సాక్షి, విశాఖపట్నం: ఆడుదాం ఆంధ్ర పేరుతో విశాఖపట్నంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. విశాఖ వెస్ట్, నార్త్ నియోజక సమన్వయకర్తలు ఆడారి ఆనంద్, కేకే రాజు అధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఎన్ఏడీ నుంచి డీఎల్బీ గ్రౌండ్ వరకు భారీ బైక్ ర్యాలీ కొనసాగింది. బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ విచ్చేశారు.
ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ.. ఆడుదాం ఆంధ్ర అద్భుతమైన కార్యక్రమం. ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాన్ని దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్రీడలను ప్రొత్సహించేందుకు అద్భుతమైన కార్యక్రమం తీసుకువచ్చారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ బయటపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మంచి క్రీడాకారులకు మంచి ప్లాట్‌ఫామ్‌ను సీఎం జగన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల ప్రతిభ బయటకు వస్తుంది. దీంతో, క్రీడాకారులను గుర్తించడమే కాకుండా వారికి కావాల్సిన ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. సరైన అవకాశాలు లేక క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ మరుగున పడిపోతోంది. ఆడుదాం ఆంధ్ర ద్వారామట్టిలో మాణిక్యాలను వెతికి తీయవచ్చు’ అంటూ కామెంట్స్ చేశారు.
( ఫైల్ ఫోటో )
మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. క్రీడలకు రాజకీయాలను ముడి పెట్టవద్దు. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెతికి తీయడం కోసమే ఆడుదాం ఆంధ్ర. ఓటు హక్కు లేని వారు కూడా ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో పాల్గొంటున్నారు. నాడు-నేడు ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు సీఎం జగన్ మేలు చేస్తున్నారు. మీరందరికి ఓట్లు లేవన్న సంగతి ప్రతిపక్షాలు గుర్తుపెట్టుకోవాలి అని అన్నారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల విజేతలకు ప్రభుత్వం భారీగా నగదు బహుమతులు ప్రకటించింది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలను నిర్వహించనుంది. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలను సర్టిఫికెట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది. క్రీడా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 15ఏళ్లు పైబడిన వయస్కులు (మెన్, ఉమెన్) అందరూ పోటీల్లో భాగస్వాములయ్యేలా ‘ఓపెన్ మీట్’ను చేపడుతున్నది. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఐదు క్రీడా విభాగాలైన.. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది. మరోవైపు ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను ఏర్పాటు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment