కాన్ఫిడెన్స్, డైనమిజమ్ అవన్నీ ఆయనలో ఉన్నాయి
ఆడుదాం.. ఆంధ్ర అద్భుతమైన కార్యక్రమం
దీనిద్వారా మట్టిలో మాణిక్యాలు వెలికితీయొచ్చు
ఇక్కడి మార్పులు స్వయంగా గమనించా
జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ కితాబు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుర్కొన్న కష్టాలు, చేసిన పోరాటాల నడుమ విజయం సాధించారని, ఇటీవలే ఆయన్ను వ్యక్తిగతంగా కలినినప్పుడు ఒక పులిబిడ్డను చూసిన ఫీలింగ్ కలిగిందని జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ వ్యాఖ్యానించారు. ‘ఆయన నవ్వు, చూపిన అభిమానం పలకరింపులోని స్వచ్ఛత నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి’’ అని చెప్పారు.
అటు చదువు ఇటు ఆటల్లోనూ రాణిస్తూ పిన్న వయసులోనే అద్భుతాలు లిఖిస్తూ ఏ రికార్డు కైనా చిరునామా అన్నట్టుగా మారిన యువ క్రీడా సంచలనం నైనా ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌తో తన అనుబంధం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విలక్షణ వ్యక్తిత్వంపై పలు విషయాలు పంచుకున్నారు ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విజయవంతంగా అమలు చేసిన ‘ఆడుదాం – ఆంధ్రా’ కార్యక్రమం అద్భుతం. ఒక క్రీడాకారిణిగా ఔత్సాహిక క్రీడాకారులు ఎదుర్కొనే సమస్యలు నాకు తెలుసు. నాకు అన్ని విధాలుగా మా తల్లిదండ్రుల మద్దతు పుష్కలంగా ఉండడం వల్ల నేను పెద్దగా సమస్యలు ఎదుర్కోనప్పటికీ... నా ఈడు వాళ్లు ఆర్థికంగా, శిక్షణ, వసతుల పరంగా ఎన్ని కష్టాలు అనుభవించారో నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే చొరవ తీసుకుని మట్టిలోని మాణిక్యాలను వెలికితీయడానికి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చేపట్టడం హర్షణీయం. – సాక్షి, అమరావతి
ఆంధ్రప్రదేశ్‌తో అల్లుకున్న అనుబంధం...
పుట్టింది హైదరాబాద్ అయినా కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌తో నా అనుబంధం అనేక రకాలుగా పెనవేసుకుపోయింది. ఏపీలో అనేక క్రీడా పోటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాను. మోటివేషనల్ స్పీకర్‌గానూ ఇక్కడి కళాశాలల్లో, ఈవెంట్స్‌లో ప్రసంగించాను. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేశాను. అప్పుడు ఇక్కడ జరిగిన అభివృద్ధిని గమనించాను.
ఆడపిల్లలకు ‘దిశ’తో సంపూర్ణ రక్షణ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆడపిల్లలపై ఎన్నో రకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిశ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో చట్టం తీసుకురావడం మంచి పరిణామం. అపూర్వమైన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం...అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ దిశ యాప్‌ను రూపొందించడం ఇవన్నీ స్వాగతించదగ్గ మార్పులు.
నవరత్నాలు.. మెరుపులు
అమ్మ ఒడి పథకం వచ్చిన తర్వాత పేదపిల్లలు చదువుకోవడం నేను గమనించాను. కేవలం పిల్లల్ని స్కూల్‌కి వచ్చేలా చేస్తే సరిపోదు. అందుకే నాడు నేడు ద్వారా స్కూల్స్‌ని కూడా అభివద్ధి చేయడం కూడా దానికి అనుబంధమైన అవసరమైన ఆలోచన. ఈ పథకం విజయం గమనించిన తర్వాత మహిళల స్వయం ఉపాధి, చేయూత వంటి పధకాలు నాకు బాగా నచ్చాయి.
ఇటీవల సీఎం వైఎస్ జగన్‌ని కలిసినప్పుడు ఆయన మాతో సంభాషించిన తీరు ఎంత చెప్పినా సరిపోదు. ఆయన్ను కలవడం నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. ము ఖ్యంగా ఆయన నవ్వు..ఓ వెపన్ అని చెప్పాలి. మనం ఏ స్థాయికి చేరుకున్నా, ఎదుటివారిని చూసి అభిమానంగా నవ్వగలిగితే అదే వారికి మనం ఇచ్చే అందమైన బహుమతి.
అలాగే కాన్ఫిడెన్స్, ఫైటింగ్ డెడికేషన్, డైనమిజమ్ వంటివన్నీ క్రీడాకారుల్లో కనిపించే లక్షణా లు. అవన్నీ ఆయనలో నాకు కనిపించాయి. క్రీడలు, మహిళల ఉపాధి వంటి విషయాల్లో నా అవసరం ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధం.
Comments
Please login to add a commentAdd a comment