ఎవరితోనూ పన్లేదు.. నాకు ఇస్తే చాలు! | Hurt anyone .. I must be! | Sakshi
Sakshi News home page

ఎవరితోనూ పన్లేదు.. నాకు ఇస్తే చాలు!

Published Sun, Feb 2 2014 1:14 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

ఎవరితోనూ పన్లేదు.. నాకు ఇస్తే చాలు! - Sakshi

ఎవరితోనూ పన్లేదు.. నాకు ఇస్తే చాలు!

  • డివిజనల్ అధికారి అడ్డగోలు దోపిడీ
  •  కుదిరితే చేతికి.. లేకుంటే బ్యాంకులో
  •  చేపల చెరువుల అనుమతులపైనే గురి    
  •  కింది ఉద్యోగులతో వసూళ్ల దందా
  •   నిన్న మచిలీపట్నంలో.. నేడు గుడివాడలో.. డివిజనల్ స్థాయి అధికారుల అవినీతి లీలలు గుప్పుమంటున్నాయి. ‘సార్ ఎక్కడికి వెళ్లారు’ అనడిగితే చాలు.. ‘చేపల చెరువులు చూడటానికి’.. కార్యాలయంలో సిబ్బంది ఠక్కున చెప్పే సమాధానం ఇది. ‘పాలనా పరమైన పనులు తర్వాత చూడొచ్చు.. చేపల చెరువుల అనుమతుల ఫైళ్లు ఉంటే వెంటనే పూర్తిచేసి పంపండి’ అనే ఆదేశాలు అన్ని మండలాల్లో ఉన్న తహశీల్దార్‌లకు పంపారు. ఎన్నికలు వస్తే మనకు అనుకూల పార్టీ వస్తుందో, రాదో.. ఇప్పుడే రాబట్టుకోవాలని ఆయన గారు సెలవివ్వటంపై కార్యాలయ సిబ్బంది కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.
     
    గుడివాడ, న్యూస్‌లైన్ : డివిజన్ పరిధిలోని దాదాపు 9 మండలాల్లో 10 వేల ఎకరాలు చేపల చెరువులుగా తవ్వుకునేందుకు అనుమతుల కోసం రైతులు దరఖాస్తులు సమర్పించారు. డిసెంబర్ 31న జరిగిన డివిజనల్ స్థాయి సమావేశంలో రెండువేల ఎకరాల వరకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటివరకు చేపల చెరువుల అనుమతి కావాలంటే మండలం నుంచి వచ్చిన ఫైలును కార్యాలయంలో సంబంధిత డిప్యూటీ తహశీల్దార్ చూసి నోట్‌ఫైల్ తయారుచేసిన తరువాత కార్యాలయ ప్రధానాధికారి సంతకం చేశాకే ఈ అధికారి సంతకం చేయాల్సి ఉంది.

    ఈ కార్యాలయంలో చేపల చెరువుల అనుమతికి గాను అందరికీ కలిపి ఎకరానికి రూ.2 వేలు సమర్పించుకుంటారని సమాచారం. దీన్ని వారి వారి స్థాయిలను బట్టి పంచుకుంటారు. ఇది గమనించిన ఈ అధికారి వీరందరితో ఎందుకు పని అని నేరుగా తానే చేపల చెరువుల ఫైలు తీసుకుని సంతకాలు చేయటం ప్రారంభించారు. అందరి వాటాలు తనకే వస్తాయని మాస్టర్‌ప్లాన్ వేసి, ఈ తతంగం నడిపేందుకు తన వద్ద ఉండే ఇద్దరు కిందిస్థాయి ఉద్యోగులను పురమాయించారు.

    వచ్చిన రైతుల వద్ద నేరుగా బేరం మాట్లాడుకోవటం, డబ్బు తీసుకోవటం, సంతకాలు పెట్టి జిల్లా సమావేశంలో అనుమతులు వచ్చేలా చేయటం ఈ పని చాలా ఈజీగా ఉందని కొందరి వద్ద నేరుగా ‘సార్’ చెప్పటం ఇందుకు ఉదాహరణ. ఇటీవల గుడివాడ రూరల్ మండలంలో అనుమతించిన చేపల చెరువుకు సంబంధించి ఆయన వాటాను సార్ బంధువులకు చెందిన గుంటూరు ఎస్‌బీఐ ఖాతాలో వేయించారని సమాచారం.
     
    లక్షలు పోసి వచ్చా.. సంపాదించుకోవాలిగా?
     
    గతంలో తాను పనిచేసినచోట పేదలకు అందాల్సిన తెల్లరేషన్ కార్డుల కూపన్లు అమ్ముకుని రూ.16 లక్షలకు పైగా అవినీతికి పాల్పడినట్లు సమాచారం. దీనిపై  విచారణ ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది. ‘లక్షలు పోసి ఇక్కడికి వచ్చా.. సంపాదించుకోవాలిగా?’ అని చెబుతుండటం కొసమెరుపు. ఎన్నికలు వచ్చాక మనల్ని తెచ్చిన నాయకుడు గెలవకపోతే మళ్లీ ఇక్కడ ఉండబోమనే భావనతోనే ఇలా వసూళ్ల దందాకు తెరలేపారని తెలుస్తోంది. అందుకే ఇప్పటివరకు ఏ అధికారీ చేయనివిధంగా నేరుగా వసూళ్లకు శ్రీకారం చుట్టారని వినికిడి.
     
    కొల్లేరును ప్యాకేజీలుగా అమ్మేశారు...
     
    పర్యావరణాన్ని కాపాడేందుకు కొల్లేరులో చేపల చెరువులు ధ్వంసం చేసిన విషయం విదితమే. ఆ తరువాత వచ్చిన ఏ అధికారీ కొల్లేరు జోలికి పోలేదు. కానీ ఈ అధికారి వచ్చాక కొల్లేరులో చేపల చెరువుల తవ్వకానికి ప్యాకేజీల లెక్కన అనుమతులు ఇచ్చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండవల్లి మండలంలోని నందిగామ లంక, మణుగూరు లంకలో కొల్లేరును చేపల చెరువులుగా మార్చేశారు. మణుగూరు లంకలో చేపల చెరువుల తవ్వకాలపై ఫిర్యాదులు రావటంతో అప్పటి జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకున్నారని, దీంతో తవ్వకాలు ఆగాయని కార్యాలయంలో పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ అధికారి చెబుతున్నారు.
     
    టైటిల్ డీడ్‌లు.. ధృవీకరణ పత్రాల్లోనూ చేతివాటమే...
     
    టైటిల్ డీడ్‌లు.. ధృవీకరణ పత్రాల కోసం కార్యాలయానికి వచ్చే వారితో సార్ సిబ్బంది ముందుగానే ఎంత ఖర్చు అవుతుందో మాట్లాడుకుని లోపలికి పంపిస్తారని సమాచారం. సంబంధిత ఫైళ్లను కిందిస్థాయి సిబ్బందిగా ఉన్న వీరిద్దరూ పెడితేనే సార్ సంతకం చేస్తారని కార్యాలయంలోని సిబ్బంది అంతా బహిరంగంగానే చెబుతున్నారు. గతంలో పనిచేసిన ఏ అధికారీ రైతులకు ఇవ్వాల్సిన టైటిల్ డీడ్, జనన, మరణ ధృవీకరణ పత్రాలకు లంచాలు తీసుకున్న దాఖలాలు లేవని అంటున్నారు.
     
    కార్యాలయ సిబ్బందిలో ఆందోళన...
     
    అయ్యగారి తీరుతో కార్యాలయ సిబ్బందిలో ఆందోళన రేకెత్తుతోంది. దశాబ్దాల తరబడి ఉద్యోగాలు చేస్తున్న తమకు లేని ప్రాధాన్యత కిందిస్థాయి ఉద్యోగులకు వచ్చిందని చెబుతున్నారు. డివిజన్‌లో ఎన్ని వేల ఎకరాలకు చేపల చెరువుల అనుమతి వచ్చిందని కార్యాలయ ప్రధానాధికారిని అడిగితే నాకు తెలియదు. సార్‌నే అడగాలని సమాధానం చెప్పటం ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. డిప్యూటీ తహశీల్దార్‌లు, క్లర్కులతో సంబంధం లేకుండా నేరుగా ఫైళ్లు నడిచిపోవటంతో కార్యాలయంలోని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ అధికారి అవినీతి లీలలపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement