పురుషుల బ్యాడ్మింటన్ విజేత ఏలూరు జోడీకి రూ.3 లక్షల నగదు, కప్‌ను అందించిన సీఎం
విశాఖ స్పోర్ట్స్: యువత క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తూ నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా..’ తొలి సీజన్ విజేతలకు ముఖ్యమంత్రి జగన్ మంగళవారం విశాఖలోని వైఎస్‌ఆర్ స్టేడియంలో ట్రోఫీలతో పాటు మెడల్స్, నగదు ప్రోత్సాహకాల్ని అందించారు. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ మెన్, వుమెన్ విజేతలకు చెక్కులను ట్రోఫీలతో పాటు అందించారు. బ్యాడ్మింటన్ తొలి మూడు స్థానాల్లో నిలిచిన జోడీలకు ట్రోఫీలతో పాటు నగదు ప్రోత్సాహకాల్ని అందించారు.
క్రికెట్ పురుషుల విభాగంలో ఏలూరు జట్టు విజేతగా నిలవగా మహిళా విభాగంలో ఎన్టీఆర్ జిల్లా జట్టు గెలుపొందింది. వాలీబాల్ మెన్, వుమెన్ రెండు విభాగాల్లోనూ బాపట్ల విజేతగా నిలిచింది. ఖోఖో మెన్‌లో బాపట్ల, వుమెన్‌లో ప్రకాశం జిల్లాలు విజేతలుగా నిలిచాయి. బ్యాడ్మింటన్ మెన్‌లో ఏలూరు జోడి, వుమెన్‌లో బాపట్ల జోడి విజేతగా నిలిచింది. కబడ్డీ మెన్‌లో బాపట్ల, వుమెన్‌లో విశాఖ జట్లు విజేతలుగా నిలిచి సీఎం జగన్ చేతుల మీదుగా ట్రోఫీలతో పాటు చెక్కులను అందుకున్నాయి.
క్రికెట్ విజేత ఏలూరు
విశాఖ వైఎస్‌ఆర్ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో డే నైట్‌గా సాగిన పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నక్కవానిపాలెం (విశాఖ) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులు చేసింది. ప్రతిగా అశోక్ పిల్లర్ రోడ్ (ఏలూరు) జట్టు తొలి యాభై పరుగుల్ని వికెట్ కోల్పోకుండానే చేసింది. పది ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయినా 69 పరుగులు చేసి నాలుగో వికెట్‌ను 87 పరుగుల వద్ద కోల్పోయింది.
అనంతరం వికెట్ కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. 16వ ఓవర్‌లో చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలచడం ద్వారా టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఏలూరు జట్టు గెలుపొందగా విశాఖ రన్నరప్‌గా నిలిచింది. మెన్ క్రికెట్ టైటిల్ పోరును సీఎం జగన్ స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించారు.
కబడ్డీలో బాపట్ల ఆధిక్యం..
కబడ్డీ పురుషుల ఫైనల్ పోటీ ఏయూ గ్రౌండ్స్‌లో జరిగింది. టాస్ గెలిచిన నాగులాపురం–1 (తిరుపతి) జట్టు కోర్టును ఎంచుకోగా కొత్తపాలెం–2 (బాపట్ల) జట్టు తొలి రైడ్ నుంచే ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తొలి అర్ధభాగంలో బాపట్ల 15–7తో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తిరుపతి జట్టు రెండో అర్ధభాగంలో కాస్త పుంజుకున్నా ఆధిక్యాన్ని తగ్గించలేకపోయింది.
ఇరు జట్లు రెండో అర్ధభాగంలో తొమ్మిదేసి పాయింట్లతో సమ ఉజ్జీగా నిలిచాయి. చివరికి కొత్తపాలెం 2 (బాపట్ల) 26–17తో నాగులాపురం 1 (తిరుపతి)పై గెలుపొంది మెన్ కబడ్డీ విజేతగా నిలిచింది. నాగులాపురం జట్టు రన్నరప్‌గా నిలిచింది. బాపట్ల తరపున లక్ష్మీనారాయణ, రామకృష్ణ, శ్రీకాంత్, వెంకటేశ్వర, హరిప్రసాద్, బాలకృష్ణ, అనిల్ ప్రసాద్ కోర్టులోకి దిగగా తిరుపతి జట్టు తరపున సతీష్, తరుణ్‌కుమార్, సుమన్, చిన్నముత్తు, దేవేంద్ర, తమిళైర్సన్, నరసింహ కోర్టులోకి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment