విశాఖ స్పోర్ట్స్/అక్కిరెడ్డిపాలెం: బాక్సింగ్ డే టెస్ట్‌లో సెంచరీతో అదరగొట్టి మెల్‌బోర్న్ హీరోగా మారిన నితీష్‌కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురుస్తుండగా, విశాఖలో సంబరాలు అంబరాన్ని తాకాయి. భారత టాపార్డర్ ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనలేక చేతులెత్తేసిన తరుణంలో నితీష్ ఒత్తిడిని తట్టుకుని చేసిన అసమాన పోరాటం చాలా కాలం గుర్తుండిపోతుందని చెబుతూ.. పలువురు అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. 8వ నంబర్ బ్యాటర్‌గా వచ్చి తొలి సెంచరీ చేయడంతో శనివారం జీవీఎంసీ 69వ వార్డు తుంగ్లాంలోని ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. నితీష్ నాన్నమ్మ అప్పల కొండమ్మ, బాబాయిలు కాకి గోవిందరెడ్డి, కాకి రామిరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు కేక్ కట్ చేశారు. ఇంటి వద్ద బాణసంచా కాల్చుతూ, తీన్‌మార్ డ్యాన్స్‌లతో సంబరాలు చేసుకున్నారు. భారత క్రికెట్ జట్టుకు తమ గ్రామానికి చెందిన నితీష్ ఆడుతుండటం తమకెంతో ఆనందంగా ఉందని గ్రామస్తు లు తెలిపారు.
ప్రస్తుతం నితీష్ నివాసం ఉంటున్న కొమ్మాదిలోని అపార్ట్‌మెంట్ వద్ద కూడా కోలాహలం నెలకొంది. అపార్ట్‌మెంట్ వాసులు నితీష్ ఆటను పూర్తిగా ఆస్వాదించారు. అతను సెంచరీ చేసిన దృశ్యాలను టీవీల్లో వీక్షిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్ కమిటీ ప్రతినిధి వి.వి.రావు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నితీష్ తక్కువ సమయంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడని సంతోషం వ్యక్తం చేశారు. రెండేళ్ల కిందటే వారు అపార్ట్‌మెంట్‌లోకి వచ్చారని తెలిపారు.
నితీష్‌కు కలెక్టర్ అభినందనలు
మహారాణిపేట: మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఉత్తమ ఆటతీరు కనబరిచిన యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అభినందించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్న నితీష్ ఆంధ్రప్రదేశ్‌కు, విశాఖపట్నానికి గర్వకారణమని కొనియాడారు. ఇదే ఒరవడి కొనసాగించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేయాలని ఆకాంక్షించారు. తన ఆటతో విశాఖకు మంచి పేరు తీసుకొచ్చిన నితీష్ కుమార్ రెడ్డికి జిల్లా యంత్రాంగం, ప్రజల తరఫున అభినందనలు తెలుపుతున్నట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment