కొల్లేరు రెగ్యులేటర్ కలేనా? | Collina kalena regulator? | Sakshi
Sakshi News home page

కొల్లేరు రెగ్యులేటర్ కలేనా?

Published Tue, Jul 29 2014 1:08 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

కొల్లేరు రెగ్యులేటర్ కలేనా? - Sakshi

కొల్లేరు రెగ్యులేటర్ కలేనా?

  •          అమలుకాని  అధికారుల వాగ్దానాలు
  •          చౌడుబారుతున్న  పంటపొలాలు
  •          ఉపాధి కోల్పోతున్న కొల్లేటి ప్రజలు
  • కైకలూరు : కొల్లేరు ప్రాంతంలో ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణం కలగా మారింది. రెగ్యులేటర్ నిర్మిస్తే ఈ ప్రాంత పొలాలకు ఉప్పు నీటి నుంచి రక్షణ లభించడంతోపాటు, చేపల చెరువులకు అన్ని కాలాల్లో పుష్కలంగా నీరు లభిస్తుంది. కొల్లేరు ఆపరేషన్ సమయంలో చేపల చెరువుల ధ్వంసానికి రైతులు సహకరిస్తే రెగ్యులేటర్ నిర్మించి బహుమతిగా అందిస్తామని అప్పటి కలెక్టర్ నవీన్‌మిట్టల్ హామీ ఇచ్చారు. కొల్లేరు ఆపరేషన్ ముగిసి ఏళ్లు గడుస్తున్నా హామీ మాత్రం అమలుకు నోచలేదు.

    భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి కొల్లేరుకు భారీగా నీరు చేరుతుంది. అయితే ఈ నీరు తక్కువ సమయంలోనే ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి తరలిపోతోంది. కొల్లేరు సరసు నిత్యం నీటితో కళకళలాడాలంటే రెగ్యులేటర్ నిర్మాణామే మార్గమని 1985లోనే ప్రభుత్వం గుర్తించింది. ఈ అంశాన్ని కొల్లేరుపై ప్రభుత్వం నియమించిన మిత్ర, శ్రీరామకృష్ణయ్య క మిటీలు బలపర్చాయి. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 67 మేజర్, మీడియం డ్రెయిన్ల ద్వారా ఏటా కొల్లేరు సరస్సులోకి లక్షా 11వేల క్యూసెక్కుల మురుగు నీరు చేరుతోంది. నవంబర్ మొదటి వారం నుంచి జూలై ఆఖరి వరకూ కొల్లేరులోకి నీటి ప్రవాహం ఉండదు.

    ఆ సమయంలో చెరువుల్లో నీరులేక మత్స్యకారులు జీవనాధారమైన చేపల వేట కోల్పోతున్నారు. 1.50 లక్షల ఎకరాల్లో ఉన్న చేపల చెరువుల్లో ఐదు అడుగుల లోతు నీరు ఉండాలంటే సుమారు 32 టీఎంసీల నీరు అవసరం. ఉప్పుటేరు వద్ద రెగ్యులేటర్ నిర్మిస్తే ఎగువ నుంచి వచ్చే నీటని నిల్వ చేసుకోవచ్చని నిపుణులు సూచించారు. కైకలూరు మండలంలోని ఉప్పుటేరు వంతెన నుంచి 100 మీటర్ల దూరం వద్ద, కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం వద్ద రెగ్యులేటర్ నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించారు. దీని నిర్మాణానికి రూ.50 కోట్లు ఖర్చవుతాయని నిపుణుల అంచనావేశారు.

    అయితే కొల్లేరు ఆపరేషన్ అనంతరం అధికారులు ఈ అంశాన్ని మరిచారు. రెగ్యులేటర్ నిర్మించి డిసెంబర్ నుంచి, జూలై వరకూ మూసివేస్తే కొల్లేరు నీటితో కళకళలాడుతుంది. ఆ సమయంలో రెండు అంగుళాల చేప పిల్లలు (ఫింగర్ లింగ్స్), కాళ్లరొయ్య (స్కాంపి) పిల్లలను వదిలితే అవి పెద్దవుతాయి. దీంతో కొల్లేరు పరివాహక  ప్రజలు నిరంతరం చేపల వేట ద్వారా ఉపాధి పొందుతారు. ఉప్పుటేరు వద్ద రెగ్యులేటర్ నిర్మిస్తే సముద్రపు ఉప్పునీటి నుంచి పొలాలకు రక్షణ లభించి రైతులకు మేలు కలుగుతుంది.
     
    చౌడుబారుతున్న సారవంత భూములు
     
    ప్రపంచంలోనే అరుదైన చిత్తడి నేలల ప్రాంతగా కొల్లేరు గుర్తింపు పొందింది. అయితే కొల్లేరు గర్భం ఆక్రమణల చేరలో చిక్కుకుంది. అభయారణ్య పరిధిలో చేపల చెరువు గట్ల కారణంగా ఎగువ నుంచి వచ్చే నీరు సముద్రంలోకి చేరే అవకాశం ఉండదు. కొల్లేరు భూములు సముద్రమట్టం నుంచి తొమ్మిది అడుగుల ఎత్తులో ఉంటాయి. సంవత్సరంలో 10 నెలలు నీరు పారుతూవుంటేనే సముద్రం నుంచి పైకి వచ్చే ఉప్పు కిందకు కొట్టుకుపోతుంది. ఎగువ నుంచి నీరు పారని పక్షంలో ఉప్పునీరు చిత్తడి నేలల్లోకి చొచ్చుకొస్తుంది. ఫలితంగా చిత్తడి నేలలు ఉప్పునేలలుగా మారే ప్రమాదం ఉంది. రెగ్యులేటర్ లేకపోవడంతో ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సముద్రపు నీరు ఉప్పుటేరు ద్వారా కొల్లేరుకు చేరుతోంది.
     
    దీని వల్ల ఈ ప్రాంతంలోని సారవంతమైన లక్ష ఎకరాల భూములు చౌడుబారుతున్నాయి. ఉప్పునీరు కారణంగా నీరు చిక్కనై కొల్లేరు సరస్సులోని సహజసిద్ధంగా పెరిగే నల్లజాతి చేపలైన కొరమేను, ఇంగిలాయి, మట్టగిడస, గురక, మార్పు వంటి చేపల మృత్యువాత పడుతున్నాయి. మరికొన్ని వ్యాధుల బారిన పడుతున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement