సాక్షి, అమరావతి: అనుమతులు తీసుకోకుండా చేపల చెరువులు తవ్వడం చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో చట్టం తెలియదని తప్పించుకోవడం కుదరదని పేర్కొంది. అనుమతి లేకుండా చేపల చెరువులు తవ్వేవారిపై ఏపీ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ చర్యలు తీసుకోవచ్చని చెప్పింది. ప్రస్తుత కేసులో కోర్టు ఆదేశాల మేరకు చేపల చెరువుల తవ్వకాలను నిలిపేసిన వ్యక్తులు అనుమతి తీసుకోకుండా తవ్వకాలను కొనసాగిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
ఆ వ్యక్తులు తమ భూముల్లో చేపల చెరువు తవ్వుకోవాలనుకుంటే చట్టప్రకారం సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు ఇటీవల తీర్పు చెప్పారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలోని పలు సర్వే నంబర్లలో శివకోటి గోవిందు, మరో ఆరుగురు చట్టప్రకారం అనుమతులు తీసుకోకుండా చేపల చెరువులు తవ్వుతున్నారని, ఈ తవ్వకాలను అడ్డుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ శ్రీగాయత్రి హౌసింగ్ మేనేజింగ్ పార్ట్‌నర్ పుల్లా ప్రభాకరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ గంగారావు విచారించారు. పిటిషనర్ న్యాయవాది ఎన్.శివారెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ 7.80 ఎకరాల్లో చట్టప్రకారం అనుమతులు తీసుకుని లేఅవుట్ వేసి 53 ప్లాట్లు చేశారని తెలిపారు. ఈ లేఅవుట్ చుట్టూ శివకోటి గోవిందు మరికొందరు చట్ట విరుద్ధంగా చేపల చెరువులు తవ్వుతున్నారని, దీనివల్ల తమ ప్లాట్లలోకి నీళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. నీరు కలుషితమై మంచినీరు లభించే పరిస్థితి ఉండదన్నారు. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
ప్రతివాదుల న్యాయవాది కె.అన్నపూర్ణ వాదనలు వినిపిస్తూ.. పక్కన ఉన్న చేపల చెరువుల నీరు తమ భూముల్లోకి వస్తుండటంతో పంట పండే అవకాశం లేదని చెప్పారు. చేపల చెరువులు తవ్వుకునేందుకు అనుమతులు తీసుకోవాలని తమకు తెలియదన్నారు. అనుమతులు తీసుకోవాలని కోర్టు ద్వారా తెలుసుకున్న తరువాత అనుమతుల కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని, వారు తమ దరఖాస్తులను స్వీకరించడం లేదని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ తీర్పు చెప్పారు.
చేపల చెరువులకు అనుమతి తప్పనిసరి
Published Fri, Jul 15 2022 5:04 AM | Last Updated on Fri, Jul 15 2022 3:26 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment