IPL 2024: విశాఖలో మరోసారి ఐపీఎల్‌.. సీఎం జగన్‌ ప్రోత్సాహంతోనే.. | IPL is coming back to Visakhapatnam | Sakshi
Sakshi News home page

IPL 2024: విశాఖలో మరోసారి ఐపీఎల్‌.. సీఎం జగన్‌ ప్రోత్సాహంతోనే..

Published Fri, Feb 23 2024 9:25 AM | Last Updated on Fri, Feb 23 2024 10:33 AM

IPL is coming back to Visakhapatnam - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: వైఎస్సార్‌ స్టేడియం మరోసారి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే నాలుగు జట్లకు హోమ్‌ గ్రౌండ్‌గా నిలిచిన ఈ స్టేడియం ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు హోమ్‌ గ్రౌండ్‌గా నిలవనుంది. ప్రస్తుత 17వ ఐపీఎల్‌ సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనున్న చైన్నె సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ విశాఖ వేదికగా జరగనుంది. మరో 38 రోజుల్లో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు.

రెండు మ్యాచ్‌లు విశాఖలో...
ప్రస్తుత సీజన్‌లో తొలి విడతలో 21 మ్యాచ్‌లు 10 నగరాల్లో రెండు వారాలపాటు జరగనుండగా అందులో రెండు మ్యాచ్‌లు విశాఖలోనే నిర్వహించేందుకు బీసీసీఐ షెడ్యూలు ఖరారు చేసింది. 2019లో గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏకంగా రెండు ఐపీఎల్‌ ప్లేఆఫ్‌ మ్యాచ్‌లను విశాఖ సొంతం చేసుకోగా.. మళ్లీ ఇప్పుడు మరో రెండు మ్యాచ్‌లకు అతిథ్యమివ్వనుంది. హోమ్‌ గ్రౌండ్‌గా వైఎస్సార్‌ స్టేడియాన్ని తొలిసారిగా 2012లో డెక్కన్‌ చార్జర్స్‌ ఎంచుకోగా 2015లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఎంచుకుంది. 2016లో ముంబయ్‌ ఇండియన్స్‌, పూణే సూపర్‌ జెయింట్స్‌ జట్లు ఏకంగా మూడేసి మ్యాచ్‌లు ఆడాయి. ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు 13వ మ్యాచ్‌గా మార్చి 31న చైన్నె సూపర్‌కింగ్స్‌తోనూ, 16వ మ్యాచ్‌గా ఏప్రిల్‌ 3వ తేదీన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.

సీఎం జగన్‌ ప్రోత్సాహంతోనే..
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌బిన్నీ, కార్యదర్శి జైషా, ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ సహకారం.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహం వల్లే విశాఖలో రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌ నిర్వహణకు అవకాశం దక్కిందని ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు శరత్‌చంద్రరెడ్డి, కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి తెలిపారు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రపంచ స్థాయి వసతులను అందించడంతో విశాఖవాసులకు దక్కిన అదృష్టంగా భావించవచ్చని పేర్కొన్నారు. విశాఖలో క్రీడలకు ఎంతగానే ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

విశాఖకు ధోని
ఐపీఎల్‌–2016 సీజన్‌లో విశాఖలో జరిగిన 53వ మ్యాచ్‌లో పూణే సూపర్‌జెయింట్స్‌ జట్టు ఆట చివరి బంతిని ధోనీ బౌండరీ దాటించి నాలుగు వికెట్ల తేడాతో విజయతీరానికి చేర్చాడు. అప్పట్లో సీఎస్‌కే జట్టుకు ఐపీఎల్‌ అనర్హత వేటు పడగా ధోని సూపర్‌జెయింట్స్‌ తరఫున ఆడాడు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌ పంజాబ్‌ ఎలెవెన్‌ ఏడు వికెట్లకు 172 పరుగులు చేయగా ధోని సేన భారీ లక్ష్యచేధనలో ఆరు వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయాన్నందుకుంది. 30 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన ధోని 64పరుగులతో ఫినిషర్‌గా నిలిచాడు. మరోసారి ధోని ప్రత్యక్ష ఆటను చూసేందుకు విశాఖ తహతహలాడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement