Collina
-
గోపాలా.. కొల్లేరు గోడు ఆలకించయ్యా..!
నేడు అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కైకలూరు రాక సమస్యలు వివరించేందుకు కొల్లేరు వాసులు సిద్ధం కైకలూరు : పాలకులు మారిన ప్రతిసారి తమకు న్యాయం జరుగుతుందేమోనని ఆశగా ఎదురు చూడటం కొల్లేరు ప్రాంత వాసులకు ఆనవాయితీగా మారింది. మంత్రులు, నాయకులు వచ్చినప్పుడు సమస్యలను వివరించడం పరిపాటిగా మారింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, సహకార, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంగళవారం తొలిసారిగా కైకలూరు రానున్నారు. ఈ సందర్భంగా కొల్లేరు తీర ప్రాంత సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లడానికి లంక గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారు. కొల్లేరు వాసుల డిమాండ్లు ఇవీ.. కొల్లేరు ఆపరేషన్ సమయంలో కైకలూరు, మండవల్లి మండలాల్లో అదనంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాలను తిరిగి పంపిణీ చేయాలి. కొల్లేరు ఆపరేషన్‌లో ధ్వంసమైన జిరాయితీ భూమలకు నష్టపరిహారం అందించాలి. సరస్సును +5 కాంటూరు నుంచి +3 కాంటూరు వరకు కుదించాలి. మిగిలిన భూమిని పేదలకు పంచాలి. కొల్లేరులో వలసల నివారణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. కొల్లేరులో వేటపై ఆంక్షలు ఎత్తేయాలి. కొల్లేరు ప్రాంత ప్రజలను మత్య్సకారులుగా గుర్తించి పథకాలు అమలు చేయాలి. కొల్లేరు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యే నిధులు కేటాయించాలి. -
ఆపరేషాన్
ఏలూరు : కొల్లేరులో ప్రభుత్వ, జిరాయితీ భూముల్లో తవ్విన చేపల చెరువులను ధ్వంసం చేసేందుకు జిల్లా యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది. సుమారు 6 వేల ఎకరాల్లో అక్రమంగా చెరువులు తవ్వినట్టు గుర్తించిన అధికారులు, వాటిని ధ్వంసం చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరేం దుకు సన్నద్ధమయ్యారు. కోర్టు కేసుల నేపథ్యంలో ఇటీవల నిడమర్రులో 125 ఎకరాలకు సంబంధించిన చెరువు గట్లను ధ్వంసం చేసిన విష యం విదితమే. కొల్లేరు అభయూరణ్యం పరిధిలో గల ప్రభుత్వ, జిరాయితీ భూముల్లో ఎట్టిపరిస్థితుల్లో చేపల చెరువులు, ఆక్రమణలు ఉండరాదన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఆపరేషన్ కొల్లేరు పేరిట 2006 సంవత్సరంలో కొల్లేరులో పెద్దఎత్తున చేపల చెరువుల్ని ధ్వంసం చేశారు. ఆ తరువాత కాలంలో పాత చెరువులను మళ్లీ పున రుద్ధరించారు. గడచిన ఎనిమిదేళ్ల కాలంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 1,300 ఎకరాల ప్రభుత్వ భూముల్లోను, 4,700 ఎకరాల జిరాయితీ భూముల్లోను చెరువులు తవ్వినట్టు జిల్లా వన్యప్రాణి విభాగం అధికారులు గుర్తించారు. తాజాగా వాటిని ధ్వంసం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ‘పశ్చిమ’లోనే అధికంతంలో ధ్వంసం చేసిన చెరువుల్ని పునరుద్ధరించే కార్యక్రమం జిల్లాలోని ఏలూరు, భీమడోలు, నిడమర్రు మండ లాల్లో పెద్దఎత్తున ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పెదపాడు, దెందులూరు, ఉంగుటూరు మండలాల్లోనూ ఇలాంటి చెరువులు ఉన్నట్టు నిర్ధారించారు. మొత్తంగా జిల్లాలో 5 వేల ఎకరాల్లో చెరువులు తవ్వినట్టు తేల్చారు. కృష్ణా జిల్లా కైకలూరు మండలంలో సుమారు ఎకరాల్లో చెరువుల్ని పునరుద్ధరించినట్టు భావిస్తున్నారు. డ్రెయిన్ల మరమ్మతులకు అనుమతులు తీసుకుని పైడిచింతపాడు శివారు కొక్కిరాయిలంక గ్రామంలో 30 ఎకరాలను తవ్వారు. ఈ రీతిలోనే అన్నిచోట్లా గట్లను పెంచి బడాబాబులు కొల్లేరును కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. నిధులు కోరిన యంత్రాంగం జిల్లాలో ముందుగా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వెలిసిన 1,300 ఎకరాల్లోని చెరువులను ధ్వంసం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత 4,700 ఎకరాల జిరాయితీ భూముల్లోని చెరువులకు గండ్లు కొట్టాలనే యోచనలో ఉన్నారు. ఇందుకు అవసరమైన నిధులివ్వాలని కోరినట్టు వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో (ఎటాచ్డ్ అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) పీజే బెనర్జీ తెలిపారు. ఈ కార్యక్రమం చేపట్టడానికి లక్షలాది రూపాయలు అవసరం అవుతాయన్నారు. కొల్లేరు అభయారణ్యం భూముల్లో వ్యవసాయం తప్ప చెరువులు, ఇతర కార్యకలాపాలేవీ చేపట్టకూడదని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని ఆయన చెప్పారు. నేడు ప్రజాప్రతినిధులు, అధికారుల సమీక్ష కొల్లేరులో ఆక్రమణల తొలగింపు వ్యవహారంపై అటవీశాఖ ఉన్నతాధికారులు, జిల్లాకు చెందిన సీసీఎఫ్ డాక్టర్ శ్రీధర్, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు బుధవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. దీంతో రెండు జిల్లాల సమాచారంతో వన్యప్రాణి విభాగం అధికారులు ఇప్పటికే హైదరాబాద్ వెళ్లారు. కొల్లేరులో వాస్తవ పరిస్థితుల్ని సమీక్షించి, అభయూరణ్యం పరిధిలోని చెరువులకు గండ్లు కొట్టేందుకు నిధులిచ్చే అంశంపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వన్యప్రాణి విభాగం అధికారులు భావిస్తున్నారు. సమీక్షలో పాల్గొనేందుకు కలెక్టర్ కె.భాస్కర్, అభయూరణ్యం ఇన్చార్జి అధికారి టి.రామ్మోహనరావు సైతం మంగళవారం రాత్రి హైదరాబాద్ బయలుదేరారు. -
కొల్లేరు రెగ్యులేటర్ కలేనా?
అమలుకాని అధికారుల వాగ్దానాలు చౌడుబారుతున్న పంటపొలాలు ఉపాధి కోల్పోతున్న కొల్లేటి ప్రజలు కైకలూరు : కొల్లేరు ప్రాంతంలో ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణం కలగా మారింది. రెగ్యులేటర్ నిర్మిస్తే ఈ ప్రాంత పొలాలకు ఉప్పు నీటి నుంచి రక్షణ లభించడంతోపాటు, చేపల చెరువులకు అన్ని కాలాల్లో పుష్కలంగా నీరు లభిస్తుంది. కొల్లేరు ఆపరేషన్ సమయంలో చేపల చెరువుల ధ్వంసానికి రైతులు సహకరిస్తే రెగ్యులేటర్ నిర్మించి బహుమతిగా అందిస్తామని అప్పటి కలెక్టర్ నవీన్‌మిట్టల్ హామీ ఇచ్చారు. కొల్లేరు ఆపరేషన్ ముగిసి ఏళ్లు గడుస్తున్నా హామీ మాత్రం అమలుకు నోచలేదు. భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి కొల్లేరుకు భారీగా నీరు చేరుతుంది. అయితే ఈ నీరు తక్కువ సమయంలోనే ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి తరలిపోతోంది. కొల్లేరు సరసు నిత్యం నీటితో కళకళలాడాలంటే రెగ్యులేటర్ నిర్మాణామే మార్గమని 1985లోనే ప్రభుత్వం గుర్తించింది. ఈ అంశాన్ని కొల్లేరుపై ప్రభుత్వం నియమించిన మిత్ర, శ్రీరామకృష్ణయ్య క మిటీలు బలపర్చాయి. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 67 మేజర్, మీడియం డ్రెయిన్ల ద్వారా ఏటా కొల్లేరు సరస్సులోకి లక్షా 11వేల క్యూసెక్కుల మురుగు నీరు చేరుతోంది. నవంబర్ మొదటి వారం నుంచి జూలై ఆఖరి వరకూ కొల్లేరులోకి నీటి ప్రవాహం ఉండదు. ఆ సమయంలో చెరువుల్లో నీరులేక మత్స్యకారులు జీవనాధారమైన చేపల వేట కోల్పోతున్నారు. 1.50 లక్షల ఎకరాల్లో ఉన్న చేపల చెరువుల్లో ఐదు అడుగుల లోతు నీరు ఉండాలంటే సుమారు 32 టీఎంసీల నీరు అవసరం. ఉప్పుటేరు వద్ద రెగ్యులేటర్ నిర్మిస్తే ఎగువ నుంచి వచ్చే నీటని నిల్వ చేసుకోవచ్చని నిపుణులు సూచించారు. కైకలూరు మండలంలోని ఉప్పుటేరు వంతెన నుంచి 100 మీటర్ల దూరం వద్ద, కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం వద్ద రెగ్యులేటర్ నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించారు. దీని నిర్మాణానికి రూ.50 కోట్లు ఖర్చవుతాయని నిపుణుల అంచనావేశారు. అయితే కొల్లేరు ఆపరేషన్ అనంతరం అధికారులు ఈ అంశాన్ని మరిచారు. రెగ్యులేటర్ నిర్మించి డిసెంబర్ నుంచి, జూలై వరకూ మూసివేస్తే కొల్లేరు నీటితో కళకళలాడుతుంది. ఆ సమయంలో రెండు అంగుళాల చేప పిల్లలు (ఫింగర్ లింగ్స్), కాళ్లరొయ్య (స్కాంపి) పిల్లలను వదిలితే అవి పెద్దవుతాయి. దీంతో కొల్లేరు పరివాహక ప్రజలు నిరంతరం చేపల వేట ద్వారా ఉపాధి పొందుతారు. ఉప్పుటేరు వద్ద రెగ్యులేటర్ నిర్మిస్తే సముద్రపు ఉప్పునీటి నుంచి పొలాలకు రక్షణ లభించి రైతులకు మేలు కలుగుతుంది. చౌడుబారుతున్న సారవంత భూములు ప్రపంచంలోనే అరుదైన చిత్తడి నేలల ప్రాంతగా కొల్లేరు గుర్తింపు పొందింది. అయితే కొల్లేరు గర్భం ఆక్రమణల చేరలో చిక్కుకుంది. అభయారణ్య పరిధిలో చేపల చెరువు గట్ల కారణంగా ఎగువ నుంచి వచ్చే నీరు సముద్రంలోకి చేరే అవకాశం ఉండదు. కొల్లేరు భూములు సముద్రమట్టం నుంచి తొమ్మిది అడుగుల ఎత్తులో ఉంటాయి. సంవత్సరంలో 10 నెలలు నీరు పారుతూవుంటేనే సముద్రం నుంచి పైకి వచ్చే ఉప్పు కిందకు కొట్టుకుపోతుంది. ఎగువ నుంచి నీరు పారని పక్షంలో ఉప్పునీరు చిత్తడి నేలల్లోకి చొచ్చుకొస్తుంది. ఫలితంగా చిత్తడి నేలలు ఉప్పునేలలుగా మారే ప్రమాదం ఉంది. రెగ్యులేటర్ లేకపోవడంతో ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సముద్రపు నీరు ఉప్పుటేరు ద్వారా కొల్లేరుకు చేరుతోంది. దీని వల్ల ఈ ప్రాంతంలోని సారవంతమైన లక్ష ఎకరాల భూములు చౌడుబారుతున్నాయి. ఉప్పునీరు కారణంగా నీరు చిక్కనై కొల్లేరు సరస్సులోని సహజసిద్ధంగా పెరిగే నల్లజాతి చేపలైన కొరమేను, ఇంగిలాయి, మట్టగిడస, గురక, మార్పు వంటి చేపల మృత్యువాత పడుతున్నాయి. మరికొన్ని వ్యాధుల బారిన పడుతున్నాయి. -
కొంప ‘కొల్లేరే’నా?
కైకలూరు, న్యూస్‌లైన్ : కొద్దిపాటి వర్షానికే రాకపోకలు స్తంభించే లంకగ్రామాల ప్రజలను కొల్లేరు మరింత భయాందోలనకు గురిచేస్తోంది. విస్తార వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి బారీగా నీరు చేరుతుండడంతో కొల్లేరు సరస్సులో నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది.దీంతో లంకగ్రామాల ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. కొద్ది నెలల క్రితం ఏడారిని తలపించిన కొల్లేరు ప్రస్తుతం నిండుకుండను తలపిస్తోంది. వరదల సమయంలో కొల్లేరుకు దాదాపు ఒక లక్షా 11వేల క్యూసెక్కుల నీరు చేరుతుంది. ప్రధానంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రామిలేరు, తమ్మిలేరు, గుండేరు, చంద్రయ్య కాల్వ, పోల్‌రాజ్, శ్యాంప్ వంటి 67 డ్రైయిన్ల నుంచి ఈ నీరు వస్తుంది. ఒక్క కృష్ణాజిల్లా నుంచే 35వేల 590 క్యూసెక్కుల నీరు వివిధ డ్రైయిన్ల ద్వారా కొల్లేరుకు చేరుతుంది. ప్రస్తుతం కొల్లేరు నీటిని దిగువకు పంపించే పెదయడ్లగాడి వంతెన వద్ద నీటి మట్టం శనివారం 1.7 మీటర్లకు చేరింది. రెండు రోజుల క్రితంవరకు 1.2 మీటర్లే సూచించింది. అదే విధంగా చినయడ్లగాడి, పోల్‌రాజ్ డ్రైయిన్లలో కూడా నీటిమట్టం రానురాను పెరుగుతుంది. కైకలూరు మండలం పందిరిపల్లిగూడెం కర్రల వంతెన వద్ద నీటి ఉధృతి మరింత పెరిగింది. దీంతో లోత ట్టు లంక గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెదయడ్లగాడి నుంచి పెనుమాకలంక గ్రామం చేరే రహదారి అంచునకు కొల్లేరు నీరు చేరింది. మరో రెండు రోజులు భారీగా నీరు చేరితే రోడ్డు మునిగి దిగువ గ్రామాలకు రాకపోకలు స్తంభించే ప్రమాదముంది. పై ప్రాంతాల నుంచి వస్తున్న నీటి కారణంగా పలు గ్రామాల్లో కొల్లేరు ఆపరేషన్ సమయంలో కొట్టేసిన చెరువుల్లోకి నీరు చేరింది. ప్రధానంగా కైకలూరు మండలం పందిరిపల్లిగూడెం, శృంగవరప్పాడు, చటాకాయి, కొట్డాడ, వడ్లకూటితిప్పా, మండవల్లి మండలంలో పెనుమాకలంక, నందిగామలంక, మణుగునూరు, కొవ్వాడలంక గ్రామాలు ముంపు బారిన పడే అవకాశం ఉంది. గుబులు పుట్టిస్తున్న గుర్రపుడెక్క...... ఎగువ నుంచి చేరుతున్న నీటి ప్రవాహానికి కొల్లేరులో దట్టంగా పెరుకుపోయిన గుర్రపుడెక్క, కిక్కిస అవరోధంగా మారాయి. డ్రైయిన్ల క్రమబద్ధీకరణ జరగకపోవడం కారణంగా కొల్లేరులోకి చేరే ఒక లక్షా 11వేల క్కూసెక్కుల నీటిలో కేవలం 12వేల క్యూసెక్కుల నీరు మాత్రమే ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి చేరుతుంది. కనీసం 15 వేల క్యూసెక్కుల నీటిని పంపించే సామర్థాన్ని పెంచేందుకు రూ. 35 కోట్ల ప్రతిపాదనలను అధికారులు ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి పంపారను. అయితే ఇప్పటికీ ఆ పనులు ప్రారంభం కాలేదు. అదే విధంగా కొల్లేరులోని 67 డ్రైయిన్లు అభివృద్ధి చేయడానికి (అంటే తూడు, కిక్కిస, చెత్తను తొలగించడం) రూ. 11 కోట్లతో ఆధునికీకరణ పనులకు టెండర్లు పిలిచారు. కొన్ని కారణాల వలన ఈ పనులు నిలిచాయి. ప్రస్తుతం పెదయడ్లగాడి, చినయడ్లగాడి వంతెన వద్ద పలు ఖానాల్లో గుర్రపుడెక్క, కిక్కిస పెరుకుపోయింది. అదే విధంగా కొల్లేరు నీటిని సముద్రానికి చేరవేసే ఉప్పుటేరు వంతెన వద్ద గుర్రపుడెక్క నీటి ప్రవాహానికి అడ్డువస్తుంది. అధికారులు ముందస్తు చర్యగా గుర్రపుడెక్కను తొలగించకపోతే గ్రామాలు ముంపుబారిన పడతాయని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. గుర్రపు డెక్క తొలగిస్తాం.... కొల్లేరుకు నీటిని చేరవేసే పలు డ్రైయిన్లలో గుర్రపుడెక్కను నిర్మూలించడానికి ప్రణాళిను తయారు చేస్తున్నట్లు డ్రైయినేజీ జేఈ రామిరెడ్డి తెలిపారు. అత్యవసర మయిన ప్రాంతాల్లో డెక్కను తొలగిస్తామని చెప్పారు. పెదయడ్లగాడి వద్ద నీటిమట్టం 2.5 మీటర్లుకు చేరితే ప్రమాదకర మేనని అంగీకరించారు. ఎగువ నుంచి చేరుతున్న నీటి కారణంగా నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.