నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా ఎదుగుతా
త్వరలోనే భారత్ జట్టుకు ఆడుతాను
ఐపీఎల్‌లో రాణించడం గొప్ప అనుభూతినిచ్చింది
ఐపీఎల్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గ్రహీత నితీష్‌కుమార్‌రెడ్డి
విశాఖ స్పోర్ట్స్: ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే.. ఐపీఎల్‌లో స్థానం సంపాదించి సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించడం ద్వారా ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్న విశాఖకు చెందిన కాకి నితీష్‌కుమార్‌రెడ్డి.. జాతీయ జట్టులో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని వెల్లడించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించి నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా ఎదుగుతానంటున్న నితీష్‌కుమార్‌రెడ్డితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. ఆయన మాటల్లోనే..
దేశంలోనే బెస్ట్ క్రికెటర్‌గా..
అండర్–12, 14లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) అకాడమీ ద్వారా శిక్షణ తీసుకున్నా. అనంతరం అండర్–16లో రాణించి ఏకంగా దేశంలోనే బెస్ట్ క్రికెటర్‌గా బీసీసీఐ నుంచి జగ్‌మోహన్ దాల్మియా అవార్డు అందుకోవడంతో నాలో ఆత్మవిశ్వాసం వచ్చింది. 2020లో తొలి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడి ఆ తర్వాతి ఏడాదే లిస్ట్–ఏ మ్యాచ్‌ల్లో ఇండియా–బి జట్టుకు ఆడాను. 2021 చివరికల్లా టి20ల్లో ఆడే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు ఐపీఎల్‌లో ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డు లభించడం వల్ల నా ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకునే అవకాశం కలిగింది.
అది.. గొప్ప అనుభూతి
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడటం ఆనందాన్నిచ్చింది. కీలక సమయాల్లో రాణించి సన్‌రైజర్స్ గెలుపులో భాగం కావడం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. టైటిల్ పోరులో సరిగ్గా ఆడలేకపోవడం కాస్త నిరాశ కలిగించింది. స్వదేశీ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా నా ఆటకు అన్వయించుకున్నా. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ భాయ్(ధోనీ) చూస్తుండగా చివరి బంతిని స్టాండ్స్‌లోకి తరలించడం.. మా జట్టు విజయం సాధించడం మరపురాని సంఘటన. మొత్తంగా ఐపీఎల్‌లో రాణించడం గొప్ప అనుభూతినిచి్చంది.
ఏపీఎల్‌లోనూ రాణిస్తా..
ప్రస్తుతం నా దృష్టి ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) మూడో సీజన్‌పైనే ఉంది. గోదావరి టైటాన్స్ ఫ్రాంచైజీ అత్యధిక ధరకు నన్ను దక్కించుకుంది. ఈ నెలాఖరు నుంచి ఏపీఎల్ మూడో సీజన్ ప్రారంభం కానుంది. నా అనుభవంతో జట్టును ముందుకు తీసుకువెళ్తా. నేను బౌలింగ్‌లోనూ రాణించేందుకు యార్కర్లపై దృష్టి పెడుతున్నా. అప్పుడే ఫర్‌ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా ఎదగగలను. ఐపీఎల్‌తో పాటు ఏపీఎల్ నా లక్ష్యానికి దోహదపడతాయని భావిస్తున్నా. ఆల్‌రౌండర్‌గా రాణించి జాతీయ జట్టులో స్థానం సాధించడమే నా తదుపరి లక్ష్యం. అదీ త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నా.
Comments
Please login to add a commentAdd a comment