
డా.బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ: కబడ్డీ క్రీడాకారులను మరింత తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి (విక్టరీ వెంకటరెడ్డి) అన్నారు. బుధవారం రావులపాలెంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలకు సంబంధించి విశాఖపట్నంలో మంగళవారం రాత్రి ముగింపు కార్యక్రమం జరిగిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారన్నారు. కబడ్డీలో రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులను మరింత తీర్చిదిద్దాలంటూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌కు బాధ్యత అప్పగించారన్నారు. లాంగ్ టర్మ్ కోచింగ్‌లో భాగంగా ప్రో కబడ్డీ క్యాంప్‌కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమన్, బాలకృష్ణారెడ్డిలను, అలాగే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కోచింగ్ క్యాంపునకు సంధ్య, సతీష్‌లను అప్పగించారన్నారు.
దానికి కట్టుబడి వారిని అన్నివిధాలా తీర్చిదిద్దుతామని వెంకటరెడ్డి తెలిపారు. త్వరలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రో కబడ్డీ తరహా ఆంధ్ర కబడ్డీ లీగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ శ్రీకాంత్, వైజాగ్ సెక్రటరీ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.