Adudam Andhra- సాక్షి, విజయనగరం(జామి): వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ సంకల్పం నెరవేరుతోంది. గ్రామీణ ప్రాంతం క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఆడుదాం–ఆంధ్రా పోటీల్లో రాణించిన క్రీడాకారులకు ఆఫర్లు వరుసకడుతున్నాయి. క్రికెట్ పోటీల్లో రాణించిన జామి మండలం అలమండకు చెందిన కె.పవన్‌కు ఐపీఎల్‌లో ఆడే అవకాశం చేరువైంది.
పవన్ ప్రతిభను గుర్తించిన సీఎస్‌కే (చెన్త్నె సూపర్ కింగ్స్) అతడిని దత్తత తీసుకుంది. అతడికి శిక్షణ ఇచ్చి జట్టులో ఆడే అవకాశం కల్పించనుంది. వివరాల్లోకి వెళ్తే.. పవన్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై మక్కువ. మొదట్లో ఇంటి వెనుక ఉన్న చిన్న గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుకునేవాడు. తరువాత గ్రామంలో హైస్కూల్ గ్రౌండ్‌లో ఆడేవాడు.
తల్లిదండ్రుల మరణంతో
క్రికెట్ లో బాగా రాణించేవాడు. అయితే, శిక్షణ తీసుకోవడానికి ఎటువంటి ఆసరా లేదు. చాలా నిరుపేద కుటుంబం. తండ్రి చిన్న వయసులోనే మృతిచెందాడు. తల్లి కూడా మృతిచెందింది. మామయ్య పైడిరాజు వద్ద ఉంటున్నాడు.
ఈ సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం–ఆంధ్రా క్రీడపోటీలకు హాజరయ్యాడు. మండల, నియోజకవర్గం, జిల్లాస్థాయి పోటీల్లో అలమండ జట్టు విజయంలో పవన్ ఆల్‌రౌండర్ ప్రతిభ చూపాడు. విశాఖపట్నంలో జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఫీల్డింగ్, బౌలింగ్‌లో ప్రతిభ చూపాడు.
పవన్‌లోని క్రీడా నైపుణ్యాన్ని సీఎస్‌కే గుర్తించి దత్తత తీసుకుంది. అతడి ఆట మరింత మెరుగుపడేలా శిక్షణ ఇవ్వనుంది.కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రీడా యజ్ఞం ఆడుదాం ఆంధ్రా ఈవెంట్‌కు విచ్చేసిన సీఎస్‌కే టాలెంట్ హంట్‌లో భాగంగా పవన్‌ను ఎంపిక చేసింది. అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కేవీఎం విష్ణు వర్ధినిని కూడా సెలక్ట్ చేసింది.
ఆడుదాం–ఆంధ్రాతో నాకు ఈ గుర్తింపు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంచి ఆలోచనతో ఆడుదాం–ఆంధ్రా క్రీడాపోటీలు నిర్వహించారు. దీనివల్ల మా లాంటి గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ చూపేందుకు వేదిక దొరికింది. సీఎస్‌కే నన్ను దత్తత తీసుకోవడం ఆనందంగా ఉంది. విశాఖలో జరిగిన రాష్ట్రస్ధాయి పోటీల్లో ముఖ్యమంత్రి అభినందించారు.
– కె.పవన్, క్రికెట్ క్రీడాకారుడు, అలమండ గ్రామం
Comments
Please login to add a commentAdd a comment