జిల్లా పరిశ్రమల కేంద్రాలకు కొత్త రూపు
♦ నూతన భవనాలు, మౌలికసౌకర్యాలకు నిధులు
♦ పరిశ్రమల శాఖ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా భారీ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: నూతన పారిశ్రామిక విధానంతో కేవలం పది నెలల కాలంలో రూ.30వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన పరిశ్రమల శాఖ.. సంస్థాగతంగా పనితీరును మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించింది. జిల్లా స్థాయి నుంచి పరిశ్రమల శాఖ కార్యాలయాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. కార్యాలయాల్లో మంచి పరిసరాలు, పనివాతావరణం ఉంటేనే పెట్టుబడులను ఆకర్షించడం మరింత సులభమవుతుందని పరిశ్రమల శాఖ భావిస్తోంది. జిల్లాల్లోని పారిశ్రామిక కేంద్రాలను (డీఐసీలు) సుమారు 25ఏళ్ల క్రితం నిర్మించారు. ఆ తర్వాత వాటి నిర్వహణపై దృష్టి సారించక, మరమ్మతులు లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి.
వరంగల్ జిల్లా పారిశ్రామిక కేంద్రం శిథిలావస్థకు చేరడంతో ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతోంది. మరోవైపు హైదరాబాద్‌లోని వాణిజ్య, పరిశ్రమల శాఖ కమిషనర్ కార్యాలయం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఇది వారసత్వ (హెరిటేజ్) భవనం కావడంతో దానిని పునరుద్ధరించి, వాడుకలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిషనర్ కార్యాలయాన్ని పునరుద్ధరించేందుకు రూ.6.78 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
జిల్లా స్థాయిలో డీఐసీలకు కొత్త రూపు ఇచ్చేందుకు రూ.5 కోట్లు, కమిషనరేట్ భవనం మరమ్మతులకు రూ.3.75 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు కేంద్ర కార్యాలయంతో పాటు జిల్లా పరిశ్రమల కేంద్రాల్లో ఫర్నీచర్, కంప్యూటర్లు తదితరాలకు కాలం చెల్లినా... వాటినే వినియోగిస్తున్నారు. దీంతో కమిషనరేట్, డీఐసీల్లో నూతన ఫర్నీచర్, కంప్యూటర్లు ఇతర సామగ్రిని సమకూర్చడంతోపాటు, కార్యాలయాలకు ఆధునిక హంగులు అద్దాలని నిర్ణయించారు. అలాగే అన్ని కార్యాలయాల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ప్రచారానికి రూ.50 కోట్లు!
రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో అందుబాటులో ఉన్న మౌలిక సౌకర్యాలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, రోడ్‌షోల ద్వారా పారిశ్రామిక రంగంలో రాష్ట్ర శక్తి సామర్థ్యాలకు ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించారు. పారిశ్రామిక ప్రదర్శనల్లో పాల్గొనడం, బ్రోచర్లు, కరపత్రాల ముద్రణ, ఫిల్మ్‌లు, అడ్వర్టయిజ్‌మెంట్లు ద్వారా.. పరిశ్రమల శాఖ బ్రాండ్ ఇమేజీని పెంచి.. పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ఇవ్వాలని పరిశ్రమల శాఖ భావిస్తోంది. దీనికోసం రూ.50 కోట్ల మేర వెచ్చించనున్నారని తెలుస్తోంది. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగవంతమవుతుందని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది.