సాక్షి ప్రతినిధి, కాకినాడ: విప్లవాత్మక నిర్ణయాలతో విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వంపై ఈనాడు పచ్చ పైత్యంతో పేట్రేగిపోతోంది. ప్రభుత్వం తలపెట్టిన ప్రతి కార్యక్రమం పైనా విషం చిమ్ముతోంది. చివరకు విద్యార్థులకు సరఫరా చేస్తున్న బూట్లపై కూడా అసత్యాలు వండి వార్చి ప్రభుత్వంపై బురద జల్లుతోంది. ‘జగనన్నా... ఈ బూట్లు ధరించలేం’ శీర్షికతో ఈనాడు అచ్చువేసిన పిచ్చి రాతలపై వాస్తవాలు విస్తుగొలుపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి జరుగుతుంటే చూసి ఓర్వలేని పచ్చ పత్రిక తప్పుడు రాతలపై ‘సాక్షి’ ‘ఫ్యాక్ట్ చెక్’.
వాస్తవం ఏమిటంటే..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకూ 4.40 లక్షల మంది చదువుతున్నారు. ప్రతి విద్యార్థికీ ప్రభుత్వం ‘జగనన్న విద్యా కానుక’ అందించింది. వరుసగా నాలుగేళ్లుగా ఈ కానుకలు పంపిణీ చేస్తున్నారు. ప్రతి విద్యార్థికీ సుమారు రూ.2,400 వెచ్చించి బ్యాగ్, బూట్లు, బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఒక డిక్షనరీ, రెండు జతల సాక్స్, మూడు జతల స్కూల్ డ్రెస్, బెల్ట్ ఇస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇండెంట్ పెడుతున్నారు. ఆ సమయంలోనే విద్యార్థులకు జత బూట్లు అందించేందుకు అన్ని తరగతుల విద్యార్థుల పాదాలకు సంబంధించి ప్రింట్ పేపర్ ఆధారంగా కొలతలు తీసుకున్నారు. అవి సప్లై కాగానే స్కూళ్లు తెరచినప్పుడు విద్యార్థులకు వాటిని అందజేశారు.
ఏం జరిగిందో తెలుసుకోకుండానే..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 90 శాతం మంది విద్యార్థులకు బూట్ల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యింది. అక్కడక్కడ కొంత మంది విద్యార్థులకు బూటు సైజు సరిపోలేదు. ఎదిగే వయసు ిపిల్లలు కావడంతో శారీరక ఎదుగుదలతో పాటు పాదం సైజు కూడా మారుతూండటం సహజం. పై తరగతి పిల్లలకు అందజేసిన బూట్ల విషయంలో కొన్నిచోట్ల ఇబ్బంది రావడం సహజం. జనవరిలో పాదం కొలతలు తీసుకున్నారు. కొలతలు తీసుకుని ఏడు నెలలైంది. కొలతలు పాదం ఇన్నర్ సైజ్ తీసుకోగా, వాటిని బూట్ల తయారీ కంపెనీ బయటి కొలతలుగా భావించడంతో కొందరి సైజులు మారాయి. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా మొత్తం బూట్లన్నీ సరిపోలేదన్నట్టు ఈనాడు తన రాతలతో ప్రజలను కుట్రపూరితంగా తప్పుదారి పట్టిస్తోంది.
ఇదిగో వాస్తవం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తమకు బూట్లు సరిపోవడం లేదని చెప్పినట్టుగా ఈనాడు తన కథనంలో పేర్కొంది. కానీ ఇక్కడ వాస్తవాన్ని దాచిపెట్టింది. ఆ పాఠశాలలో 380 మంది విద్యార్థులుంటే వారిలో 200 మంది బూట్లు అందుకున్నారు. మిగిలిన వారిలో కొద్దిమందికి మాత్రమే బూట్ల సైజులు తేడా వచ్చాయి. పాఠశాలల ప్రారంభం రోజునే జగనన్న విద్యా కానుకను విద్యార్థులకు అందించారు. చిన్న పాదాలున్న 200 మంది 6, 7, 8 తరగతి విద్యార్థులకు బూట్ల సైజులు సరిపోయాయి. 180 మందిలో తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల్లో కూడా కొద్ది మందికి మాత్రమే సైజు తేడా వచ్చింది. విద్యా శాఖ అధికారులు వెంటనే దీనిని గుర్తించారు. మళ్లీ కొలతలు తీసుకుని ఆర్డర్ పెట్టారు. త్వరలోనే వారికి కొత్త బూట్లు అందజేస్తామని ఆ మండల విద్యాశాఖాధికారి నాగరాజు ‘సాక్షి’కి చెప్పారు.
వాస్తవం ఇలా ఉండగా ఉమ్మడి జిల్లా అంతటా బూట్ల పంపిణీపై ఈనాడు అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్న విద్యా కానుకపై రాస్తున్న పిచ్చి రాతలపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చంద్రబాబు ఏలుబడిలో ఇంత ఖరీదు పెట్టి సర్కార్ బడుల్లో పిల్లలకు యూనిఫాం, బ్యాగ్‌లు, బూట్లు, సాక్స్‌లు, బెల్ట్‌లు ఇచ్చిన దాఖలాలు లేనే లేవు. పాఠ్య పుస్తకాలు, ఒక జత యూనిఫాం మాత్రమే ఇచ్చేవారు. అదీ కూడా అరకొరగానే. పాఠశాలలో వంద మంది విద్యార్థులు ఉంటే పాతిక మందికి వస్తే గొప్పే అన్నట్లు ఉండేది నాటి పరిస్థితి. ఇప్పుడు పూర్తి పారదర్శకంగా పంపిణీ చేస్తుంటే సాంకేతికంగా ఎదురైన చిన్న సమస్యను భూతద్దంలో చూపి మరీ బురద జల్లుతోంది.
పాఠశాల తెరచిన రోజేకిట్ల పంపిణీ
పాఠశాలలు తెరచిన రోజునే జగనన్న విద్యాకానుక పేరుతో పుస్తకాలు, బూట్లు, బెల్టు, డిక్షనరీ, యూనిఫాం అన్నీ కలిపి ఒకే కిట్‌గా అందజేశాం. గత ప్రభుత్వంలో ఇవేమీ ఉండేవి కావు. ఉమ్మడి జిల్లాలో 90 శాతం పైనే పంపిణీ చేశాం. బూట్లకు సంబంధించి కొన్ని కొలతలు తేడా రావడంతో కొత్తవి ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం.
– జి.నాగమణి, ఆర్‌జేడీ, పాఠశాల విద్యాశాఖ
విద్యాకానుక ఒక మైలురాయి
విద్యాపరంగా ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల్లో విద్యాకానుక కూడా ఒక మైలురాయి. విద్యాకానుకలో విద్యార్థులకు నాణ్యమైన బ్యాగ్‌లు, పుస్తకాలు, బూట్లు అందించడంతో పాటు ‘నాడు–నేడు’లో పాఠశాలల రూపురేఖలను ప్రభుత్వం పూర్తిగా మార్చింది. సర్కార్ బడుల్లోని విద్యార్థులు పరీక్షల ఫలితాల్లో కార్పొరేట్ తరహాలో దూసుకుపోతున్నారంటే విద్యాపరంగా తీసుకువచ్చిన మార్పులే కారణం.
– ప్రొఫెసర్ ఎ.మురళీకృష్ణ, జేఎన్‌టీయూకే, విద్యావేత్త
పాఠశాల తెరవగానే పంపిణీ
ఈ ఏడాది పాఠశాల ప్రారంభంలోనే విద్యా కానుక కిట్లను సరఫరా చేశారు. ఈ కిట్లలో పుస్తకాలు, మూడు జతల యూనిఫాం, బూట్లు, సాక్సులు కూడా ఇచ్చారు. గతంలో ఎప్పుడూ ఇలా కిట్లు ఇవ్వలేదు. జగనన్న ఇచ్చిన బూట్లు వేసుకుని కొత్త యూనిఫాంతో ప్రతి రోజూ స్కూల్‌కు వెళ్లడం సంతోషంగా ఉంది.
– జంగం అఖిల, తామరపల్లి, కె.గంగవరం
బూట్లు బాగున్నాయి
ఈ ఏడాది ఇచ్చిన బూట్లు చాలా బాగున్నాయి. పాఠశాల ప్రారంభమైన తొలి రోజు నాటికే బూట్లు ఇచ్చారు. మాకు ఇచ్చిన బూట్లలో ఎక్కడా లోపం లేదు. మా పాదాలకు సరిగ్గా సరిపోయాయి. జగనన్న విద్యా కానుకలో ఇచ్చిన కిట్లలలో వచ్చిన బెల్ట్, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం అన్ని చాలా నాణ్యతగా ఉన్నాయి.
– కుడుపూడి నిఖిల్, కె.గంగవరం
Comments
Please login to add a commentAdd a comment