Fish ponds
-
చేపల చెరువులకు అనుమతి తప్పనిసరి
సాక్షి, అమరావతి: అనుమతులు తీసుకోకుండా చేపల చెరువులు తవ్వడం చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో చట్టం తెలియదని తప్పించుకోవడం కుదరదని పేర్కొంది. అనుమతి లేకుండా చేపల చెరువులు తవ్వేవారిపై ఏపీ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు తీసుకోవచ్చని చెప్పింది. ప్రస్తుత కేసులో కోర్టు ఆదేశాల మేరకు చేపల చెరువుల తవ్వకాలను నిలిపేసిన వ్యక్తులు అనుమతి తీసుకోకుండా తవ్వకాలను కొనసాగిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆ వ్యక్తులు తమ భూముల్లో చేపల చెరువు తవ్వుకోవాలనుకుంటే చట్టప్రకారం సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు ఇటీవల తీర్పు చెప్పారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలోని పలు సర్వే నంబర్లలో శివకోటి గోవిందు, మరో ఆరుగురు చట్టప్రకారం అనుమతులు తీసుకోకుండా చేపల చెరువులు తవ్వుతున్నారని, ఈ తవ్వకాలను అడ్డుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ శ్రీగాయత్రి హౌసింగ్ మేనేజింగ్ పార్ట్నర్ పుల్లా ప్రభాకరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ గంగారావు విచారించారు. పిటిషనర్ న్యాయవాది ఎన్.శివారెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ 7.80 ఎకరాల్లో చట్టప్రకారం అనుమతులు తీసుకుని లేఅవుట్ వేసి 53 ప్లాట్లు చేశారని తెలిపారు. ఈ లేఅవుట్ చుట్టూ శివకోటి గోవిందు మరికొందరు చట్ట విరుద్ధంగా చేపల చెరువులు తవ్వుతున్నారని, దీనివల్ల తమ ప్లాట్లలోకి నీళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. నీరు కలుషితమై మంచినీరు లభించే పరిస్థితి ఉండదన్నారు. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రతివాదుల న్యాయవాది కె.అన్నపూర్ణ వాదనలు వినిపిస్తూ.. పక్కన ఉన్న చేపల చెరువుల నీరు తమ భూముల్లోకి వస్తుండటంతో పంట పండే అవకాశం లేదని చెప్పారు. చేపల చెరువులు తవ్వుకునేందుకు అనుమతులు తీసుకోవాలని తమకు తెలియదన్నారు. అనుమతులు తీసుకోవాలని కోర్టు ద్వారా తెలుసుకున్న తరువాత అనుమతుల కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని, వారు తమ దరఖాస్తులను స్వీకరించడం లేదని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ తీర్పు చెప్పారు. -
జువ్వలపాలెం.. రణరంగం
కాళ్ల: కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామం రణరంగాన్ని తలపించింది. గ్రామంలో నివాసాలకు ఆనుకుని చెరువు తవ్వకానికి వీలులేదంటూ స్థానికులు, సీపీఎం నాయకులు అడ్డుకునేందుకు బుధవారం ప్రయత్నించారు. అప్పటికే మోహరించిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీస్స్టేషన్లకు తరలించారు. ఉదయం నుంచి నరసాపురం డివిజన్ స్థాయిలోని సీఐలు, ఎస్సైలు, సిబ్బంది, ప్రత్యేక విభాగాల పోలీసులు భారీగా మోహరించారు. కొందరు సీపీఎం నాయకులను ముందస్తుగా హౌ స్ అరెస్ట్‌లు చేసినట్టు తెలిసింది. విడతలవారీగా స్థానికులు, సీపీఎం నాయకులు చెరువుల వద్దకు చేరుకున్నారు. వీరికి పోలీసులు ఎదురుగా రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీపీఎం నాయకుడు జేఎన్వీ గోపాలన్ స్థానికులతో వచ్చి చెరువు తవ్వకం నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. కోర్డు ఆదేశాల మేరకు చెరువు తవ్వకం అడ్డుకోవడం నేరమని న్యాయబద్ధంగా నడుచుకోవాలని రూరల్ సీఐ నాగరాజు ఉద్యమకారులతో చర్చిం చారు. అయినా స్థానికులు వీటిని పట్టిం చుకోకుండా నినాదాలు చేయడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేం దుకు వారిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. ఈతరుణంలో జరిగిన తోపులాటలో ఓమహిళకు చేతికి గాయాలు కాగా మరో మహిళ స్పృహతప్పి పడిపోయింది. ఆందోళనకారులను పోలీసులు డివిజన్ స్థాయిలోని పలు పోలీస్స్టేషన్లకు తరలించారు. ఐద్వా నాయకురాలు క ల్యాణి, సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి నరసాపురం డీఎస్పీ ప్రభాకర్‌బాబు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కోర్టు ఆదేశాలను పరి శీలించారు. అనంతరం సీఐ నాగరాజు స్థానికులతో చర్చిం చారు. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని కోరారు. సా యంత్రం వరకు పోలీసుల మోహరింపు కొనసాగింది. సీపీఎం నాయకుల అరెస్ట్ దారుణం చెరువు తవ్వకం అడ్డుకోవడానికి వెళ్లిన సీపీఎం నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌లు చేయడం దారుణ మని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. స్థానికులు, సీపీఎం నాయకులపై లాఠీచార్జి చేయడం దారుణమని ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. బ డుగు, బలహీనవర్గాల వారి కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇంతలా ఆందోళన చేస్తున్నా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆక్వా మాఫియా పెచ్చుమీరిందని, ఆక్రమణ చెరువులను నియంత్రించడంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందారని విమర్శించారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
సమీకృత సేంద్రియ సేద్య పతాక.. తిలగర్!
సముద్ర తీర ప్రాంతాల్లో రైతులకు తమిళనాడుకు చెందిన వృద్ధ రైతు తిలగర్ (60) ఆచరిస్తున్న సమీకృత సేంద్రియ సేద్య పద్ధతి రైతాంగానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది. తిలగర్ నాగపట్టినం జిల్లా సిర్కజి తాలూకా కొడంకుడిలో తనకున్న ఎకరం పావు పొలంలో దశాబ్దాలుగా రసాయనిక పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నా.. పెద్దగా నికరాదాయాన్ని కళ్ల జూసిన సందర్భాల్లేవు. బోరు నీటి ఆధారంగానే సేద్యం చేస్తున్న తిలగర్ ఈ నేపథ్యంలో.. సమీకృత సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టారు. వరుసగా మూడేళ్లు కరువు వచ్చినా మెరుగైన నికరాదాయాన్ని పొందుతున్నారు. సేంద్రియ వ్యవసాయోద్యమకారుడు దివంగత నమ్మాళ్వార్ చూపిన బాటలో మూడేళ్ల క్రితం నుంచి సేంద్రియ పద్ధతిని అనుసరిస్తున్నారు. వ్యవసాయ పనులన్నీ తిలగర్ కుటుంబ సభ్యులే చేసుకుంటారు. చెరువు.. కోళ్ల షెడ్డు.. వరి పొలం.. పావెకరంలో చెరువు తవ్వారు. అది చేపల చెరువు మాత్రమే కాదు, పక్కనే ఉన్న ఎకరం వరి పొలానికి నీరందించే నీటి కుంట కూడా. చెరువులో పూరి పాకను నిర్మించి, చుట్టూ ఇనుప మెష్ ఏర్పాటు చేసి కోళ్ల ఫామ్‌గా మార్చారు. ఆ కోళ్ల పెంట నేరుగా చెరువు నీటిలోకి పడుతుంది. చెరువు నీటిలో బొచ్చె, బంగారుతీగ వంటి 3 రకాలకు చెందిన వెయ్యి మంచినీటి కార్పు చేప పిల్లలను వదులుతుంటారు. కోళ్ల పెంట వల్ల చెరువు నీటికి చేపలకు అవసరమైన ప్లవకాలను ప్రకృతిసిద్ధంగా అందుబాటులోకి తెస్తున్నాయి. దీనికి తోడు అడపా దడపా పంచగవ్యను చల్లుతూ ఉంటారు. కాబట్టి, చేపల కోసం ప్రత్యేకంగా మేత అంటూ ఏమీ వేయడం లేదు. 2016లో సేకరించిన గణాంకాల ప్రకారం.. వెయ్యి చేపపిల్లలను వదిలిన 8 నెలల్లో 600 కిలోల చేపల దిగుబడి వచ్చింది. తిలగర్ ప్రత్యేకత ఏమిటంటే.. చేపలను సజీవంగా తన చెరువు వద్దనే నేరుగా వినియోగదారులకు అమ్ముతూ ఉంటారు. కిలో రూ. 150 చొప్పున.. రూ. 90 వేల ఆదాయం పొందుతున్నారు. చేపల చెరువు నీటితో వరి సాగు చేపల చెరువులోని నీటిని పక్కనే ఉన్న వరి పొలానికి పారిస్తున్నారు. వరి పొలానికి పంచగవ్య తప్ప మరేమీ ఎరువు వేయటం లేదు. ఎకరానికి 40 బస్తాల వరకు ధాన్యం దిగుబడి పొందుతున్నారు. తిలగర్ తన పొలం వద్దనే దేశీ ఆవుతోపాటు మేకలు, బాతులను పెంచుతున్నారు. గట్ల మీద కొబ్బరి, మామిడి, జామ చెట్లను పెంచుతూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. వ్యవసాయం, పశుపోషణ పరస్పర ఆధారితమైనవి కావడంతో వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడు.. సమీకృత సేంద్రియ సేద్యం ప్రధానంగా చిన్న కమతాలుండి సొంత రెక్కల కష్టంపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకునే చిన్న, సన్నకారు రైతులకు ఆహార, ఆదాయ భద్రత లభిస్తుందనడంలో సందేహం లేదు. సేంద్రియ సర్టిఫికేషన్ ఇవ్వబోతున్నాం జిల్లా కలెక్టర్ పళనిస్వామి స్వయంగా తిలగర్ క్షేత్రాన్ని సందర్శించి అభినందించడంతోపాటు ఉత్తమ రైతు పురస్కారంతో సత్కరించారు. ఇతర రైతులను సైతం సమీకృత సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కృషి చేయమని అధికారులను ఆదేశించారు. తిలగర్ వ్యవసాయోత్పత్తులకు పీజీఎస్–ఇండియా కింద సేంద్రియ సర్టిఫికేషన్‌ను అందించబోతున్నాం. – ఆర్. రవిచంద్రన్ (094440 63174, 095007 82105)మత్స్య శాఖ సహాయ సంచాలకుడు,నాగపట్టినం, తమిళనాడు -
అధికారమే అండగా..
ఏలూరు : అధికారమే అండగా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూమిలో చేపల చెరువులు తవ్వడమే కాకుండా.. రెండు గ్రామాల మధ్య చిచ్చుపెట్టారు. ఓ గ్రామానికి చెందిన దళితులు పనులను అడ్డుకోవడంతో కొల్లేరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు మండలం కోమటిలంక పరిధిలో సుమారు 110 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. గతంలో ఆ భూమిలో గ్రామ ప్రజలు ఉమ్మడిగా చేపలు పెంచుకుంటూ ఆదాయం పొందేవారు. కొల్లేరు ప్రక్షాళన సందర్భంగా అధికారులు ఈ చెరువులను ధ్వంసం చేశారు. అప్పటినుంచి ఆ భూమి ఖాళీగా ఉంటోంది. 2014 ఎన్నికల తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు దీనిపై కన్నేశారు. కోమటిలంక పెద్దలకు నచ్చజెప్పి ఈ ఏడాది మే నెలలో సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువులు తవ్వారు. ఇందుకు ప్రతిఫలంగా ఆ గ్రామ ప్రజలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. అనంతరం ఆ చెరువులను సాగు చేసుకోవడం కోసం శ్రీపర్రు గ్రామస్తులను ఉసిగొల్పారు. కోమటిలంక గ్రామ ప్రజలకు పట్టాలు ఇవ్వకుండానే మిగిలిన 40 ఎకరాల్లో చెరువు తవ్వడానికి ఎమ్మెల్యే సోదరుడు, తెలుగుదేశం పార్టీ మండల శాఖ నాయకుడు, గ్రామంలోని టీడీపీ నేతలు పనులు ప్రారంభించారు. తమకు న్యాయం చేయకపోగా చెరువులు తవ్వుకుని వేరేవారికి లీజుకు ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో కోమటిలంక దళితులంతా ఏకమయ్యారు. ఆ భూములను సాగు నిమిత్తం తమకే ఇవ్వాలని పట్టుబట్టారు. వారి డిమాండ్‌ను పట్టించుకోని టీడీపీ నేతలు పొక్లెయిన్‌తో చెరువు తవ్వకం పనులు చేపట్టారు. దీంతో ఆగ్రహించిన దళితులు సోమవారం ఆ పనులను అడ్డుకున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు వారిపైకి పోలీసులను ఉసిగొల్పారు. కేసులు పెడతామని బెదరించడంతో ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం గ్రామస్తులంతా ఏలూరు తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చి ధర్నాకు దిగారు. ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములను మండల టీడీపీ అ««దl్యక్షుడు నేతల రవి, ఎమ్మెల్యే సోదరుడు బడేటి చంటి ఆక్రమించుకుంటున్నారని, ఈ ప్రాంతంలో చేపల చెరువు తవ్వకాలను తక్షణం అడ్డుకోవాలని కోరుతూ తహసీల్దార్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. శ్రీపర్రు గ్రామస్తుల పేరుచెప్పి.. కోమటిలంక గ్రామస్తులు మద్దుల రత్తయ్య, పోసురాజు నారాయణ, పెనుగొండ జోజేశ్వరరావు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ తమ గ్రామ పరిధిలో సుమారు 110 ఎకరాల అసైన్డ్ భూమి ఉందని చెప్పారు. ఇందులో 70 ఎకరాల భూమిని శ్రీపర్రు గ్రామస్తులకు కేటాయిస్తున్నామంటూ స్థానిక ప్రజాప్రతినిధులు మే నెలలో చేపలు చెరువులు తవ్వారన్నారు. దీనికి బదులుగా ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికారన్నారు. నేటికీ పట్టాలు ఇవ్వకపోగా గ్రామ పరిధిలో ఉన్న మరో 40 ఎకరాల్లో చేపల చెరువులు తవ్వుతున్నారని వివరించారు. దీనివెనుక టీడీపీ నాయకుల కుట్ర ఉందని ఆరోపించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోమటిలంక దళితులు ఆందోళనకు దిగిన విషయాన్ని తెలుసుకున్న శ్రీపర్రు గ్రామ నాయకులు ఏలూరు వచ్చి తహసీల్దార్‌ను కలిశారు. కోమటిలంక ప్రజల అంగీకారంతోనే తాము భూమి పొందామని, స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల మేరకే సాగు చేస్తున్నామని వివరించారు. తాము ఎవరి భూమిని ఆక్రమించలేదన్నారు. -
ఆంధ్రాబ్యాంక్‌లో మరో కుంభకోణం
► చేపలు చెరువుల చూపించి రూ.3.3 కోట్లు రుణం ► చిరునామాలు దొరకని రుణగ్రహీతలు ► పోలీస్ స్టేషన్లో కేసు నమోదు గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడ ఆంధ్రాబ్యాంక్‌లో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తప్పుడు చిరునామాలు సమర్పించి అప్పు తీసుకున్నవారి చిరునామా దొరకకపోవడంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాపట్ల సమీపంలోని నల్లమోతువారిపాలేనికి చెందిన ఏడుగురు వ్యక్తులు గుడివాడ పరిసరాల్లోని చేపల చెరువులు లీజుకు తీసుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి రూ.3.33 కోట్లు రుణం పొందారు. ఆ అప్పు వడ్డీతో కలిపి రూ.4.79 కోట్లు అయ్యింది. అయితే అప్పు తీసుకున్నవారి చిరునామాలు దొరకకపోవడంతో బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. వీరంతా బందరులోని పొలాలను, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని ఆస్తులను, నల్లమోతువారిపాలెంలోని ఆస్తులను హామీగా పెట్టారు. రుణం తీసుకున్నవారిలో మడ సుబ్రమణ్యం, పిన్నబోయిన వెంకటేశ్వరరావు, నాగరాజు, పోలారయ్య, తాండ్ర జ్యోతి, అంజనీదేవి ఉన్నారని అధికారులు తెలిపారు. బ్యాంకు ఏజీఎం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రొయ్యల దొంగతనం: ముగ్గురు అరెస్ట్
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని చేపల చెరువుల్లోని రొయ్యలను రాత్రికి రాత్రే మాయం చేస్తున్న ముగ్గురు కేటుగాళ్లను నెల్లూరు సీసీఎస్, విడవలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు సీసీఎస్ డీఎస్పీ పి.శ్రీధర్ శనివారం ఇక్కడ జరిగిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. విడవలూరుకు చెందిన వెంకట శేషయ్య, నెల్లూరు శెట్టిగుంట రోడ్డుకు చెందిన పసుపులేటి గణేశ్, గుంటూరు జిల్లా గురజాల మండలానికి చెందిన చోటూరు శిరీష్ పట్టుబడిన వారిలో ఉన్నారు. వీరి నుంచి రూ.2.05 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోందని డీఎస్పీ వెల్లడించారు. -
చేపల చెరువులకు ఆన్లైన్లో అనుమతులు
ఏలూరు :జిల్లాలో చేపల చెరువులకు అనుమతులన్నీ ఆన్లైన్ ద్వారానే పారదర్శకంగా జారీ చేస్తున్నామని మత్స్యశాఖ ఇన్చార్జి డెప్యూటీ డెరైక్టర్ షేక్ లాల్ మహ్మద్ అన్నారు. ఈ విషయంలో ఏ అధికారిని స్వయంగా ఆశ్రయించనవసరం లేదని, దరఖాస్తు చేసుకున్న ఐదువారాల్లోనే ఆన్లైన్లో అనుమతులను భూ యజమానులు లేదా రైతులు పొందవచ్చునని తెలిపారు. నెలకొకసారి జిల్లా స్థాయిలో కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరుగుతుందని, 8 శాఖల అధికారులతో చర్చించి ఆన్లైన్లో జారీ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. 13 జిల్లాల్లో మొదటిసారిగా అనుమతులను ఆన్లైన్లో జారీ చేస్తున్న జిల్లా.. పశ్చిమగోదావరి ఒకటేనన్నారు. మీ సేవ కేంద్రంలోను రైతు, భూ యజమాని పట్టాదారు పుస్తకం, భూమి మ్యాప్, ఎఫ్ఎంబీ, ఆధార్‌కార్డు జిరాక్సులతో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకున్న ఐదు వారాల్లో చేపల చెరువుల తవ్వకాలకు లెసైన్స్‌లు లభిస్తాయన్నారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ, మత్స్యశాఖ, భూగర్భజలశాఖ, వ్యవసాయశాఖ, అటవీశాఖ, ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ మండలి తదితర అన్ని శాఖలు ఆయా శాఖల పరిధిలో దరఖాస్తుల పరిశీలన జరిగాక రిమార్కులు ఉంటే ఆన్లైన్లో రాస్తామన్నారు. జిల్లా స్థాయి కమిటీలో చర్చించిన అనంతరం వారంలోనే అనుమతుల జారీ జరుగుతుందన్నారు. అనుమతిచ్చిన పరిధి దాటి చెరువులు తవ్వినా గూగుల్‌లోని మ్యాప్‌ల్లో తెలుస్తుందన్నారు. దీనిపై పూర్తిస్థాయి పర్యవేక్షణకు జిల్లాలోని 15 మంది ట్యాబ్‌లను మంజూరు చేశామని త్వరలో ఇవి పనిచేస్తాయన్నారు. మీ సేవల్లో చెరువులకు అనుమతులు జారీ చేయడానికి కలెక్టర్ కె.భాస్కర్ ఆధ్వర్యంలో కసరత్తు చేశామన్నారు. ఈ విధానంలో రైతులు ఎటువంటి ఇబ్బందులకు లోనుకాకుండా సునాయాసంగా అందిస్తున్నామన్నారు. -
ఆపరేషాన్
ఏలూరు : కొల్లేరులో ప్రభుత్వ, జిరాయితీ భూముల్లో తవ్విన చేపల చెరువులను ధ్వంసం చేసేందుకు జిల్లా యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది. సుమారు 6 వేల ఎకరాల్లో అక్రమంగా చెరువులు తవ్వినట్టు గుర్తించిన అధికారులు, వాటిని ధ్వంసం చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరేం దుకు సన్నద్ధమయ్యారు. కోర్టు కేసుల నేపథ్యంలో ఇటీవల నిడమర్రులో 125 ఎకరాలకు సంబంధించిన చెరువు గట్లను ధ్వంసం చేసిన విష యం విదితమే. కొల్లేరు అభయూరణ్యం పరిధిలో గల ప్రభుత్వ, జిరాయితీ భూముల్లో ఎట్టిపరిస్థితుల్లో చేపల చెరువులు, ఆక్రమణలు ఉండరాదన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఆపరేషన్ కొల్లేరు పేరిట 2006 సంవత్సరంలో కొల్లేరులో పెద్దఎత్తున చేపల చెరువుల్ని ధ్వంసం చేశారు. ఆ తరువాత కాలంలో పాత చెరువులను మళ్లీ పున రుద్ధరించారు. గడచిన ఎనిమిదేళ్ల కాలంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 1,300 ఎకరాల ప్రభుత్వ భూముల్లోను, 4,700 ఎకరాల జిరాయితీ భూముల్లోను చెరువులు తవ్వినట్టు జిల్లా వన్యప్రాణి విభాగం అధికారులు గుర్తించారు. తాజాగా వాటిని ధ్వంసం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ‘పశ్చిమ’లోనే అధికంతంలో ధ్వంసం చేసిన చెరువుల్ని పునరుద్ధరించే కార్యక్రమం జిల్లాలోని ఏలూరు, భీమడోలు, నిడమర్రు మండ లాల్లో పెద్దఎత్తున ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పెదపాడు, దెందులూరు, ఉంగుటూరు మండలాల్లోనూ ఇలాంటి చెరువులు ఉన్నట్టు నిర్ధారించారు. మొత్తంగా జిల్లాలో 5 వేల ఎకరాల్లో చెరువులు తవ్వినట్టు తేల్చారు. కృష్ణా జిల్లా కైకలూరు మండలంలో సుమారు ఎకరాల్లో చెరువుల్ని పునరుద్ధరించినట్టు భావిస్తున్నారు. డ్రెయిన్ల మరమ్మతులకు అనుమతులు తీసుకుని పైడిచింతపాడు శివారు కొక్కిరాయిలంక గ్రామంలో 30 ఎకరాలను తవ్వారు. ఈ రీతిలోనే అన్నిచోట్లా గట్లను పెంచి బడాబాబులు కొల్లేరును కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. నిధులు కోరిన యంత్రాంగం జిల్లాలో ముందుగా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వెలిసిన 1,300 ఎకరాల్లోని చెరువులను ధ్వంసం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత 4,700 ఎకరాల జిరాయితీ భూముల్లోని చెరువులకు గండ్లు కొట్టాలనే యోచనలో ఉన్నారు. ఇందుకు అవసరమైన నిధులివ్వాలని కోరినట్టు వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో (ఎటాచ్డ్ అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) పీజే బెనర్జీ తెలిపారు. ఈ కార్యక్రమం చేపట్టడానికి లక్షలాది రూపాయలు అవసరం అవుతాయన్నారు. కొల్లేరు అభయారణ్యం భూముల్లో వ్యవసాయం తప్ప చెరువులు, ఇతర కార్యకలాపాలేవీ చేపట్టకూడదని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని ఆయన చెప్పారు. నేడు ప్రజాప్రతినిధులు, అధికారుల సమీక్ష కొల్లేరులో ఆక్రమణల తొలగింపు వ్యవహారంపై అటవీశాఖ ఉన్నతాధికారులు, జిల్లాకు చెందిన సీసీఎఫ్ డాక్టర్ శ్రీధర్, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు బుధవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. దీంతో రెండు జిల్లాల సమాచారంతో వన్యప్రాణి విభాగం అధికారులు ఇప్పటికే హైదరాబాద్ వెళ్లారు. కొల్లేరులో వాస్తవ పరిస్థితుల్ని సమీక్షించి, అభయూరణ్యం పరిధిలోని చెరువులకు గండ్లు కొట్టేందుకు నిధులిచ్చే అంశంపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వన్యప్రాణి విభాగం అధికారులు భావిస్తున్నారు. సమీక్షలో పాల్గొనేందుకు కలెక్టర్ కె.భాస్కర్, అభయూరణ్యం ఇన్చార్జి అధికారి టి.రామ్మోహనరావు సైతం మంగళవారం రాత్రి హైదరాబాద్ బయలుదేరారు. -
ఎవరితోనూ పన్లేదు.. నాకు ఇస్తే చాలు!
డివిజనల్ అధికారి అడ్డగోలు దోపిడీ కుదిరితే చేతికి.. లేకుంటే బ్యాంకులో చేపల చెరువుల అనుమతులపైనే గురి కింది ఉద్యోగులతో వసూళ్ల దందా నిన్న మచిలీపట్నంలో.. నేడు గుడివాడలో.. డివిజనల్ స్థాయి అధికారుల అవినీతి లీలలు గుప్పుమంటున్నాయి. ‘సార్ ఎక్కడికి వెళ్లారు’ అనడిగితే చాలు.. ‘చేపల చెరువులు చూడటానికి’.. కార్యాలయంలో సిబ్బంది ఠక్కున చెప్పే సమాధానం ఇది. ‘పాలనా పరమైన పనులు తర్వాత చూడొచ్చు.. చేపల చెరువుల అనుమతుల ఫైళ్లు ఉంటే వెంటనే పూర్తిచేసి పంపండి’ అనే ఆదేశాలు అన్ని మండలాల్లో ఉన్న తహశీల్దార్లకు పంపారు. ఎన్నికలు వస్తే మనకు అనుకూల పార్టీ వస్తుందో, రాదో.. ఇప్పుడే రాబట్టుకోవాలని ఆయన గారు సెలవివ్వటంపై కార్యాలయ సిబ్బంది కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. గుడివాడ, న్యూస్‌లైన్ : డివిజన్ పరిధిలోని దాదాపు 9 మండలాల్లో 10 వేల ఎకరాలు చేపల చెరువులుగా తవ్వుకునేందుకు అనుమతుల కోసం రైతులు దరఖాస్తులు సమర్పించారు. డిసెంబర్ 31న జరిగిన డివిజనల్ స్థాయి సమావేశంలో రెండువేల ఎకరాల వరకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటివరకు చేపల చెరువుల అనుమతి కావాలంటే మండలం నుంచి వచ్చిన ఫైలును కార్యాలయంలో సంబంధిత డిప్యూటీ తహశీల్దార్ చూసి నోట్‌ఫైల్ తయారుచేసిన తరువాత కార్యాలయ ప్రధానాధికారి సంతకం చేశాకే ఈ అధికారి సంతకం చేయాల్సి ఉంది. ఈ కార్యాలయంలో చేపల చెరువుల అనుమతికి గాను అందరికీ కలిపి ఎకరానికి రూ.2 వేలు సమర్పించుకుంటారని సమాచారం. దీన్ని వారి వారి స్థాయిలను బట్టి పంచుకుంటారు. ఇది గమనించిన ఈ అధికారి వీరందరితో ఎందుకు పని అని నేరుగా తానే చేపల చెరువుల ఫైలు తీసుకుని సంతకాలు చేయటం ప్రారంభించారు. అందరి వాటాలు తనకే వస్తాయని మాస్టర్‌ప్లాన్ వేసి, ఈ తతంగం నడిపేందుకు తన వద్ద ఉండే ఇద్దరు కిందిస్థాయి ఉద్యోగులను పురమాయించారు. వచ్చిన రైతుల వద్ద నేరుగా బేరం మాట్లాడుకోవటం, డబ్బు తీసుకోవటం, సంతకాలు పెట్టి జిల్లా సమావేశంలో అనుమతులు వచ్చేలా చేయటం ఈ పని చాలా ఈజీగా ఉందని కొందరి వద్ద నేరుగా ‘సార్’ చెప్పటం ఇందుకు ఉదాహరణ. ఇటీవల గుడివాడ రూరల్ మండలంలో అనుమతించిన చేపల చెరువుకు సంబంధించి ఆయన వాటాను సార్ బంధువులకు చెందిన గుంటూరు ఎస్బీఐ ఖాతాలో వేయించారని సమాచారం. లక్షలు పోసి వచ్చా.. సంపాదించుకోవాలిగా? గతంలో తాను పనిచేసినచోట పేదలకు అందాల్సిన తెల్లరేషన్ కార్డుల కూపన్లు అమ్ముకుని రూ.16 లక్షలకు పైగా అవినీతికి పాల్పడినట్లు సమాచారం. దీనిపై విచారణ ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది. ‘లక్షలు పోసి ఇక్కడికి వచ్చా.. సంపాదించుకోవాలిగా?’ అని చెబుతుండటం కొసమెరుపు. ఎన్నికలు వచ్చాక మనల్ని తెచ్చిన నాయకుడు గెలవకపోతే మళ్లీ ఇక్కడ ఉండబోమనే భావనతోనే ఇలా వసూళ్ల దందాకు తెరలేపారని తెలుస్తోంది. అందుకే ఇప్పటివరకు ఏ అధికారీ చేయనివిధంగా నేరుగా వసూళ్లకు శ్రీకారం చుట్టారని వినికిడి. కొల్లేరును ప్యాకేజీలుగా అమ్మేశారు... పర్యావరణాన్ని కాపాడేందుకు కొల్లేరులో చేపల చెరువులు ధ్వంసం చేసిన విషయం విదితమే. ఆ తరువాత వచ్చిన ఏ అధికారీ కొల్లేరు జోలికి పోలేదు. కానీ ఈ అధికారి వచ్చాక కొల్లేరులో చేపల చెరువుల తవ్వకానికి ప్యాకేజీల లెక్కన అనుమతులు ఇచ్చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండవల్లి మండలంలోని నందిగామ లంక, మణుగూరు లంకలో కొల్లేరును చేపల చెరువులుగా మార్చేశారు. మణుగూరు లంకలో చేపల చెరువుల తవ్వకాలపై ఫిర్యాదులు రావటంతో అప్పటి జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకున్నారని, దీంతో తవ్వకాలు ఆగాయని కార్యాలయంలో పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ అధికారి చెబుతున్నారు. టైటిల్ డీడ్లు.. ధృవీకరణ పత్రాల్లోనూ చేతివాటమే... టైటిల్ డీడ్లు.. ధృవీకరణ పత్రాల కోసం కార్యాలయానికి వచ్చే వారితో సార్ సిబ్బంది ముందుగానే ఎంత ఖర్చు అవుతుందో మాట్లాడుకుని లోపలికి పంపిస్తారని సమాచారం. సంబంధిత ఫైళ్లను కిందిస్థాయి సిబ్బందిగా ఉన్న వీరిద్దరూ పెడితేనే సార్ సంతకం చేస్తారని కార్యాలయంలోని సిబ్బంది అంతా బహిరంగంగానే చెబుతున్నారు. గతంలో పనిచేసిన ఏ అధికారీ రైతులకు ఇవ్వాల్సిన టైటిల్ డీడ్, జనన, మరణ ధృవీకరణ పత్రాలకు లంచాలు తీసుకున్న దాఖలాలు లేవని అంటున్నారు. కార్యాలయ సిబ్బందిలో ఆందోళన... అయ్యగారి తీరుతో కార్యాలయ సిబ్బందిలో ఆందోళన రేకెత్తుతోంది. దశాబ్దాల తరబడి ఉద్యోగాలు చేస్తున్న తమకు లేని ప్రాధాన్యత కిందిస్థాయి ఉద్యోగులకు వచ్చిందని చెబుతున్నారు. డివిజన్లో ఎన్ని వేల ఎకరాలకు చేపల చెరువుల అనుమతి వచ్చిందని కార్యాలయ ప్రధానాధికారిని అడిగితే నాకు తెలియదు. సార్నే అడగాలని సమాధానం చెప్పటం ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. డిప్యూటీ తహశీల్దార్లు, క్లర్కులతో సంబంధం లేకుండా నేరుగా ఫైళ్లు నడిచిపోవటంతో కార్యాలయంలోని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ అధికారి అవినీతి లీలలపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
నేనింతే...
మళ్లీ జిల్లాకు ఉషాకుమారి ఉడా వైస్ చైర్మన్‌గా నియామకం చక్రం తిప్పిన జిల్లా మంత్రి అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి శ్రీకాకుళంలో చేరకుండానే మళ్లీ విజయవాడకు సాక్షి, విజయవాడ : నేనింతే.. ఎవరేమనుకున్నా సరే జిల్లాలోనే ఉంటా.. అన్నట్టుగా ఉంది జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన పి.ఉషాకుమారి తీరు. గత ఏడాది అక్టోబర్‌లోనే బదిలీ అయినా వెళ్లకుండా రకరకాల కారణాలతో ఇక్కడే ఉన్న ఆమె ఎట్టకేలకు ఈ ఏడాది జనవరిలో జిల్లాను వదిలివెళ్లారు. కేవలం 12 రోజుల్లో మళ్లీ కొత్త పోస్టింగ్‌తో ఇక్కడికి వచ్చారు. జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన పి.ఉషాకుమారి బదిలీ వ్యవహారం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. అనేక మలుపులు తిరిగి రాజకీయరంగు పులుముకున్న ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన మంత్రి కీలకంగా పనిచేసి చక్రం తిప్పారు. జేసీగా వరుస వివాదాల్లో... 2004 బ్యాచ్‌కి చెందిన పి.ఉషాకుమారి 2012 ఆగస్టు 29న విజయవాడ జాయింట్ కల్టెకర్‌గా బదిలీపై వచ్చారు. జిల్లాలో పాలనపరంగా తనదైన ముద్ర వేసుకోలేకపోయినా వరుస వివాదాల్లో మాత్రం నిలిచారు. స్వయంగా జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆమెను బదిలీ చేయాలని ముఖ్యమంత్రి, ఇతరులకు ఫిర్యాదులు చేశారు. జాయింట్ కలెక్టర్ హోదాలో ఆమె ఇసుక రీచ్‌లను కేటాయించిన వ్యవహారంపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రితో పాటు పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు, పామర్రు ఎమ్మెల్యే డీవై దాస్ బహిరంగంగానే ఫిర్యాదులు చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఆమెకు జిల్లాకు చెందిన మంత్రి పూర్తిస్థాయిలో మద్దతిస్తూ వచ్చారు. చేపల చెరువుల తవ్వకాల వ్యవహారం, ఎల్ఆర్ఎస్ వ్యవహారాల్లోనూ ఆరోపణలు వినిపించాయి. పలువురు పదేపదే ఆమెపై ఫిర్యాదు చేసినా బదిలీ కాకుండా జిల్లా మంత్రి అడ్డుకుంటూ వచ్చారు. చివరకు అకస్మాత్తుగా గత ఏడాది అక్టోబర్ ఎనిమిదిన శ్రీకాకుళం జేసీగా ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. కలెక్టర్ బుద్ధప్రకాష్, జేసీ ఉషాకుమారిల బదిలీ ఒకేరోజు జరగటం తీవ్ర చర్చనీయాంశమైంది. మూడు నెలలు జిల్లాలోనే... జిల్లాకు జేసీగా నియమితులైన మురళి పలు కారణాలు, ఒత్తిళ్లతో విధుల్లో చేరలేదు. ఈ క్రమంలో తుపానును కారణంగా చూపి ఉషాకుమారి రిలీవ్ కాకుండా ఇక్కడే కొనసాగారు. బదిలీ ఉత్తర్వులు వచ్చినా దాదాపు జిల్లాలోనే మూడు నెలలు ఆమె కొనసాగటం వెనుక మంత్రి కృషి ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఎట్టకేలకు జనవరి 21న మురళి జిల్లాలో బాధ్యతలు స్వీకరించటంతో అనివార్య పరిస్థితుల్లో ఉషాకుమారి రిలీవ్ అయ్యారు. అయినా ఆమె శ్రీకాకుళంలో విధుల్లో చేరకుండా ఉండిపోయారు. జేసీ మురళి కూడా రాజ్యసభ నోటిఫికేషన్ వస్తే కోడ్ అమలులోకి వస్తుందనే కారణంగానే జిల్లాలో చేరారు. ఉడా వైస్ చైర్మన్‌గా నియామకం ఉషాకుమారి జిల్లాలో ఐఏఎస్ స్థాయి పోస్టింగ్ కోసం కసరత్తు చేసి ఉడా వైస్‌చైర్మన్‌గా శుక్రవారం నియమితులయ్యారు. సరిగ్గా జిల్లాలో రిలీవైన 12 రోజులకే మళ్లీ ఇక్కడే పోస్టింగ్ దక్కించుకోవటం వెనుక పెద్ద ఎత్తున పొలిటికల్ లాబీయింగ్ నడిచినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే బహిరంగంగా వ్యతిరేకించినా మంత్రి మాత్రం చక్రం తిప్పినట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి తీరుపై అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై సీఎం వద్ద పంచాయితీ పెట్టే దిశగా నేతలు యత్నిస్తున్నారు. ఆమె కోసం... కేవలం ఉషాకుమారికి జిల్లాలో పోస్టింగ్ ఇవ్వటం కోసం ఉడా వైస్ చైర్మన్ రామారావుపై బదిలీ వేటు వేయటం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వకపోవటం విచారకరం.