కల్తీ గోధుమ పిండి-సుద్ద బెల్లం
కందిపప్పులో బఠాణీలు కార్డుదారుల ఆగ్రహం
పెనమలూరు సుద్ద బెల్లం..తవుడు కలిసిన గోధుమ పిండి..కందిపప్పులో బఠాణీలు ఇవీ సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకులు. సరుకులు నాసిరకంగా ఉండడంతో పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డుదారులకు ఆరు రకాల సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. మండలంలో మొత్తం 30వేల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. క్రిస్మస్ సందర్భంగా సుమారు ఐదుల కార్డుదారులకు క్రిస్మస్ కానుక అందజేశారు. ప్రస్తుతం వాటిని మినహాయించి మిగిలిన 25 వేల కార్డుదారులకు సరుకులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మండలంలోని 53 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేయనున్నారు. ప్రతీ తెల్లరేషన్ కార్డుదారుకు ఆరు రకాల సరుకులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో బెల్లం, కందిపప్పు, శెనగపప్పు అరకిలో చొప్పున, నెయ్యి వంద గ్రాములు, గోధుమ పిండి కిలో, అరలీటరు పామాయిల్ ఉన్నాయి. ఈ సరుకులను గురువారం నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేశారు. సరుకులు తీసుకున్న లబ్ధిదారులు వాటిని చూసి తెల్లమొఖం వేశారు. బెల్లం నల్లగా, సుద్దగా ఉంది. ఇక కందిపప్పులో బఠాణీ గింజలు కలసి నాసిరకంగా ఉంది. గోధుమ పిండి జల్లడపడితే తవుడు బయట పడింది. ఇక మిగితా సరుకులు అంతంతమాత్రంగా ఉన్నాయి. కార్డుదారులు పెదవి విరుస్తున్నారు.
పేదలంటే అలుసా..?
చంద్రన్న కానుక కింద ఇచ్చిన సరుకులు కల్తీ, నాసిరకంగా ఉన్నాయని, వీటిని చంద్రబాబు తిని చూపితే తాము తింటామని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల సొమ్ముతో అవినీతికి పాల్పడి ఇటువంటి సరుకులు పండుగకు ఇవ్వటం న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ సరుకులు తీసుకుని పండుగకు ఏ వంటకాలు చేసుకోవాలని వాపోతున్నారు. రేష్‌షాపుల్లో నాణ్యమైన సరుకులు ఇస్తారని ఎంతగానో ఆశపడ్డామని తీరా సరుకులు తీసుకెళ్లిన తర్వాత నిరాశేమిగిలిందని తెలిపారు.
కొత్త కార్డులకు అందేనా?
జన్మభూమి సభల్లో పంపిణీ చేస్తున్న తెల్లరేషన్‌కార్డులకు చంద్రన్న కానుక సరుకులు అందుతాయో లేదో తెలియన లబ్ధిదారులు అయోమయంలో ఉన్నాయి. మండలంలో కొత్తగా సుమారు 2,500 కార్డులు పంపిణీ చేశారు. వీరికి కూడా సరుకులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడంతో వారిలో ఆశలు చిగురించాయి. అయితే గురువారం నుంచి పంపిణీ ప్రారంభించిన డీలర్లు కొత్తకార్డులకు సరుకులు ఇవ్వడం లేదు. రెండురోజుల తర్వాత ఇస్తారని భావిస్తున్నారు.
ఇదేమి బెల్లం
రేషన్ షాపుల్లో చంద్రన్న కానుక కింద ఇచ్చిన బెల్లం దారుణంగా ఉంది. ఈ బెల్లం తింటే జబ్బులు వచ్చి మంచాన పడతాము. బెల్లం నల్లగా ఉండి కారిపోతుంది. పండుగకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి.
కె.పంచాద్రీయరావు, యనమలకుదురు
కందిపప్పులో బఠాణీలు
కందిపప్పులో బఠాణీ గింజలు కలిపారు. పైగా పప్పు మందంగా ఉంది. దీనిని వండుకోవటం వలన ఉపయోగంలేదు. పండుగకు నాసిరకం సరుకులు ఇవ్వటం తగదు. నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలి.
ఎం.నిర్మల, యనమలకుదురు
గోధుమ పిండి పనికిరాదు
గోధుమ పిండిలో తవుడు కలిపారు. ఈ పిండి తో ఏమి చేయాలో తెలియటంలేదు. ఈ పిండితో చేసిన వంటకాలు తింటే ఇబ్బందే. పండుగకు నాసిరకం సరుకులు ఇవ్వటం తగదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మంచి సరుకులు ఇవ్వాలి.
చల్లా జయలక్ష్మి, యనమలకుదురు
చంద్రన్న...ఇవేమి కానుకలన్నా..
Published Fri, Jan 8 2016 12:19 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement