పురానీహవేలీ నిజాం మ్యూజియం
1908 సెప్టెంబర్ 27వ తేదీ అర్ధరాత్రి వర్షం మొదలైంది..
24 గంటలు దాటేసరికి వర్షం మరింత పెరిగింది.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన 36 గంటల్లో దాదాపు 17 సెం.మీల వర్షపాతం నమోదైంది. మూసీ 60 అడుగుల ఎత్తువరకు నీరు పారింది. అఫ్జల్‌గంజ్ వద్ద వంతెనపై 11 అడుగులపైన ఎత్తులో నీరు ప్రవహించడంతో మూసీపై ఉన్న అఫ్జల్, ముస్లింజంగ్, చాదర్‌ఘాట్ వంతెనలు కొట్టుకుపోయాయి. కొస్లావాడి, ఘాన్సీబజార్ ప్రాంతాలతో పాటు 80 వేల ఇళ్లలోకి నీరు చేరింది. వేల మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
2020 అక్టోబర్ 13వ ఉదయం నుంచి వర్షం మొదలైంది..
సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురవడంతో నగరం అస్తవ్యస్తంగా మారింది. మూసీకి వరదలు వచ్చిన 112 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో మూసీ ప్రవహించింది. ఇరువైపులా ఉన్న కాలనీల్లోకి నీరు చేరింది. నగరంలోని చెరువులు తెగిపోయి వందల కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. వాహనాలు, ఇళ్లలోని వస్తువులు ధ్వంసమయ్యాయి.
సాక్షి, హైదరాబాద్: 1908 వరదల తర్వాత పురానాపూల్, నయాపూల్, చాదర్‌ఘాట్ వంతెనలు నిర్మించారు. భారీ వర్షం కురిసి మూసీ ప్రవాహం పెరిగినా ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి పురానాపూల్ బ్రిడ్జి పిల్లర్‌కు బీటలు రావడంతో వెంటనే అధికారులు రాకపోకలను నిలిపివేశారు. 400 ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో ప్రస్తుతం చాలా నిర్మాణాలు కనీస మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అంతేగాకుండా నగరంలోని చాలా కట్టడాల గోడలు కూలుతున్నాయి. దీనిపై ‘సాక్షి’ విజిట్ నిర్వహించింది. చదవండి: (ప్రతి ఇంటికి రూ.10 వేలు..)
తడుస్తున్న పురానీ హవేలీ గోడలు
హైదరాబాద్ సంస్థానాన్ని దాదాపు 200 ఏళ్లు పాలించిన నిజాం పాలకుల నివాసం పూరానీ హవేలీ.. ప్రస్తుతం ఇందులో నిజాం మ్యూజియం కొనసాగుతోంది. ఇందులో విలువైన వస్తువులు ఉన్నాయి. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ వాడిన ప్రపంచంలోనే అతిపెద్ద వాడ్‌రోబ్ ఉంది. నిర్వహణ సరిగా లేక గోడల్లోకి నీరు చేరుతోంది.
డ్రైనేజీ వ్యవస్థతో అవస్థ
మక్కా మసీదులో ఎక్కడ చూసినా నిర్లక్ష్యం కనిపిస్తోంది. అక్కడ నిర్వహణ సరిగ్గా లేక పైనుంచి గోడల ద్వారా నీరు కిందకు వస్తోంది. మక్కా మసీదులో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ప్రాంగణంలో నీరు నిల్వ ఉంటోంది. మరమ్మతులు మాత్రం సరిగా సాగడం లేదు.
శిథిలావస్థలో చరిత్ర
కుతుబ్‌షాహీ, ఆసీఫ్‌జాహీ కాలంలోని నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో చార్మినార్, మక్కా మసీదుల గోడల్లోంచి నీరు కారుతోంది. నిజాంల నివాసంలోనూ గోడలు తడిసిపోయాయి. చార్మినార్ పైకప్పు నుంచి నీరు కిందకు వచ్చేందుకు ఏర్పాటు చేసిన పైపుల్లో మట్టి పేరుకుపోవడంతో నీళ్లు కిందకు రావడం లేదు. దీంతో గోడలు తడిసిపోతున్నాయి.
పురానా పూల్ వంతెనకు బీటలు
1992 ఫ్రిబవరి 28వ తేదీ పురానా పూల్ వంతెనకు పక్కనే మరో కొత్త వంతెన నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటీవల భారీ వర్షాలతో హిమాయత్‌సాగర్ గేట్లు తెరిచి మూసిలోకి వరద నీటిని వదిలారు. వంతెన పిల్లర్లకు బీటలు పడ్డాయి. పార్థివాడ నుంచి జియాగూడ వైపు వచ్చే వంతెన పిల్లర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో అర్ధరాత్రి నుంచి వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. మరుసటి రోజు సాయంత్రం చిన్న వాహనాలకు అనుమతించారు. నిజాం కాలంలో నిర్మించిన పురానా, నయాపూల్, చాదర్‌ఘాటల్ వంతెనలు తప్ప మిగతావి 1990 తర్వాత నిర్మించినవే..
కూలుతున్న గోల్కొండ కోట గోడలు
గోల్కొండ: 500 ఏళ్ల క్రితం నిర్మితమైన గోల్కొండ కోట భారీ వర్షాలకు దెబ్బతింటోంది. కోట గోడలు కూలుతున్నాయి. కోట ప్రవేశ ద్వారాల తలుపు రెక్కలు సైతం పాడయ్యాయి. 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన గోల్కొండ కోటలో 1518 బహమనీ వంశస్తుడైన సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్‌ముల్క్ 1518లో రాతి కోటగా మార్చాడు. అనంతరం కులీకుతుబ్‌షా కోటను మరింత పటిష్టం చేసేందుకు నయాఖిలాను నిర్మించాడు. కాగా ప్రస్తుతం గోల్కొండ కోటతో పాటు నయాఖిలాలోని కోట గోడలు, బురుజులు భారీ వర్షాలకు కూలుతున్నాయి.
కోటలో రాణివాసంతో పాటు కోటలో నివాసం ఉండేవారికి నీరు అందించే చారిత్రక కఠోర హౌస్ కట్టడానికి చెందిన ప్రహరీ నేలకూలింది. గోల్కొండ కోట రాజులు, మంత్రి, సైన్యాధిపతి కోట పైభాగంలోని దర్బారు వద్దకు వెళ్లేందుకు కోట గోడ పొడవునా గుర్రాల దారిని నిర్మించారు. 5 మీటర్ల వెడల్పు ఉన్న ఈ మార్గాన్ని భారీ బండరాళ్లు, మట్టి, సున్నపు డంగుతో నిర్మించారు. నిన్నటి భారీ వర్షానికి గోడ నేలకూలింది. ఈ నెల మొదటి వారంలో భారీ వర్షాలకు నయాఖిలాలోని మజ్నూ బురుజు కూడా నేలకూలింది. 8 మీటర్ల వెడల్పు గల ఈ బురుజుపై నుంచి శత్రు సైన్యంపై ఫిరంగి గుళ్లు వదిలేవారు. నిర్వహణ లోపంతో ఈ బురుజు కూలింది. ఒకప్పుడు సుగంధాలు వెదజల్లిన కఠోర హౌజ్ తటానికి ఉన్న ప్రహరీ సోమవారం ఓ వైపునకు ఒరిగి తటాకంలో కూలింది. 200 మీటర్ల పొడవు గల ఈ గోడ భారీ శబ్దంతో కూలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment