దొరికితేనే దొంగలు.. | ration rice sent to black market | Sakshi
Sakshi News home page

దొరికితేనే దొంగలు..

Published Mon, May 19 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM

ration rice sent to black market

ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: ప్రజాపంపిణీపై పర్యవేక్షణ కొరవడింది. పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మార్కెట్లో యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. డీలర్ల నుంచి అక్రమార్కులు కేజీ రూ.10 కొని వాటిని రీ సైక్లింగ్ చేసి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. దీంతో వేల టన్నుల బియ్యం నల్లబజారుకు తరలిపోతున్నాయి. రేషన్ డీలర్లపై నిఘా పెట్టాల్సిన రెవెన్యూ అధికారులు మొక్కుబడి తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. రైస్ మిల్లర్లు కూడా అక్రమ నిల్వలకు పాల్పడుతున్నారు. డీలర్లు, రైస్‌మిల్లుల యజమానులు దొరికితేనే దొంగలు..లేకపోతే దొరల్లా తిరుగుతున్నారు.
 
జిల్లాలో 2,085 చౌకధరల దుకాణాలుండగా 8,90,507 రేషన్‌కార్డులున్నా యి. వాటిలో 6,73,999 తెల్లకార్డులు, 52,140 అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణ కార్డులు వెయ్యివరకు ఉన్నాయి.

ప్రతినెలా పది వేల టన్నుల బియ్యం సరఫరా అవుతుంటాయి. కిలో రూపాయికే ఇస్తున్న ఈ బియ్యాన్ని డీలర్లు కిలో పది రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.  

 పర్యవేక్షించాల్సిందిలా...
 ప్రతినెలా డీలర్లు డీడీలు చెల్లించిన అనంతరం ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్‌షాపులకు లారీల ద్వారా బియ్యం సరఫరా చేస్తుంటారు. సరుకులు తీసుకెళ్లే లారీ వెంట రూట్ ఆఫీసర్ ఉండాలి. షాపులో సరుకు దించిన వెంటనే స్టాక్ రిజిస్టర్‌లో సంతకం చేయాలి. బియ్యం పక్కదారి పట్టకుండా రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిఘా పెట్టాలి. అవసరమైతే తనిఖీలు చేయాలి. స్టాక్‌బోర్డు సక్రమంగా నిర్వహిస్తోందీ లేనిదీ చూడాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే 6ఏ కేసులు నమోదు చేసి డీలర్లపై చర్యలు తీసుకోవాలి.

 జరుగుతోందిలా...
 రెవెన్యూ అధికారులు మొక్కుబడి తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఒక్కో రేషన్‌డీలరు నెలకు రూ.700 చొప్పున మండలంలో ఎంతమంది డీలర్లుంటే అంతమందీ వసూలు చేసి తహసీల్దార్ కార్యాలయానికి పంపిస్తుంటారన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా తనిఖీలు మొక్కుబడిగా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.

 ఇటీవల మేల్కొన్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు బియ్యం మాఫియాపై నిఘా పెట్టింది. ఒక్క మార్చి నెలలోనే టన్నులకొద్దీ బియ్యాన్ని స్వాధీనం చేసుకుందంటే డీలర్లు ఎంత అవినీతికి పాల్పడుతున్నారో తేటతెల్లమవుతోంది.

కంభం పట్టణంలో మార్చి 5న ఒక ఆటోలో తరలిస్తున్న ప్రజాపంపిణీ బియ్యాన్ని స్థానికంగా ఉన్న ఒక పార్టీ నాయకులు చూసి పట్టుకున్నారు. ఇవి మధ్యాహ్న భోజన పథకం బియ్యం అని ఆటోడ్రైవర్ తెలపడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

 మార్చి 17న సంతమాగులూరు మండలం ఏల్చూరు పరిసర ప్రాంతమైన కొండ మలుపుల్లో దాడులు చేసి 300 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

పర్చూరులో మార్చి 14న రేషన్‌షాపులపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహించిన దాడుల్లో స్థానిక 49వ వార్డులో ఉన్న షాపులో రికార్డులు సక్రమంగాలేవని తేలింది. డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేశారు.  

ఏప్రిల్ 21న గుడ్లూరులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 54 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు. అదే నెలలో మార్టూరులోని ధాన్యం మిల్లుల్లో అక్రమ నిల్వల్ని కనుగొన్నారు. సరుకు వివరాలు లేనందున రూ.14 లక్షల విలువ చేసే 200 క్వింటాళ్ల ధాన్యం, 300 క్వింటాళ్ల బియ్యం, 100 క్వింటాళ్ల నూకలను సీజ్ చేశారు. అదేవిధంగా ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు సమీపంలో ఉన్న లక్ష్మీ నరసింహ రైస్‌మిల్లుపై దాడిచేసి 3,590 బస్తాల ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

చీరాల ప్రాంతంలో కూడా పేదల బియ్యానికి రెక్కలొచ్చాయి. అనేకసార్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడుల్లో పలువురు బియ్యం మాఫియాదారులు దొరికిపోయిన సందర్భాలున్నాయి.

ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు బుద్ధిపుట్టినప్పుడు తనిఖీలు చేస్తేనే ఇలా టన్నుల కొద్దీ బియ్యం పట్టుబడుతున్నాయి. ఈ లెక్కన ఏడాదంతా ప్రజా పంపిణీ బియ్యాన్ని నిరంతరం డీలర్లు నల్లబజారుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారో స్పష్టమవుతుంది.

 ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పేదల బియ్యం పక్కదారి పట్టకుండా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement