ఆపరేషాన్
ఏలూరు : కొల్లేరులో ప్రభుత్వ, జిరాయితీ భూముల్లో తవ్విన చేపల చెరువులను ధ్వంసం చేసేందుకు జిల్లా యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది. సుమారు 6 వేల ఎకరాల్లో అక్రమంగా చెరువులు తవ్వినట్టు గుర్తించిన అధికారులు, వాటిని ధ్వంసం చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరేం దుకు సన్నద్ధమయ్యారు. కోర్టు కేసుల నేపథ్యంలో ఇటీవల నిడమర్రులో 125 ఎకరాలకు సంబంధించిన చెరువు గట్లను ధ్వంసం చేసిన విష యం విదితమే.
కొల్లేరు అభయూరణ్యం పరిధిలో గల ప్రభుత్వ, జిరాయితీ భూముల్లో ఎట్టిపరిస్థితుల్లో చేపల చెరువులు, ఆక్రమణలు ఉండరాదన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఆపరేషన్ కొల్లేరు పేరిట 2006 సంవత్సరంలో కొల్లేరులో పెద్దఎత్తున చేపల చెరువుల్ని ధ్వంసం చేశారు. ఆ తరువాత కాలంలో పాత చెరువులను మళ్లీ పున రుద్ధరించారు. గడచిన ఎనిమిదేళ్ల కాలంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 1,300 ఎకరాల ప్రభుత్వ భూముల్లోను, 4,700 ఎకరాల జిరాయితీ భూముల్లోను చెరువులు తవ్వినట్టు జిల్లా వన్యప్రాణి విభాగం అధికారులు గుర్తించారు. తాజాగా వాటిని ధ్వంసం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
‘పశ్చిమ’లోనే అధికంతంలో ధ్వంసం చేసిన చెరువుల్ని పునరుద్ధరించే కార్యక్రమం జిల్లాలోని ఏలూరు, భీమడోలు, నిడమర్రు మండ లాల్లో పెద్దఎత్తున ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పెదపాడు, దెందులూరు, ఉంగుటూరు మండలాల్లోనూ ఇలాంటి చెరువులు ఉన్నట్టు నిర్ధారించారు. మొత్తంగా జిల్లాలో 5 వేల ఎకరాల్లో చెరువులు తవ్వినట్టు తేల్చారు. కృష్ణా జిల్లా కైకలూరు మండలంలో సుమారు ఎకరాల్లో చెరువుల్ని పునరుద్ధరించినట్టు భావిస్తున్నారు. డ్రెయిన్ల మరమ్మతులకు అనుమతులు తీసుకుని పైడిచింతపాడు శివారు కొక్కిరాయిలంక గ్రామంలో 30 ఎకరాలను తవ్వారు. ఈ రీతిలోనే అన్నిచోట్లా గట్లను పెంచి బడాబాబులు కొల్లేరును కొల్లగొట్టినట్టు తెలుస్తోంది.
నిధులు కోరిన యంత్రాంగం
జిల్లాలో ముందుగా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వెలిసిన 1,300 ఎకరాల్లోని చెరువులను ధ్వంసం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత 4,700 ఎకరాల జిరాయితీ భూముల్లోని చెరువులకు గండ్లు కొట్టాలనే యోచనలో ఉన్నారు. ఇందుకు అవసరమైన నిధులివ్వాలని కోరినట్టు వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో (ఎటాచ్డ్ అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) పీజే బెనర్జీ తెలిపారు. ఈ కార్యక్రమం చేపట్టడానికి లక్షలాది రూపాయలు అవసరం అవుతాయన్నారు. కొల్లేరు అభయారణ్యం భూముల్లో వ్యవసాయం తప్ప చెరువులు, ఇతర కార్యకలాపాలేవీ చేపట్టకూడదని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని ఆయన చెప్పారు.
నేడు ప్రజాప్రతినిధులు, అధికారుల సమీక్ష
కొల్లేరులో ఆక్రమణల తొలగింపు వ్యవహారంపై అటవీశాఖ ఉన్నతాధికారులు, జిల్లాకు చెందిన సీసీఎఫ్ డాక్టర్ శ్రీధర్, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు బుధవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. దీంతో రెండు జిల్లాల సమాచారంతో వన్యప్రాణి విభాగం అధికారులు ఇప్పటికే హైదరాబాద్ వెళ్లారు. కొల్లేరులో వాస్తవ పరిస్థితుల్ని సమీక్షించి, అభయూరణ్యం పరిధిలోని చెరువులకు గండ్లు కొట్టేందుకు నిధులిచ్చే అంశంపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వన్యప్రాణి విభాగం అధికారులు భావిస్తున్నారు. సమీక్షలో పాల్గొనేందుకు కలెక్టర్ కె.భాస్కర్, అభయూరణ్యం ఇన్‌చార్జి అధికారి టి.రామ్మోహనరావు సైతం మంగళవారం రాత్రి హైదరాబాద్ బయలుదేరారు.