నేనింతే... | The district again usakumari | Sakshi
Sakshi News home page

నేనింతే...

Published Sat, Feb 1 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

నేనింతే...

నేనింతే...

  • మళ్లీ జిల్లాకు ఉషాకుమారి
  •  ఉడా వైస్ చైర్మన్‌గా నియామకం
  •  చక్రం తిప్పిన జిల్లా మంత్రి
  •  అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి
  •  శ్రీకాకుళంలో చేరకుండానే మళ్లీ విజయవాడకు    
  •  సాక్షి, విజయవాడ : నేనింతే.. ఎవరేమనుకున్నా సరే జిల్లాలోనే ఉంటా.. అన్నట్టుగా ఉంది జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన పి.ఉషాకుమారి తీరు. గత ఏడాది అక్టోబర్‌లోనే బదిలీ అయినా వెళ్లకుండా రకరకాల కారణాలతో ఇక్కడే ఉన్న ఆమె ఎట్టకేలకు ఈ ఏడాది జనవరిలో జిల్లాను వదిలివెళ్లారు. కేవలం 12 రోజుల్లో మళ్లీ కొత్త పోస్టింగ్‌తో ఇక్కడికి వచ్చారు. జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన పి.ఉషాకుమారి బదిలీ వ్యవహారం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. అనేక మలుపులు తిరిగి రాజకీయరంగు పులుముకున్న ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన మంత్రి కీలకంగా పనిచేసి చక్రం తిప్పారు.
     
    జేసీగా వరుస వివాదాల్లో...

     2004 బ్యాచ్‌కి చెందిన పి.ఉషాకుమారి 2012 ఆగస్టు 29న విజయవాడ జాయింట్ కల్టెకర్‌గా బదిలీపై వచ్చారు. జిల్లాలో పాలనపరంగా తనదైన ముద్ర వేసుకోలేకపోయినా వరుస వివాదాల్లో మాత్రం నిలిచారు. స్వయంగా జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆమెను బదిలీ చేయాలని ముఖ్యమంత్రి, ఇతరులకు ఫిర్యాదులు చేశారు. జాయింట్ కలెక్టర్ హోదాలో ఆమె ఇసుక రీచ్‌లను కేటాయించిన వ్యవహారంపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రితో పాటు పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు.

    మాజీ ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు, పామర్రు ఎమ్మెల్యే డీవై దాస్ బహిరంగంగానే ఫిర్యాదులు చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఆమెకు జిల్లాకు చెందిన మంత్రి పూర్తిస్థాయిలో మద్దతిస్తూ వచ్చారు. చేపల చెరువుల తవ్వకాల వ్యవహారం, ఎల్‌ఆర్‌ఎస్ వ్యవహారాల్లోనూ ఆరోపణలు వినిపించాయి. పలువురు పదేపదే ఆమెపై ఫిర్యాదు చేసినా బదిలీ కాకుండా జిల్లా మంత్రి అడ్డుకుంటూ వచ్చారు. చివరకు అకస్మాత్తుగా గత ఏడాది అక్టోబర్ ఎనిమిదిన శ్రీకాకుళం జేసీగా ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. కలెక్టర్ బుద్ధప్రకాష్, జేసీ ఉషాకుమారిల బదిలీ ఒకేరోజు జరగటం తీవ్ర చర్చనీయాంశమైంది.
     
    మూడు నెలలు జిల్లాలోనే...

    జిల్లాకు జేసీగా నియమితులైన మురళి పలు కారణాలు, ఒత్తిళ్లతో విధుల్లో చేరలేదు. ఈ క్రమంలో తుపానును కారణంగా చూపి ఉషాకుమారి రిలీవ్ కాకుండా ఇక్కడే కొనసాగారు. బదిలీ ఉత్తర్వులు వచ్చినా దాదాపు జిల్లాలోనే మూడు నెలలు ఆమె కొనసాగటం వెనుక మంత్రి కృషి ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఎట్టకేలకు జనవరి 21న మురళి జిల్లాలో బాధ్యతలు స్వీకరించటంతో అనివార్య పరిస్థితుల్లో ఉషాకుమారి రిలీవ్ అయ్యారు. అయినా ఆమె శ్రీకాకుళంలో విధుల్లో చేరకుండా ఉండిపోయారు. జేసీ మురళి కూడా రాజ్యసభ నోటిఫికేషన్ వస్తే కోడ్ అమలులోకి వస్తుందనే కారణంగానే జిల్లాలో చేరారు.
     
    ఉడా వైస్ చైర్మన్‌గా నియామకం
     
    ఉషాకుమారి జిల్లాలో ఐఏఎస్ స్థాయి పోస్టింగ్ కోసం కసరత్తు చేసి ఉడా వైస్‌చైర్మన్‌గా శుక్రవారం నియమితులయ్యారు. సరిగ్గా జిల్లాలో రిలీవైన 12 రోజులకే మళ్లీ ఇక్కడే పోస్టింగ్ దక్కించుకోవటం వెనుక పెద్ద ఎత్తున పొలిటికల్ లాబీయింగ్ నడిచినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే బహిరంగంగా వ్యతిరేకించినా మంత్రి మాత్రం చక్రం తిప్పినట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి తీరుపై అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై సీఎం వద్ద పంచాయితీ పెట్టే దిశగా నేతలు యత్నిస్తున్నారు.
     
    ఆమె కోసం...
     
    కేవలం ఉషాకుమారికి జిల్లాలో పోస్టింగ్ ఇవ్వటం కోసం ఉడా వైస్ చైర్మన్ రామారావుపై బదిలీ వేటు వేయటం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వకపోవటం విచారకరం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement