టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అభినందనలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పొట్టి ఫార్మాట్లో అంతర్జాతీయ జట్టుకు ఎంపికైన విశాఖపట్నం కుర్రాడిపై ప్రశంసలు కురిపించింది.
కాగా సీనియర్ల గైర్హాజరీలో యువ భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జూలై 6 నుంచి మొదలుకానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఈ జట్టులో ఐపీఎల్ హీరోలు తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి(సన్‌రైజర్స్ హైదరాబాద్)తో పాటు అభిషేక్ శర్మ(యోహానన్ ప్రధాన కోచ్‌గా), రియాన్ పరాగ్(రాజస్తాన్ రాయల్స్), తుషార్ దేశ్‌పాండే(చెన్నై సూపర్ కింగ్స్) తదితర యంగ్‌క్రికెటర్లు తొలిసారిగా చోటు దక్కింది.
ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. శరత్ చంద్రా రెడ్డితో పాటు కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథ్ రెడ్డి, అపెక్స్ మెంబర్స్ నితీశ్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే నితీశ్ రెడ్డి ఐపీఎల్‌లో స్థానం సంపాదించాడు.
ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడి 303 పరుగులు చేశాడు. రైజర్స్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఆంధ్ర నుంచి టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలోనూ నితీశ్ రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రూ. 15.6 లక్షలకు ఈ యంగ్ సెన్సేషన్‌ను గోదావరి టైటాన్స్ యాజమాన్యం సొంతం చేసుకుంది. ఐపీఎల్-2024 వేలంలో భాగంగా నితీశ్ రెడ్డిని రూ. 20 లక్షల కనీస ధరకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ప్రధాన కోచ్‌గా యోహానన్‌నియామకం
క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) 2024–25 సీజన్ కోసం పురుషులు, మహిళల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) జట్లలోని పలు విభాగాలకు ప్రధాన కోచ్‌లను నియమించారు. 71 ఏళ్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఆడిన కేరళ రాష్ట్రానికి చెందిన భారతీయ మాజీ క్రికెటర్ టిను యోహానన్‌ను సీనియర్ పురుషుల విభాగానికి ప్రధాన కోచ్‌గా నియమించారు.
అదే విధంగా అండర్ –23 పురుషుల విభాగానికి ప్రధాన కోచ్‌గా జె.క్రిష్ణారావు, సీనియర్ మహిళా విభాగానికి ఎం.ఎన్. విక్రమ్ వర్మ, అండర్–23 మహిళా విభాగానికి ఎస్.రమాదేవి, అండర్–19 మహిళా విభాగానికి ఎస్.శ్రీనివాసరెడ్డి, అండర్–15 మహిళా విభాగానికి ఎం.సవితను ప్రధాన కోచ్‌లుగా నియమించారు.
ఇంటర్నేషనల్‌కు ఆడిన యోహానన్‌ను ప్రధాన కోచ్‌గా తీసుకొచ్చేందుకు ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి తీవ్రంగా కృషి చేసినందుకు సీఏసీ చైర్మన్ ఎన్.మధుకర్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. యోహానన్ ప్రధాన కోచ్‌గా నియమించడం వల్ల రాష్ట్రానికి చెందిన ప్లేయర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఎన్.మధుకర్ వెల్లడించారు.
యోహానన్ గురించి..
యోహానన్ 1979 ఫిబ్రవరి 18న జన్మించారు. టీమిండియా మాజీ క్రికెటర్. అతను కుడిచేతి వాటం కలిగిన ఫాస్ట్ మీడియం బౌలర్. కేరళ తరపున ఫస్ట్–క్లాస్ క్రికెట్ ఆడాడు.
భారత్ తరపున టెస్ట్, వన్డే క్రికెట్ ఆడిన మొదటి కేరళ ఆటగాడు. అతను ప్రస్తుత కేరళ క్రికెట్ జట్టు కోచ్. 2000లో బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి మొదటి ఇన్‌టేక్ కోసం ఎంపికయ్యాడు. డిసెంబర్ 2001లో ఇంగ్లండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో తన టెస్టు అరంగేట్రం చేశాడు.
మొహాలీలో జరిగిన మొదటి టెస్టులో అతను ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరినీ అవుట్ చేశాడు. అతను తన మొదటి ఓవర్ నాల్గవ బంతికి తన మొదటి టెస్ట్ వికెట్ సాధించారు. 2024–25 సీజన్‌ను విజయవంతంగా నిర్వహించాలని ఏసీఏ అధ్యక్షులు పి.శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment