సమీకృత సేంద్రియ సేద్య పతాక.. తిలగర్‌! | Small farmer ideal farming in Tamil Nadu | Sakshi
Sakshi News home page

సమీకృత సేంద్రియ సేద్య పతాక.. తిలగర్‌!

Published Tue, Feb 20 2018 12:12 AM | Last Updated on Tue, Feb 20 2018 12:12 AM

Small farmer ideal farming in Tamil Nadu - Sakshi

తిలగర్‌ ఏర్పాటు చేసిన చేపల చెరువు, చెరువు మధ్యలోని కోళ్ల షెడ్డు. (పక్కన) బాతులను చూపుతున్న రైతు తిలగర్‌

సముద్ర తీర ప్రాంతాల్లో రైతులకు తమిళనాడుకు చెందిన వృద్ధ రైతు తిలగర్‌ (60) ఆచరిస్తున్న సమీకృత సేంద్రియ సేద్య పద్ధతి రైతాంగానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది. తిలగర్‌ నాగపట్టినం జిల్లా సిర్కజి తాలూకా కొడంకుడిలో తనకున్న ఎకరం పావు పొలంలో దశాబ్దాలుగా రసాయనిక పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నా.. పెద్దగా నికరాదాయాన్ని కళ్ల జూసిన సందర్భాల్లేవు. బోరు నీటి ఆధారంగానే సేద్యం చేస్తున్న తిలగర్‌ ఈ నేపథ్యంలో.. సమీకృత సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టారు. వరుసగా మూడేళ్లు కరువు వచ్చినా మెరుగైన నికరాదాయాన్ని పొందుతున్నారు. సేంద్రియ వ్యవసాయోద్యమకారుడు దివంగత నమ్మాళ్వార్‌ చూపిన బాటలో మూడేళ్ల క్రితం నుంచి సేంద్రియ పద్ధతిని అనుసరిస్తున్నారు. వ్యవసాయ పనులన్నీ తిలగర్‌ కుటుంబ సభ్యులే చేసుకుంటారు. 

చెరువు.. కోళ్ల షెడ్డు.. వరి పొలం..
పావెకరంలో చెరువు తవ్వారు. అది చేపల చెరువు మాత్రమే కాదు, పక్కనే ఉన్న ఎకరం వరి పొలానికి నీరందించే నీటి కుంట కూడా. చెరువులో పూరి పాకను నిర్మించి, చుట్టూ ఇనుప మెష్‌ ఏర్పాటు చేసి కోళ్ల ఫామ్‌గా మార్చారు. ఆ కోళ్ల పెంట నేరుగా చెరువు నీటిలోకి పడుతుంది. చెరువు నీటిలో బొచ్చె, బంగారుతీగ వంటి 3 రకాలకు చెందిన వెయ్యి మంచినీటి కార్పు చేప పిల్లలను వదులుతుంటారు. కోళ్ల పెంట వల్ల చెరువు నీటికి చేపలకు అవసరమైన ప్లవకాలను ప్రకృతిసిద్ధంగా అందుబాటులోకి తెస్తున్నాయి. దీనికి తోడు అడపా దడపా పంచగవ్యను చల్లుతూ ఉంటారు. కాబట్టి, చేపల కోసం ప్రత్యేకంగా మేత అంటూ ఏమీ వేయడం లేదు. 

2016లో సేకరించిన గణాంకాల ప్రకారం.. వెయ్యి చేపపిల్లలను వదిలిన 8 నెలల్లో 600 కిలోల చేపల దిగుబడి వచ్చింది. తిలగర్‌ ప్రత్యేకత ఏమిటంటే.. చేపలను సజీవంగా తన చెరువు వద్దనే నేరుగా వినియోగదారులకు అమ్ముతూ ఉంటారు. కిలో రూ. 150 చొప్పున.. రూ. 90 వేల ఆదాయం పొందుతున్నారు. 

చేపల చెరువు నీటితో వరి సాగు
చేపల చెరువులోని నీటిని పక్కనే ఉన్న వరి పొలానికి పారిస్తున్నారు. వరి పొలానికి పంచగవ్య తప్ప మరేమీ ఎరువు వేయటం లేదు. ఎకరానికి 40 బస్తాల వరకు ధాన్యం దిగుబడి పొందుతున్నారు. 
తిలగర్‌ తన పొలం వద్దనే దేశీ ఆవుతోపాటు మేకలు, బాతులను పెంచుతున్నారు. గట్ల మీద కొబ్బరి, మామిడి, జామ చెట్లను పెంచుతూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. 

వ్యవసాయం, పశుపోషణ పరస్పర ఆధారితమైనవి కావడంతో వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడు.. సమీకృత సేంద్రియ సేద్యం ప్రధానంగా చిన్న కమతాలుండి సొంత రెక్కల కష్టంపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకునే చిన్న, సన్నకారు రైతులకు ఆహార, ఆదాయ భద్రత లభిస్తుందనడంలో సందేహం లేదు. 

సేంద్రియ సర్టిఫికేషన్‌ ఇవ్వబోతున్నాం
జిల్లా కలెక్టర్‌ పళనిస్వామి స్వయంగా తిలగర్‌ క్షేత్రాన్ని సందర్శించి అభినందించడంతోపాటు ఉత్తమ రైతు పురస్కారంతో సత్కరించారు. ఇతర రైతులను సైతం సమీకృత సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కృషి చేయమని అధికారులను ఆదేశించారు. తిలగర్‌ వ్యవసాయోత్పత్తులకు పీజీఎస్‌–ఇండియా కింద సేంద్రియ సర్టిఫికేషన్‌ను అందించబోతున్నాం. 
– ఆర్‌. రవిచంద్రన్‌ (094440 63174, 095007 82105)మత్స్య శాఖ సహాయ సంచాలకుడు,నాగపట్టినం, తమిళనాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement