నీ సిద్ధంగా ఉన్నాయా ? లేదా? పనులు ఎంతవరకు వచ్చాయన్నది ఎప్పటికప్పుడు పరిశీలించాలి. వీలైనంతవరకు అన్ని సచివాలయాల పరిధిలో వీటిని నిర్వహించేలా చూడాలి. 
ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం డిసెంబరులో నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలి. 

ప్రతి సంవత్సరం గ్రామస్థాయి నుంచి మనం క్రీడల్లో మట్టిలో రత్నాలు వంటి  ప్రతిభావంతులను వెదికిపట్టుకోగలిగితే.. పీవీ సింధు, జ్యోతిసురేఖ, రాయుడు, శ్రీకాంత్, సాకేత్‌ వంటి మరింత మంది అంతర్జాతీయ క్రీడాకారులను చూడగలుగుతాం. గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ వేదిక వరకు మన ప్రతిభను చూపించగలుగుతాం. 

బాలికలను ప్రోత్సహించాలి
ఈ క్రీడల నిర్వహణ కోసం ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్స్, మున్సిపల్‌ స్టేడియంలు, జిల్లా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు అన్నింటినీ క్రోడీకరించి వినియోగంలోకి తీసుకురాగలిగాలి. 26 డిసెంబరు కన్నా ముందే సచివాలయం పరిధిలో పోస్టర్లు డిస్‌ప్లే చేయాలి. వాలంటీర్లు కూడా అవేర్‌నెస్‌ చేసేలా చూడాలి. 15 సంవత్సరాలు పైబడిన వారిని, ప్రధానంగా బాలికలను ఎక్కువగా ప్రోత్సహించాలి. గ్రామాల్లో బాలికలు తక్కువగా వస్తారు. వారిని ఎక్కువగా ప్రోత్సహించాలి.

ఆడుదాం ఆంధ్ర కోసం 1.23 కోట్ల రిజిస్ట్రేషన్స్‌ జరిగాయని అధికారులు చెప్పారు. 34.19 లక్షల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని చెప్పారు. అదే విధంగా 88.66 లక్షల మంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావడానికి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పోటీలకు అవసరమైన ప్రతి కిట్‌ను నాణ్యత పరీక్షించి అప్పుడే గ్రామస్థాయికి పంపించాలి. కిట్‌లో ఉండాల్సినవన్నీ ఉన్నాయా? లేదా? అన్నది కూడా చూసుకోవాలి. దీనిపై కూడా ఒక ఎస్‌ఓపీ రూపొందించి.. పర్యవేక్షించాలి.


నియోజకవర్గస్థాయిలో ప్రొఫెషనల్స్‌ గుర్తింపు..
నియోజకవర్గస్థాయి నుంచి ప్రొఫెషనల్స్‌కు చేయూతనిచ్చే కార్యక్రమం మొదలవుతుంది.  క్రికెట్‌కు సంబంధించి చెన్నై సూపర్‌ కింగ్స్, ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ టాలెంట్‌ హంట్‌లో భాగస్వామ్యులవుతారు. 
బ్యాడ్మింటన్‌కు సంబంధించి సింధు, శ్రీకాంత్‌ కూడా టాలెంట్‌ హంట్‌లో భాగస్వామ్యులవడానికి ముందుకు వచ్చారు. వీరికి కృతజ్ఞతలు.
అలాగే వాలీబాల్‌కి సంబంధించి ప్రైమ్‌ వాలీబాల్, కబడ్డీకి సంబంధించి ప్రొకబడ్డీ ఆర్గనైజర్స్‌ ముందుకు వచ్చారు. నైపుణ్యం ఉన్నవాళ్లను ఎంపికచేస్తారు. ఖోఖోకు సంబంధించి ఏపీ స్టేట్‌ అసోసియేషన్‌ సర్వీసెస్‌ను తీసుకుంటున్నాం.

అంతే కాకుండా వీటిని ప్రమోట్‌ చేసేందుకు 21 మంది రాష్ట్రస్థాయి అంబాసిడర్‌లు, 345 మంది జిల్లా స్థాయిలో ప్రతిభావంతులు కూడా ముందుకు వచ్చి అంబాసిడర్‌లుగా కార్యక్రమంలో భాగస్వామ్యులవుతారు. ఇవన్నీ మంచి పరిణామాలు. ఇవన్నీ క్రోఢీకరించి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి, అక్కడ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రొఫెషనల్స్‌ గేమ్స్‌ మొదలవుతాయి. 

ప్రతి స్థాయిలో ప్రైజ్‌మనీ...
ప్రతిచోటా ప్రైజ్‌మనీ కూడా నిర్ణయించాం. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ గేమ్స్‌లో రాష్ట్రస్థాయిలో విజేతలకు ఫస్ట్‌ ప్రైజ్‌ రూ.5లక్షలు, జిల్లా స్థాయిలో రూ.60వేలు, నియోజవర్గ స్థాయిలో రూ.35వేలు నగదు బహుమతి ఇస్తున్నాం. ద్వితీయ బహుమతి కింద రాష్ట్ర స్థాయిలో రూ.3 లక్షలు, జిల్లా స్థాయిలో రూ.30 వేలు, నియోజకవర్గస్థాయిలో రూ.15వేలు, అదే విధంగా తృతీయ బహుమతి కింద రాష్ట్రస్థాయిలో రూ.2లక్షలు, జిల్లా స్దాయిలో రూ.10వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.5వేలు ఇస్తారు.

బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ విజేతలకు రాష్ట్రస్థాయిలో ఫస్ట్‌ ప్రైజ్‌ కింద  రూ.2లక్షలు, జిల్లాస్థాయిలో రూ.35వేలు, నియోజకవర్గస్థాయిలో రూ.25వేలు నగదు బహుమతి ఉంటుంది. ద్వితీయ బహుమతి రాష్ట్ర స్థాయిలో రూ.1లక్ష, జిల్లా స్థాయిలో రూ. 20వేలు, నియోజకవర్గస్థాయిలో రూ.10 వేలు, తృతీయ బహుమతి కింద రాష్ట్రస్థాయిలో రూ.50వేలు,  జిల్లా స్థాయిలో రూ. 10వేలు, నియోజకవర్గస్థాయిలో రూ.5వేలు నగదు బహుమతి ఇస్తున్నాం.

సుదూర ప్రయోజనాలే లక్ష్యంగా...
వీటన్నింటిపై విస్తృతంగా అవగాహన కలిగించాలి. ప్రభుత్వం ఎందుకు ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తుంది.. వీటి వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఏంటన్నది తెలియజేయాలి. వాలంటీర్లు, సచివాలయం స్థాయి నుంచి ఇది జరగాలి. ప్రతి అడుగులో సక్రమైన పర్యవేక్షణ, ఎస్‌ఓపీతో మందుకు తీసుకుని వెళ్లాలి. 

డిసెంబరు 26న ప్రారంభించే ఈ కార్యక్రమం ద్వారా సుదూర ప్రయోజనాలు నెరవేరుతాయి. కచ్చితమైన ఫోకస్‌తో అడుగులు వేయండి. ఇది కేవలం క్రీడలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు...వీటని ప్రోత్సహించి, భవిష్యత్‌ తరాలను ఆ దిశగా మోటివేట్‌ చేయగలిగితే ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. 

ఆరోగ్యసురక్షాలో డయాబెటిక్, బీపీ కేసులు బయటపడ్డాయి. ప్రివెంటివ్‌ కేర్‌లో భాగంగా ప్రతి ఇంటిలో కూడా ఫిజికల్‌ యాక్టివిటీస్‌ పెరిగితే.. భవిష్యత్తులో ఇవన్నీ తగ్గుతాయి. అందుకే ఇది కూడా ప్రాముఖ్యత ఉన్న అంశం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని సీఎం స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement