అధికారమే అండగా..
ఏలూరు : అధికారమే అండగా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూమిలో చేపల చెరువులు తవ్వడమే కాకుండా.. రెండు గ్రామాల మధ్య చిచ్చుపెట్టారు. ఓ గ్రామానికి చెందిన దళితులు పనులను అడ్డుకోవడంతో కొల్లేరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు మండలం కోమటిలంక పరిధిలో సుమారు 110 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. గతంలో ఆ భూమిలో గ్రామ ప్రజలు ఉమ్మడిగా చేపలు పెంచుకుంటూ ఆదాయం పొందేవారు. కొల్లేరు ప్రక్షాళన సందర్భంగా అధికారులు ఈ చెరువులను ధ్వంసం చేశారు. అప్పటినుంచి ఆ భూమి ఖాళీగా ఉంటోంది.
2014 ఎన్నికల తర్వాత
స్థానిక ప్రజాప్రతినిధులు దీనిపై కన్నేశారు. కోమటిలంక పెద్దలకు నచ్చజెప్పి ఈ ఏడాది మే నెలలో సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువులు తవ్వారు. ఇందుకు ప్రతిఫలంగా ఆ గ్రామ ప్రజలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. అనంతరం ఆ చెరువులను సాగు చేసుకోవడం కోసం శ్రీపర్రు గ్రామస్తులను ఉసిగొల్పారు. కోమటిలంక గ్రామ ప్రజలకు పట్టాలు ఇవ్వకుండానే మిగిలిన 40 ఎకరాల్లో చెరువు తవ్వడానికి ఎమ్మెల్యే సోదరుడు, తెలుగుదేశం పార్టీ మండల శాఖ నాయకుడు, గ్రామంలోని టీడీపీ నేతలు పనులు ప్రారంభించారు. తమకు న్యాయం చేయకపోగా చెరువులు తవ్వుకుని వేరేవారికి లీజుకు ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో కోమటిలంక దళితులంతా ఏకమయ్యారు. ఆ భూములను సాగు నిమిత్తం తమకే ఇవ్వాలని పట్టుబట్టారు. వారి డిమాండ్‌ను పట్టించుకోని టీడీపీ నేతలు పొక్లెయిన్‌తో చెరువు తవ్వకం పనులు చేపట్టారు. దీంతో ఆగ్రహించిన దళితులు సోమవారం ఆ పనులను అడ్డుకున్నారు.
దీంతో అధికార పార్టీ నేతలు వారిపైకి పోలీసులను ఉసిగొల్పారు. కేసులు పెడతామని బెదరించడంతో ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం గ్రామస్తులంతా ఏలూరు తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చి ధర్నాకు దిగారు. ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములను మండల టీడీపీ అ««దl్యక్షుడు నేతల రవి, ఎమ్మెల్యే సోదరుడు బడేటి చంటి ఆక్రమించుకుంటున్నారని, ఈ ప్రాంతంలో చేపల చెరువు తవ్వకాలను తక్షణం అడ్డుకోవాలని కోరుతూ తహసీల్దార్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
శ్రీపర్రు గ్రామస్తుల పేరుచెప్పి..
కోమటిలంక గ్రామస్తులు మద్దుల రత్తయ్య, పోసురాజు నారాయణ, పెనుగొండ జోజేశ్వరరావు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ తమ గ్రామ పరిధిలో సుమారు 110 ఎకరాల అసైన్డ్ భూమి ఉందని చెప్పారు. ఇందులో 70 ఎకరాల భూమిని శ్రీపర్రు గ్రామస్తులకు కేటాయిస్తున్నామంటూ స్థానిక ప్రజాప్రతినిధులు మే నెలలో చేపలు చెరువులు తవ్వారన్నారు. దీనికి బదులుగా ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికారన్నారు.
నేటికీ పట్టాలు ఇవ్వకపోగా గ్రామ పరిధిలో ఉన్న మరో 40 ఎకరాల్లో చేపల చెరువులు తవ్వుతున్నారని వివరించారు. దీనివెనుక టీడీపీ నాయకుల కుట్ర ఉందని ఆరోపించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోమటిలంక దళితులు ఆందోళనకు దిగిన విషయాన్ని తెలుసుకున్న శ్రీపర్రు గ్రామ నాయకులు ఏలూరు వచ్చి తహసీల్దార్‌ను కలిశారు. కోమటిలంక ప్రజల అంగీకారంతోనే తాము భూమి పొందామని, స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల మేరకే సాగు చేస్తున్నామని వివరించారు. తాము ఎవరి భూమిని ఆక్రమించలేదన్నారు.